top of page

ఐటీ భవిత ‘కిల్ ’ అవుతోంది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 3 min read


దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు అన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల దుస్థితి.. ఈ నానుడి వందశాతం నిజమని చెప్పకనే చెబుతోంది. ఒకప్పుడు వైట్ కాలర్ జాబ్‌గా గుర్తింపు పొందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే మిన్నగా భావించేవారు. హోదాకు, దర్జాకు, విలాసాలకు దాన్ని పర్యాయపదంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఒకరోజు హ్యాపీగా గడిస్తే చాలు.. హమ్మయ్యా ఈ రోజు గట్టెక్కింది.. అని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దిగ్గజ కంపెనీలు కూడా లే ఆఫ్స్ కత్తి పట్టుకుని తమ పరిధిలో ఉద్యోగాలపై సామూహిక వేటు వేస్తున్నాయి. ఫలితంగా ఒకే ఒక్క కలంపోటుతో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు కోల్పోతున్నారు. ఇరాకిల్ సంస్థ దీనికి తాజా ఉదాహరణ. ముందస్తు నోటీసులు లేవు.. సమావేశాల్లేవు.. కనీసం ఫోన్ సమాచారం కూడా ఇవ్వకుండానే ముప్పై వేలమంది జీవితాలపై ఆ సంస్థ యాజమాన్యం ఉరుము లేని పిడుగులా విరుచుకుపడి 30 వేల కుటుంబాలను చీకట్లలోకి నెట్టేసింది. తెల్లవారుజామునే ఉద్యోగం ఊడబీకేశామంటూ ఈ మెయిల్ ద్వారా చావు కబరు చల్లగా చేరవేసింది. అలా ఉద్యోగాలు కోల్పోయినవారి జాబితాలో ఒక్క ఇండియా నుంచే సుమారు 12వేల మంది ఉన్నారు. ఒక్క మెయిల్‌తో మాజీలుగా మారిన వారి కన్నీటి గాధలు వింటే ఒరాకిల్ యాజమాన్యంపై ఆగ్రహం కట్టలు తెంచుకోకమానదు. ఏడు నెలల గర్భవతి అయిన తన భార్యను తొలగిస్తున్న కఠిన సమాచారాన్ని నిద్రలేచే సమయానికే చేరవేశారని, ఈ అనుకోని పరిణామాన్ని గర్భవతి అయిన ఆమె ఎలా తట్టుకోగలదని ఆమె భర్త లింక్‌డిన్‌లో పోస్టు పెట్టారు. తమకు 17 నెలల బాబు ఉన్నాడని, ఈ సమయంలో ఉద్యోగం నుంచి తొలగించి రోడ్డున పడేయడం ఏంటని మరో ఉద్యోగి ఆక్రోశంతో ప్రశ్నించాడు. ఒక్క రాత్రితో అంతా తారుమారైంది. కుటుంబ బాధ్యతలు, ఫైనాన్షియల్ కమిట్‌మెంట్స్‌ను గుర్తు చేసుకుని బెంగళూరుకు చెందిన హషికేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒరాకిల్‌లో గ్రూప్ మేనేజర్‌గా ఉన్న ఆయన కూడా లే ఆఫ్ బాధితుడే. 16 ఏళ్లుగా సంస్థకు సేవలు చేస్తున్న తన భవిష్యత్తు ఇలా అగమ్యగోచరంగా మారుతుందనుకోలేదని ఆవేదనతో అన్నారు. అయితే ఒరాకిల్ తనను ఒక లీడర్‌గా తీర్చిదిద్ది జీవితాన్ని షేప్ చేసింది. ఆ అనుభవంతో ఈ పరిణామాన్ని ఛాలెంజ్‌గా స్వీకరిస్తానని హషికేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. మరో ఉద్యోగి కుమారుడి ఆవేదన మరోలా ఉంది. ‘మా నాన్న రెండు దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే బాస్ కింద సేవలు అందించారు. కనీసం దానికి కతజ్ఞతగానైనా ఒక్క ఫోన్ కాల్ అయినా చేయకుండా తొలగించారు’ అని ఆ యువకుడు ఆగ్రహం ప్రకటించాడు. మా నాన్నకు క్యాన్సర్ ఉంది. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది. క్యాన్సర్‌తో ఇప్పుడు ఆయన కొత్త ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి కూడా లేదని ఆవేదన చెందాడు. ఐటీ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో ఏకంగా 12వేల మందిని తొలగించడం, రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఉంటాయన్న సంకేతాలు పంపడం ఐటీ హబ్ నగరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఈ లేఆఫ్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ రాకతో టెక్కీల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా, వారి సొంతింటి కల కూడా చెదిరిపోయే స్థితికి పరిస్థితులు మారటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తోంది. గోరు చుట్టుపై రోకటిపోటు మాదిరిగా ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో అమెరికా మీద కోపంతో ప్రఖ్యాత ఐటీ కంపెనీలపైనా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇప్పటికే అమెజాన్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సిలికాన్ సిటీ బెంగళూరులోని సర్జాపూర్, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో కొత్తగా అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు సిద్ధమైన టెక్కీలు వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల ప్రీమియం, లగ్జరీ అపార్ట్‌మెంట్ల అమ్మకాలు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఏ ఉద్యోగం ఉంటుందో.. ఏది ఊడుతుందో తెలియని సందిగ్ధత మధ్య కోట్ల రూపాయల హోమ్ లోన్ తీసుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. కాగా ఇప్పటికే ఫ్లాట్లు, ఇళ్లు కొన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ప్యాకేజీ ఉన్న టెక్కీలు ధైర్యంగా రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్లను బాం్యకు రుణాలు తీసుకుని కొన్నారు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో నెలకు లక్ష రూపాయలకు పైగా చెల్లించాల్సిన ఈఎంఐ భారం చాలా ఫ్యామిలీలను కుంగదీస్తోంది. ఒరాకిల్ ఇచ్చిన సెవరెన్స్ ప్యాకేజీ కేవలం కొన్ని నెలల ఈఎంఐలకు మాత్రమే సరిపోతుంది. ఆలోగా మరో ఉద్యోగం దొరకడం కష్టమైతే అపార్ట్‌మెంట్‌ను అమ్ముకోవాల్సి వస్తుందని లేదా బ్యాంకులు జప్తు చేస్తాయనే ఆందోళన ఇప్పుడు టెక్కీలను వెంటాడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తుండటంతో ఐటీ కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. మనుషుల కంటే యాంత్రిక శక్తికే ప్రాధాన్యత ఇస్తుండటంతో టెక్కీల ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్లేనని అనుకున్న వారు ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల బెంగళూరులో రెంటల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అపార్ట్‌మెంట్ల అమ్మకాలు మాత్రం పడిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం టూరిజం, ీVAటల్ తదితర అనేక రంగాలను కూడా కుంగదీసే ప్రమాదం ఉంది. ఒరాకిల్ లేఆఫ్స్ కేవలం ఒక కంపెనీ సమస్యగా కాకుండా దేశంలోని ఐటీ హబ్‌లను దెబ్బతీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page