top of page

ఐక్యరాజ్య సమితికి ట్రంప్ ఎసరు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 27
  • 3 min read

ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి, శాంతి సౌభ్రాతత్వాలు నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి కొన్ని దశాబ్దాల నుంచి వారధిగా నిలుస్తోంది. దానికి అనుబంధంగా విద్య, వైద్య తదితర రంగాల్లో దేశాల మధ్య సమన్వయం కుదర్చడానికి సహాయ సహకారాలు అందించడానికి అనేక సంస్థలు కూడా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా అత్యున్నత విధాన నిర్ణాయక శక్తి కలిగిన భద్రతామండలి ఉండనే ఉంది. కానీ వీ{న్నింటికి ఇప్పుడు మూడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి) ఐక్యరాజ్యసమతి(యూఎన్‌వో)కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది. ఐక్యరాజ్యసమతిలో ప్రస్తుతం 190కిపైగా దేశాలకు సభ్యత్వం ఉండగా బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలని ట్రంప్ మహాశయుడు ఇప్పటికే 60 దేశాలకు ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే 25 దేశాలు ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ట్రంప్‌గారి శాంతి మండలిలో చేరగా.. మిగిలిన దేశాలు ఇంకా తమ స్పందనను తెలియజేయలేదు. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను రెండుగా చీల్చే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డ్ ఆఫ్ పీస్‌లోకి అన్ని దేశాలను తీసుకురావాలని ట్రంప్ బందం ప్రయత్నిస్తుంది అదే జరిగితే ఐక్యరాజ్యసమితి ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఈ అంతర్జాతీయ వేదికను ట్రంప్ సవాల్ చేయడం కొత్త కాదు. ఐక్యరాజ్యసమతి, దాని అనుబంధ సంస్థల నిర్వహణకు, పేద దేశాలు విపత్తులకు గురైనప్పుడు సహాయం చేసేందుకు వీలుగా సభ్య దేశాలన్నీ తమ స్థాయి ఆధారంగా విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రపంచంలోనే ధనిక దేశమైన అమెరికా ప్రతి ఏటా పెద్దమొత్తంలో నిధులు అందజేస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కన్నేశారు. తక్కువ సేవలు పొందుతున్న తమ దేశం అన్ని దేశాల కంటే ఎక్కువ విరాళం ఎందుకివ్వాలన్న ప్రశ్నను లేవనెత్తారు. వాటిని క్రమంగా నిలిపివేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిధులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. తన కార్యకలాపాలకు ప్రధానంగా అమెరికా నిధులపైనే ఆధారపడిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆ నిధులు అందకపోతే చేతులు కట్టేసినట్లు అవుతుంది. ఇక ఇప్పుడు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలికి పోటీగా అన్నట్లు ట్రంప్ ఏకపక్షంగా బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో దీనిపై అధికారికంగా ప్రకటన చేయడమే కాకుండా ముందుకొచ్చిన కొన్ని దేశాలతో సమావేశం కూడా నిర్వహించారు. హమాస్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల్లో సర్వం కోల్పోయి శిథిలమైన గాజాలో కాల్పుల విరమణ అమలు, పునర్నిర్మాణం, భద్రతా వ్యవహారాలను సమన్వయపర్చడానికి బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. గత ఏడాదే ఆ ఆలోచనను ట్రంప్ ప్రకటించినప్పుడు అది గాజా వరకే పరిమితమైన ఒక చిన్న సమన్వయ కమిటీ అని ప్రపంచ దేశాలు భావించాయి. మరోవైపు గాజాలో యుద్ధ విరమణకు వీలుగా గత సెప్టెంబర్‌లో 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని రూపొందించారు. దానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికకు యూఎన్ అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేయగా దాన్ని అంతర్జాతీయ సంస్థగా ఇప్పుడు తీర్చిదిద్దుతున్నారు. సంక్షోభ ప్రదేశాల్లో స్థిరత్వం, శాంతి, సుపరిపాలన లక్ష్యంగా ఆ బోర్డును కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ బోర్డుకు నిరవధిక ఛైర్మన్‌గా ట్రంప్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. బోర్డు చేసిన తీర్మానం ప్రకారం ఆయన చాన్నాళ్లు ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సభ్యులుగా ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉండనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు ఇప్పటికే యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్, పాకిస్తాన్, టర్కీ, హంగేరీ, మొరాకో, కొసావో, అర్జెంటీనా, పరాగ్వే సహా 25 దేశాలు ఆమోదం తెలిపాయి. అర్మేనియా, అజర్‌బైజాన్ కూడా అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. విడ్డూరమేమిటంటే బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే బిలియన్ డాలర్ల ఫీజు చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని షరతులతో ఆ బృందంతో జత కలిసేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నే కూడా అంగీకరించారు. అయితే చైనా, ఫ్రాన్స్, నార్వే దేశాలు శాంతి సంఘం ప్రతిపాదనను వ్యతిరేకించాయి. అయితే చైనా ఇంకా తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అలాగే భారతదేశం కూడా ఇంకా స్పందించలేదు. అయితే ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. తమ శత్రువైన రష్యా ఉండే ఆ బోర్డులో చేరేది డౌటే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. మొత్తంగా చూస్తే బోర్డ్ ఆఫ్ పీస్‌పై మెజారిటీ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ బోర్డ్‌కు ట్రంప్ అధ్యక్షుడు కావడం అనుమానాలు, ఆందోళనలకు తావిస్తోంది. కొత్త బోర్డు వల్ల ఐక్యరాజ్యసమతికి ప్రమాదం వాటిల్లుతుందని అంటున్నారు. ఇప్పటికే ఒక బలమైన వ్యవస్థ ఉండగా, దాన్ని కాదని ఇంకొకటి ఏర్పాటు చేయడం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరం చేసుకునేందుకే ఇటువంటి ఎత్తులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని పలు దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్‌లో సభ్యత్వం కోసం సుమారు 9వేల డాలర్లు ఫీజు, శాశ్వత సభ్యత్వం కోసం బిలియన్ డాలర్ల ఫీజు పెట్టడాన్ని పలు దేశాలు తప్పుపడుతున్నాయి. ఇలా వసూలయ్యే నిధులను గాజా పునర్నిర్మాణానికి వినియోగిస్తారట! ఆ సంగతెలా ఉన్నా ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేస్తున్నారని, రెండు పోటీ సంస్థలు ఉండటం శాంతి మాటెలా ఉన్న ప్రపంచాన్ని పీసులు(ముక్కలు) చేస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page