దాసన్న మాట..కాళింగుల్లో మంట!
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 4 min read
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు
ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు
అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు
తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి
దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మాట్లాడాలన్నది రాజకీయ నాయకుడికి తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ఇదిగో ఇలా.. వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్‌లా దొరికిపోతారు. వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకలను అన్నిచోట్ల మాదిరిగానే టెక్కలిలో కూడా ఆదివారం నిర్వహించారు. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒక ప్రధాన సామాజికవర్గంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎంపీ అభ్యర్థిగా వేరే వారిని త్వరలోనే జగన్మోహనరెడ్డి నిర్ణయిస్తారని, ప్రస్తుతం పార్టీ పార్ల మెంట్ ఇన్‌ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంను రాజ్యసభ లేదా శాసనమండలి వంటి గౌరవప్రదమైన స్థానానికి పంపించి ఎంపీ అభ్యర్థిగా మరొకరిని తీసుకు వస్తారని కృష్ణదాస్ అన్నారు. ఇప్పుడు ఇదే రాంగ్ టైమ్ స్పీచ్‌గా మారింది. జిల్లాలో మెజార్టీ వర్గంగా ఉన్న కాళింగులు పూర్తిగా కొందరి చేతిలో నలిగిపోతున్నారని ఈ సామాజికవర్గ సీనియర్లను ఒక పథకం ప్రకారం తొక్కేస్తున్నారన్న అభిప్రాయం బలంగా నాటుకుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కాళింగులకు మంత్రి పదవి ఇవ్వలేదని, కూన రవికుమార్‌ను చివరి నిమిషంలో ఆ యోగం నుంచి తప్పించారని కాళింగులు రగిలిపోతున్నారు. దీన్ని చల్లార్చడానికి టీడీపీ ఇప్పటికీ పడరాని పాట్లు పడుతోంది. వైకాపా హయాంలో కాళింగులకు ప్రాధాన్యమిచ్చినా రాజ్యాధికారంలో పాత్ర లేకుండా పోయిందన్న భావన, వాదన కూడా ఈ మధ్యే తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో తమ్మినేనిని స్పీకర్‌గా నియమించడం వల్ల కేబినెట్‌లో స్థానం దక్కకుండా పోయిందని, రెండున్నరేళ్ల తరువాత ఆయన్ను మంత్రి చేస్తారని భావించినా ఆ మేరకు జరగకపోవడంతో అటు వైకాపా, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ వెలమ సామాజిక వర్గం నేతలకు పెద్దపీట వేశారన్న భావన కలిగింది.
వారేనా చక్రం తిప్పేది?
ఇప్పుడు కృష్ణదాస్ వ్యాఖ్యలు ఈ వేడిని మరింత పెంచాయి. ఇప్పటికే తమ సామాజికవర్గంలో అత్యంత సీనియర్ అయిన తమ్మినేని సీతారాంను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం వారిలో చాలామందికి ఉంది. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన్నే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుపుతారని భావించిన వారూ లేకపోలేదు. ఇటువంటి సమయంలో సీతారాం ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండరన్న విధంగా కృష్ణదాస్ మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆమదాలవలస నియోజకవర్గంలో సీతారాం ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన్ను తప్పించి చింతాడ రవికుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారని భావించేవారూ ఉన్నా రు. ఇప్పుడు సీతారాంను పెద్దల సభకు పార్టీ పంపిస్తుందని చెప్పడం ద్వారా మరో వివాదానికి తెర తీసిన ట్లయ్యింది. ఇదే విషయాన్ని జగన్మోహనరెడ్డి తనవద్దకు సీతారాంను పిలిపించి నేరుగా చెప్పి, ప్రకటన చేయిస్తే ఒకలా ఉండేది. ఏ సామాజికవర్గ నాయకులైతే తమను తొక్కేస్తున్నారని కాళింగులు భావిస్తు న్నారో అదే సామాజికవర్గానికి చెందిన కృష్ణదాస్ ఈ విషయం మాట్లాడటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వైకాపా అధికారంలో ఉంటే ధర్మాన సోదరులు, టీడీపీ అధికారంలో ఉంటే కింజరాపు తండ్రీకొడు కులు చక్రం తిప్పుతున్నారని, కృపారాణి కేంద్రమంత్రిగా పని చేసిన తర్వాత ఇప్పటి వరకు కాళింగులను మంత్రి పదవిలో చూడలేకపోయమన్న భావన వీరిలో ఉంది.
