top of page

కొత్త పింఛన్లు ఎప్పుడు సారూ..

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 1 day ago
  • 3 min read
  • అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి అసలైన సవాల్

  • ఆశగా ఎదురు చూస్తున్న 12 లక్షల మంది

(సత్యంన్యూస్, అమరావతి )

ప్రభుత్వం మారిన తరువాత పింఛన్ల పెంపుతో పండగ వచ్చింది. వేలాది మంది కళ్లల్లో మాత్రం ఇంకా నిరీక్షణే మిగిలి ఉంది. ‘ఎన్టీఆర్ భరోసా’ కింద పెంచిన పింఛన్ అందుతున్న పాత లబ్ధిదారుల సంతోషం ఒకవైపు కనిపిస్తుంటే, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ‘అనుమతి’ రాని కొత్త దరఖాస్తుదారుల ఆవేదన మరోవైపు కనిపిస్తోంది. కొత్త పింఛన్ల పోర్టల్ ఎప్పుడు తెరుస్తారని పండుటాకులు కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయి.

వయసు భారంతో.. ఆశగా ఎదురుచూస్తున్న పండుటాకులు:

రాష్ట్రంలో సుమారు 63 లక్షల మంది ఇప్పటికే ఈ ఫలాలను అందుకుంటున్నప్పటికీ, మరో 12 లక్షల మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రీ సర్వేలో సుమారు లక్ష మంది వరకు అనర్హులను గుర్తించారు. ఆ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందనేది ప్రభుత్వ సందేహం. దీనివల్ల కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చెబుతున్నా, ఆర్థికభారం వల్లే ఆచుతూచి వ్యవహరిస్తున్నట్లు పరిస్థితి చెక్కచనే చెబుతోంది.

సామాజిక పింఛన్లలో వృద్ధుడిగా ఉన్న భర్త చనిపోతే ఆ స్థానంలో భార్యకు ఇవ్వడానికి మాత్రమే సాంకేతికంగా అవకాశం ఉంది. జిల్లాలో కనీసంగా వారానికి డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు కనీసంగా 200 దరఖాస్తులు వస్తున్నాయి.

గత ప్రభుత్వంలో 65.18 లక్షల పింఛన్లు ఇచ్చారు. తమ ప్రభుత్వం 63.71 లక్షల పింఫన్ల ఇస్తోందని సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. మే నెల నుం, 93 వేల మంది వితంతువులకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పినా, సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. ఆయన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల మంది పింఛన్లకు అనర్హులుగా గుర్తించారు.

రాష్ట్ర జనాభాలో 12.88 శాతం ప్రజలకు సామాజిక పింఛన్లు ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పి ఏడాది కావస్తున్నా, ఇంతవరకు కార్యాచరణ ప్రారంభం కాలేదు. దీంతో అర్హులకు నిరీక్షణ తప్పడం లేదు.

కూటమికి మైలేజ్ తెచ్చిన పింఛన్లు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పింఛన్ల పంపిణీలో నూతన అధ్యాయం అనడం కంటే, పింఛన్ల మొత్తం పెంపు కూటమి ప్రభుత్వానికి పెద్ద మైలేజీ తెచ్చింది. ఒకేసారి రూ. 4 వేలకు పింఛన్ పెంచి వృద్ధులు, వితంతువుల ఇళ్లలో వెలుగులు నింపిన మాట వాస్తవం. ఈ వెలుగులు కేవలం పాత లబ్ధిదారులకే పరిమితమయ్యాయా? అనే సందేహాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో 29,86,023 మంది వయోవృద్ధులకు నెలకు నాలుగు వేల వంతున రూ.1,194.41 కోట్లు, 7,65,820 మంది దివ్యాంగులకు ఆరు వేలు వంతున రూ.459.49 కోట్ల రూపాయలు, వితంతువులు 17,35,963 మందికి నాలుగు వేల వంతున రూ.694.39 కోట్ల రూపాయలు పింఛన్లు ప్రతినెలా చివరిలో పంపిణీ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతు పింఛన్లు పెంచుతాం అని 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే.. 2024 జూన్ నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ పింఛన్ల పెంపు ఫైల్‌పై సంతకం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛను రూ. మూడు వేల నుంచి రూ. నాలుగు వేలకు పెంచారు. దివ్యాంగుల పింఛన్లు రూ. మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు. వికలాంగులకు: పూర్తిగా మంచానికే పరిమితం, లేదా తీవ్ర వైకల్యం ఉన్నవారికి పింఛన్ రూ. ఐదు వేల నుంచి రూ. 15 వేలు, కొందరికి రూ. పది వేలు చెల్లిస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి జూలై ఒకటో తేదీ పంపిణీ చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలను (నెలకు రూ. వెయ్యి, చొప్పున రూ.3,000) కలిపి మొత్తం రూ. ఏడు వేలు ఒకేసారి లబ్ధిదారులకు అందించారు.

