కొత్త నేపథ్యం - పాత కథ?
- Guest Writer
- Sep 6, 2025
- 3 min read

రివేంజ్ (ప్రతీకారం) కథలు ఎప్పుడూ రక్తంతో ముగుస్తాయి. కానీ ప్రేక్షకుడికి గుర్తుండిపోయేది రక్తం కాదు, బాధ. కానీ ‘‘ఘాటి’’లో ఆ బాధ మిస్సైంది. రక్తం ఖర్చైంది.
తూర్పు ఘాట్లలో దాక్కున్న ఓ రహస్య గ్యాంగ్.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లిక్విడ్ గంజాయి. అదీ ‘‘శీలావతి’’ అనే శక్తివంతమైన గంజాయితో తయారైన మత్తు పదార్థం! మార్కెట్‌లో సంచలనం ! ఆ సంచలనం అప్పటికే ఆ వ్యాపారంలో ఉన్న వారికి భయాన్ని పుట్టిస్తోంది. ముఖ్యంగా ఈ సీక్రెట్ గ్యాంగ్ చేస్తున్న వ్యాపారం.. అక్కడ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఇన్నాళ్లుగా గంజాయి వ్యాపారాన్ని తమ చేతుల్లో పెట్టుకుని, కట్టడి చేసి, పూర్తి ఆధిపత్యం వహిస్తున్న కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) అనే అన్నదమ్ములకు నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. ఎవరీ ఈ కొత్త గ్యాంగ్? ఎలా వారి ప్రాంతంలోకి వచ్చి, వారి బిజినెస్ లో అడుగుపెట్టారు? అనేది అర్దం కావటం లేదు. దాంతో ఎంక్వైరీ మొదలెడతారు. రాత్రింబవళ్లూ తమ మనష్యుల చేత వెతికిస్తారు. అందుకు ఓ పోలీస్ (జగపతిబాబు) సహకరిస్తూంటాడు. ఆ ఎంక్వైరీలో బయటపడిన నిజం వారికి షాక్ ఇస్తుంది. ఈ లిక్విడ్ గంజాయి వెనుక ఉన్న గ్యాంగ్ లీడర్ మరెవరో కాదు, ఒక సాధారణ ల్యాబ్ టెక్నీషియన్ దేశి రాజు (విక్రం ప్రభు), అలాగే అతని తోడుగా నిలిచింది బస్ కండక్టర్ శీలావతి(అనుష్క). వీళ్లిద్దరూ అక్కడ వాళ్లే. అంతకుముందు ఆ బిజినెస్‌లో ఘాటీగా పనిచేసి తప్పుకుందామనుకున్న వాళ్లే. త్వరలో పెళ్లి చేసుకుందామనుకుంటున్న ఈ జంట పైకి ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు కనపడుతూనే రహస్యంగా ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారం మొదలెట్టి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారన్నమాట.అయితే ఇలాంటి ఒక సాధారణ జంట (దేశి రాజు, శీలావతి)ఇంత పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లోకి ఎందుకు దూకారు? ఈ విషయం తెలిసాక తమ వ్యాపారానికి దెబ్బకొడుతున్న వాళ్లని నాయుడు బ్రదర్శ్(విలన్స్) పట్టుకుని ఏం చేసారు, చివరకు ఏం జరిగింది. ఇందులో ఘాటీలు పాత్ర ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కొంతకాలంగా సినిమా వాళ్లు సినిమా కథ తయారు చేసుకోవటానికి ముందు ఓ కొత్త నేపధ్యం దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. అది దొరక్కాగనే మిగతా కథ అంతా ఈజీగా చుట్టేస్తున్నట్లు రెడీ చేసేస్తున్నారు. అంతేతప్పించి దాన్ని అంతే ఇంట్రస్టింగ్‌గా తయారు చేయటంలేదు. ఈ సినిమాదీ అదే పరిస్దితి. సినిమాకు ఘాటీలు అనే నేఫధ్యం దొరికింది. అంతే అందులోకి ఓ రొటీన్ రివేంజ్ కథను తీసుకొచ్చి ఇరికించి కొత్త సినిమా అనే ఫీల్ కలిగించాలనే ప్రయత్నం చేసారు. అయితే అది ఎక్కడ దాకా సక్సెస్ అయ్యిందంటే కేవలం నేపధ్యం దాకానే బాగున్నట్లు అనిపించింది. మిగతాదంతా రొట్టకొట్టడుగానే అనిపించింది.
