కుదిరిన సమీకరణం.. రమేష్‌కే కిరీటం!
- Prasad Satyam
- 5 days ago
- 2 min read
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక
అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన
అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం
గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్‌నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారుకు హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో త్రిసభ్య కమిటీ పార్టీ నాయకులతో సమావేశమై.. టీడీపీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి తన అభిప్రాయాన్ని పార్టీ ముందు ఉంచి చాలాకాలమైనా అధ్యక్షుడి ఎంపికకు ఇన్నాళ్లు పట్టడానికి కారణం ఏమిటి? వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడి ఎంపికలో తకరారు వల్లే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అధ్యక్షుల ప్రకటన ఆలస్యమైంది. అధికారంలో ఉన్నాం కదా.. అని నామ్ కే వాస్తేగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని నియమించడానికి పార్టీ అధిష్టానం ఇష్టపడలేదు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉండటం వల్ల ఎవరో ఒకరు అధ్యక్షులుగా ఉంటే సరిపోతుందని భావించలేదు. రాజకీయ పదవులంటేనే కులాల సమతూకం పాటించాలి. అటువంటిది ఒకే కులం నుంచి ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపాలన్నది పార్టీకి అగ్నిపరీక్షలా మారింది. చౌదరి బాబ్జీ అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బలపరిస్తే, మొదలవలస రమేష్ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికి దగ్గరి బంధువు. వీరిద్దరికి పార్టీ కోసం అవసరమైతే నాలుగు రూపాయలు బయటకు తీసే శక్తి ఉన్నా, ఎవరికి ఇవ్వాలన్న మీమాంసలో పార్టీ పెద్ద కసరత్తే చేసింది.
దెబ్బతిన్న కుల, వర్గ సమతుల్యత
జిల్లాలో కాళింగ సామాజికవర్గానికే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత పోటీ మరింత బలంగా మారింది. ఈ సమయంలో అచ్చెన్నాయుడా? కూన రవా? అనే ప్రశ్న తలెత్తగా.. ఆ చిక్కుముడి విప్పడానికి పలు కమిటీలు రంగంలోకి దిగాయి. కూన రవికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, చివరి నిమిషంలో వెనక్కు తీసుకున్నారన్న ప్రచారం జిల్లాలో కాళింగులను తెలుగుదేశం పార్టీపై మండిపడేలా చేసింది. మంత్రి పదవి రాకపోయినా ఆ ప్రమాణస్వీకార ఘట్టం పూర్తయిన తర్వాత అమరావతిలో బయల్దేరి విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా వచ్చిన రవికుమార్‌కు జిల్లాలో కాళింగులు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పట్టారు. రవికుమార్‌కు పార్టీ అన్యాయం చేసిందన్న సందేశం ఈ సందర్భంలోనే బలంగా బయటకు వెళ్లింది. ఆ తర్వాత రవికుమార్‌కు ఏవేవో పదవులు ఆఫర్ చేసినా చివరికి చంద్రబాబు బలవంతం మీద ప్రజాపద్దుల కమిటీ తప్ప ఆయన దేన్నీ తీసుకోలేదు. కాళింగుల్లో వ్యతిరేకత ఉందని పార్టీ, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన రిపోర్టుల మేరకు ప్రభుత్వం ముందుగా కళింగ కార్పొరేషన్ చైర్మన్‌ను ప్రకటించింది. అయితే ఇది ఒక ఆకస్మిక నిర్ణయంగా మారిపోయింది. వాస్తవానికి మొదలవలస రమేష్‌కు ఈ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ స్థానిక రాజకీయ అవసరాల మేరకు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన నియోజకవర్గానికి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుపట్టడంతో రోణంకి కృష్ణంనాయుడుకు దీన్ని కట్టబెట్టారు. ఇది అటు పార్టీకి గానీ, ఇటు కాళింగులకు గానీ పెద్దగా మైలేజ్ తీసుకురాలేదని ఆ తర్వాత టీడీపీ అధిష్టానానికి అర్థమైంది. కృష్ణంనాయుడుకు పదవి ఇచ్చినా కాళింగుల్లో అసంతృప్తి మాత్రం చల్లారలేదు. ఈ సామాజికవర్గానికి చెందిన మాధ్యమాల్లో టీడీపీ వ్యతిరేక ట్రోల్స్ ఆగలేదు. ఆ కుల పెద్దలుగా చెప్పుకునే కొందరు రహస్య సమావేశాలు నిర్వహించి పార్టీకి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేయడం ఆపలేదు. ఈ పరిణామాలను గమనించిన పార్టీ చౌదరి బాబ్జీ తనయుడు చౌదరి అవినాష్‌ను డీసీఎంఎస్ చైర్మన్ చేసింది.
అసంతృప్తి చల్లారుతుందా?
ఈ నియామకంతో పార్టీ ఒక కాళింగ యువ నాయకుడ్ని గుర్తించిందన్న మైలేజ్ వచ్చినా ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్గం మాత్రం పూర్తిగా నష్టపోయిందన్న భావన మరింత పెరిగింది. ఎందుకంటే.. రవికుమార్, చౌదరి బాబ్జీలది ఒకే సామాజికవర్గమైనా బాబ్జీ కుటుంబం మొదట్నుంచీ అచ్చెన్నాయుడు వెంటే ఉంది. అందువల్ల ఈ పదవి కూడా మంత్రి కోటాలోకే వెళ్లిపోయిందని భావించినవారు ఉన్నారు. అయినా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి చౌదరి బాబ్జీ కూడా పోటీ పడటంతో పార్టీ పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. మధ్యలో మొదలవలస రమేష్‌ను కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దుకుంది. ఇప్పుడు జిల్లా కాళింగుల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను చల్లార్చాలంటే కూన రవి వర్గానికి చెందినవారికే పదవి ఇవ్వాలన్న పార్టీ ఇంటెలిజెన్స్ సూచన మేరకు బాబ్జీని కాదని మొదలవలస రమేష్‌కు ఇచ్చారు. ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడుకు వివరించారు. దీంతో అచ్చెన్నే స్వయంగా నియామక ప్రకటన విడుదల కాకముందే మొదలవలస రమేష్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్‌కు ఇవ్వడమే మంచిదన్న భావనతో మొదట్నుంచి ఉన్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్న కాళింగుల్లో మెజార్టీ వర్గాన్ని ఎలా చల్లబరుస్తారో చూడాలి.










Comments