2024 ఎన్నికల మేనిఫెస్టో:

అధికారంలోకి రాగానే ఏటా క్రమబద్ధమైన సర్వేలు నిర్వహించి అర్హులందరికీ కొత్త పింఛన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పింఛను మొత్తం పెంచడంలో కూటమి తన హామీని అమలు చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిపై కరుణ చూపకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. “కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సూపర్ 6 హామీల్లో భాగంగా పింఛన్ మొత్తం పెంచింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులు, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక సచివాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.

రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ లెక్కలు చెప్పడానికి రాష్ట్రంలో ఏ అధికారి ముందుకు రావడం లేదు. ఎందుకంటే కొత్త పింఛన్ల కోసం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి వచ్చిన దరఖాస్తుదారులందరూ అర్హులని చెప్పలేమనేది అధికారుల వాదన. మరోవైపు దరఖాస్తులు స్వీకరించడానికి కూడా గ్రీవెన్స్‌లో ఆప్షన్ లేకుండా పోతోంది. సామాజిక పింఛన్ల పోర్టల్‌లో కూడా ఈ దరఖాస్తులు నమోదు చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్టంగా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనేది చెప్పడం కష్టం. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు తక్కువలో తక్కువ అంటే 12 లక్షల మంది వరకు కొత్త పింఛన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం లభించలేదు.

బడ్జెట్ కేటాయింపులు, పింఛన్ల పంపిణీతో పెరిగిన ఆర్థిక భారం వల్లే ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరులో తాత్సారం చేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. జాప్యానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయాలు, నగరాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహించిన సర్వేలో లోపాలు ఉండడం, డేటా నమోదు చేయడంలో సమస్య వల్ల అర్హుల ఎంపికలో ఇబ్బంది ఏర్పడినట్టు ప్రభుత్వం చెబుతోంది.

రీ సర్వేతో వెలుగులోకి

టీడీపీ కూటమి ప్రభుత్వం 2025లో ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే రీ సర్వే చేయించింది. దీంతో 80 వేల నుంచి లక్ష మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారనే విషయం వెలుగుచూసింది. ప్రధానంగా దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి సమర్పించిన నివేదికల్లో తేడా ఉందనే విషయాన్ని గుర్తించారు. దీంతో అప్పటి నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్ ఓపెన్ చేయడం లేదు.

ఇదో ఉదాహరణ.. 1. శ్రీకాకుళం జిల్లాలో సదరం నకిలీ సర్టిఫికేట్లు అనేక చోట్ల బయటపడ్డాయి. దీంతో కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే కొందరు లేని డిజేబులిటీకి పింఛన్ తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రాజకీయ సిఫార్సులతో మంజూరు చేసిన పింఛన్ల వ్యవహారం అనేకచోట్ల బయటపడింది. పొందూరు మండలం ధర్మవరం, జలుమÖరు మండలం సైరిగాం, ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లలో 61మంది నకిలీ వికలాంగ సర్టిఫికేట్లతో పింఛన్లు తీసుకుంటున్నారని తేలింది. వీరిని మళ్లీ రీ వెరిఫికేషన్‌కు రమ్మని నోటీసులు ఇస్తే ఇందులో మÖడొంతులమంది హాజరు కాలేదు. వచ్చిన వారిలో కేవలం 10లోపే పింఛన్‌కు అర్హులయ్యారు. అలాగే పొందూరు మండలం తోలాపిలో 23మంది అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారని తేలడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. మరో 82మంది నకిలీ వికలాంగ సర్ఫిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. అందుకే ప్రభుత్వం కొత్త పింఛన్లు మీద ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. కానీ ఒంటరి మహిళలు, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైనవారు ఈ రెండేళ్లలో ఎక్కువయ్యారు. వీరందరూ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రీ-సర్వేలో భాగంగా రేషన్ కార్డులు డేటా అనలిటికల్స్ ద్వారా కొన్ని లోపాలు కూడా గుర్తించారు. కొందరు లబ్ధిదారుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా భారీగా ప్రయోజనం పొందుతున్నా పింఛన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. దీంతో వారిని లబ్ధిదారులను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. తద్వారా పింఛన్లకు అర్హత లేకుండా పోయింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ కారణాల నేపథ్యంలో సామాజిక పింఛన్లపై పూర్తి స్థాయిలో సర్వే చేయించిన తరువాత కానీ, కొత్తగా దరఖాస్తులకు ఉండవనేది ఖాయం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page