ఘాటికి బేస్‌లైన్... ఒక బాధితురాలు... క్రిమినల్‌గా మారి న్యాయం చేయాలనుకోవటం, అందులో వచ్చే కష్టనష్టాలు. ఇది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఎన్నోసార్లు వచ్చిన ట్రాజెక్టరీ. కానీ క్రిష్ దీన్ని కొత్తగా చూపించడానికి ఘాటీలు, పశ్చిమ ఘాట్లు, గంజాయి లిక్విడ్ వ్యాపారం అనే నేపధ్యం ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో శీలావతి - దేశిరాజు సాధారణ పనులు చేసుకుంటూ, తరువాత గంజాయి బిజినెస్‌లో ఎందుకు దిగారో చూపించడం బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే కథ రివేంజ్ కథగా అదీ రొటీన్ రివేంజ్ కథగా మారిపోయింది. మనం ముందే చూసిన ‘‘విలన్ గ్యాంగ్ ద్రోహం ? హీరో మరణం ? హీరోయిన్ ప్రతీకారం.’’ అనేవి తెర మొత్తం నిండిపోయాయి.
దాంతో సినిమాలో కొన్ని హై మోమెంట్స్ బాగానే వర్కౌట్ అయినా, ఎక్కువ శాతం ప్రెడిక్టబుల్‌వి కావడంతో ఎమోషనల్ పంచ్ తగ్గింది. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ది గాఢ్ ఫాధర్ దర్శకుడు ప్రాన్సిస్ ఫోర్డ్ కోప్పులా అన్న ఒక మాటను గుర్తు చేసుకోవాలి. ‘‘‘‘ఒక సినిమా ఎప్పుడూ మాఫియా గురించి, లేదా యుద్ధం గురించి లేదా గ్యాంగ్‌స్టర్ల గురించి కాదు. ఇది కుటుంబం గురించి, అంతర్లీనంగా ఉన్న మానవ పోరాటం గురించి. ఇది కథాంశం.’’ వాస్తవానికి ఇక్కడ కూడా గంజాయి స్మగ్లింగ్ అనేది ఒక ఫెకేడ్ మాత్రమేగా ఉండాలి. ఇది శీలావతి అనే స్త్రీ ప్రయాణంగా అనిపించాలి. కానీ ఆ జర్ని తగ్గిపోయి..మాఫియా గోల ఎక్కువైపోయింది. ప్రతీ సినిమా పుష్ప అవ్వదు కదా.
ఏదైమైనా ‘‘ఘాటి’’లో కొత్తది నేపథ్యం. పాతది నేరేషన్. ఫస్ట్ హాఫ్ ‘‘ఇది కొత్తగా ఉంది’’ అనే కుతూహలం. సెకండ్ హాఫ్ ‘‘ఇది మనం చూసిందే’’ అనేదే..
టెక్నికల్‌గా:
దర్శకుడు క్రిష్ ఈసారి రచయితగానూ తన స్టైల్ చూపించలేకపోయారు. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇది బాగా కమర్షియల్‌గా కనిపిస్తుంది. సీజీలపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సాయి మాధవ్ డైలాగ్స్ జస్ట్ ఓకే అన్నట్లు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. సాగర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎడిటింగ్‌లో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
నటీనటుల్లో:
ఈ సినిమా పూర్తిగా అనుష్క వన్ ఉమెన్ షో. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, ఫైట్స్.. ఆల్‌రౌండ్‌గా ఆకట్టుకుంది. ఫైట్ సీన్స్‌కి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. విక్రమ్ ప్రభు పాత్ర బాగుంది. జగపతిబాబు రోల్ అద్భుతంగా రాసుకున్నారు. చైతన్య రావు తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. రవీంద్ర విజయ్ కూడా బాగా చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే న్యాయం చేశారు.
- జోశ్యుల సూర్యప్రకాష్










Comments