సత్తా చాటేందుకు సన్నాహాలు
అందువల్ల జిల్లా నుంచి కాళింగుల ఐక్యతపై అన్ని పార్టీల అధిష్టానాలకు బలమైన వాయిస్ వినిపిం చాలని ఆ సామాజికవర్గ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీముఖలింగంలో బాలియాత్ర నిర్వహిం చినా ఇది కాళింగులది మాత్రమే కాదని, ఉత్కళాంధ్రలో నివశిస్తున్న వారందరి పండుగ అనే సంకేతం రావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఈనెల 28న ఎచ్చెర్లలో కాళింగ సామాజికవర్గం పెద్ద ఎత్తున సమా వేశమవుతోంది. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో 25 వేల కుటుంబాలతో పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఎక్కడా రూపాయి డొనేషన్ తీసుకోకుండా కొందరు పెద్దల సహకారంతో ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సమావేశం ద్వారా ఏ పార్టీ అయినా కాళింగులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న సంకేతాలు పంపనున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పదేపదే ధర్మాన సోదరులను టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం కూడా ఇదే. ప్రత్యేక ప్యానెల్ రూపొందించి ధర్మాన సోదరులపై కాళింగులను పోటీకి దించుతాననడం వెనుక ధైర్యం కూడా ఇదే. పార్టీలకతీతంగా జనాభా నిష్పత్తి మేరకు తమకు మంత్రి పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు లేకపోలేదు. పలాసను కొత్త జిల్లాగా ప్రకటిస్తే తమకు పెద్దఎత్తున మేలు జరుగుతుందని భావించిన కాళింగ సామాజికవర్గ నేతల ఆశలపై కింజరాపు కుటుంబం నీళ్లు చల్లిందన్న భావన కూడా ఆ వర్గం నేతల్లో ఉంది. ఒకవైపు కృపారాణికి, మరోవైపు సీతారాంకు, తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న పిరియా విజయకు, టీడీపీలో కూన రవికుమార్‌తోపాటు బెందాళం అశోక్ లాంటి ఎందరికో అన్యాయం జరిగిందన్న భావన ఇటీవల పిక్నిక్ కోసం జరిగిన సన్నాహక సమావేశంలో పలువురు వ్యక్తం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీలో సీతారాం లాంటి సీనియర్లకు వేరేచోట బెర్త్ వేసినపుడు పార్టీ అధినాయకుడు ముందుగా ప్రకటిస్తే ఎటువంటి గొడవ ఉండదు. కానీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించడం ముసలం పుట్టించింది.
ఆజ్యం పోసిన వ్యాఖ్యలు
ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఇక తాము ఉండలేమంటూ పిరియా సాయిరాజ్ దంపతులు స్వయంగా జగన్మోహనరెడ్డికే స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలో పోటీకి సాయిరాజ్ కుటుంబం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల జరిగిన భేటీలో జగన్మోహనరెడ్డి చెప్పినపుడు తమ నియోజకవర్గ పార్టీలో 100 గ్రూపులు తయారుచేశారని, వీరందరూ ఒక్కతాటిపైకి రాకుండా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని, అటువంటి చోట పోటీలో ఉండి మరోసారి అవమానపడే కంటే తప్పుకోవడమే మేలని సాయిరాజ్ జగన్ సమక్షంలోనే స్పష్టం చేశారు. ఇక్కడ గ్రూపులకు కారణం ధర్మాన సోదరులేనన్న భావన సాయిరాజ్‌లో ఉంది. ఇది కొంతమేరకు వాస్తవం కూడా. అక్కడ ఎమ్మెల్సీగా నర్తు రామారావును కూర్చోబెట్టి రెడ్డిక సామాజికవర్గం ఎక్కువ కాబట్టి వారికి టికెట్ ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు కోరుతుండడం వల్ల ఈ గ్రూపులు ఎప్పటికీ ఒక్కటి కావనేది సాయిరాజ్ భావన. పార్టీలో ఉండి నష్టపోయిన కాళింగ సామాజికవర్గ కుటుంబాల్లో వీరిది కూడా ఒకది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో అధికారులు, బదిలీల ప్రక్రియలో కాళింగ అధికారులకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ మధ్య ఒక రహస్య సమావేశంలో చర్చించుకున్నారు. వీటన్నింటిపైనా గుర్రుగా ఉన్న కాళింగులు 28న అగ్గి రాజేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో సీతారాంను వేరేచోటికి పంపిస్తారంటూ కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. వాస్తవానికి కృష్ణదాస్ మాటల్లో మర్మం గానీ లౌక్యం గానీ లేదు. ఇది అధిష్టానం నిర్ణయమే. కాకపోతే రాంగ్ టైమింగ్ అంతే. 2024 ఎన్నికలకు ముందు జిల్లాలో టీడీపీ లేదని, ఉన్నదంతా కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాత్రమేనని, ఆయన బలంగా ఉండడం వల్ల టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ను ఓడిస్తే టీడీపీ కంచుకోట కూలిపోవడం ఖాయమని వైకాపా తరఫున ఎంపీగా పోటీ చేసిన తిలక్ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామ్మోహన్‌నాయుడును ఓడిరచే వరకూ ఈ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారనేది ఆయన ఉద్దేశం. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు కూడా వైకాపా అధిష్టానం అదే భావించి ఉండవచ్చు. రామ్మోహన్‌నాయుడును ఢీకొట్టగలిగే ఎంపీ అభ్యర్థి కోసం గాలం వేస్తుండవచ్చు. ఎందుకంటే రామ్మోహన్‌నాయుడు మీద ప్రతిసారీ కాళింగ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టడం, వారు ఓడిపోతుండటంతో ఈసారి వెలమలను వెలమలతోనే కొట్టాలన్న ఒక సమీకరణం కూడా ఆ మధ్య తెరపైకి వచ్చింది. అలాకాని పక్షంలో బలమైన కాపు నాయకుడిని ఎంపీగా నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా ఉంది. జిల్లాలో ఆ మేరకు కాళింగులు ఒక సీటు నష్టపోతారు కాబట్టి సీతారాంను పెద్దల సభకు పంపుతామని కృష్ణదాస్ అని ఉండవచ్చు. అయితే ఇది పూర్తిగా రాంగ్ టైమింగ్.










Comments