సీతారాం నా బావ.. మా అనుబంధం విడదీయలేనిది!
- SATYAM DAILY
- 1 day ago
- 1 min read
నా మాటల్లో స్వార్థం లేదు
పార్టీ విజయమే నా లక్ష్యం
వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్

(సత్యంన్యూస్, నరసన్నపేట)
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాపతిగా ఆ పదవికి వన్నె తెచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీతారాంను ఆప్యాయంగా బావ అని పిలుచుకుంటానని, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా అవినాభావ స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ్మినేని అంటే తనకెంతో గౌరవమని, అటువంటి వ్యక్తిని తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని స్పష్టం చేశారు. టెక్కలిలో ఇటీవల ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటల వెనుక ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం లేదని, సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం తన అభిమతం కాదని కృష్ణదాస్ పేర్కొన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని తప్పుగా భావించవద్దని కోరారు. తాను ఏం మాట్లాడినా అందులో వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవని, పార్టీ కోసం పనిచేసే ఒక నిరంతర సైనికుడిగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నానని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. టెక్కలిలో జరిగిన సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం అయినా, తానైనా, పార్టీలో ఎవరైనా అధిష్టానం ఆదేశాల మేరకే పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపొందడానికి పార్టీ కొన్ని కీలక వ్యూహరచనలు చేస్తోందన్నారు. యువతను ప్రోత్సహించాలన్నది కూడా పార్టీ ఆలోచన కావొచ్చని, దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు ఉంటాయి తప్ప, ఎవరినీ అణచివేయడం తమ ఉద్దేశం కాదని కృష్ణదాస్ అన్నారు. టికెట్ల కేటాయింపు లేదా పదవుల మార్పు అనేది పూర్తిగా జగన్మోహన్‌రెడ్డి పరిధిలోని అంశమని, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తన వ్యక్తిత్వం, పార్టీ పట్ల తనకున్న క్రమశిక్షణ, అంకితభావం జిల్లాలోని ప్రజలందరికీ తెలుసని కృష్ణదాస్ అన్నారు. ‘దాసన్న’గా పార్టీ కోసం నిరంతరం శ్రమించే సైనికుడిగా ఉండే తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, జగన్మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంగా చూడాలన్నదే అంతిమ లక్ష్యం కావాలని, అందుకోసం అంతా కలిసికట్టుగానే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.










Comments