top of page

కెమెరా లేని చావుకి విలువ లేదు.. నిశ్శబ్దం తప్ప

  • Guest Writer
  • 3 hours ago
  • 2 min read

బలిసినోళ్ల గొడవల మీద అందరూ పడిపోతారు.. కానీ సామాన్యుడి రక్తం మీద ఎవడికి ఆసక్తి లేదు. రూ.450 కోట్ల ఆస్తులున్న అమ్మాయి.. ఒక రాజకీయ నాయకుడి వారసుడు.. వాళ్ల పర్సనల్ గొడవల మీద దేశం మొత్తం పడిపోతుంది. అందరూ ‘జస్టిస’ అంటూ గొంతులు చించుకుంటున్నారు. కొన్ని గొడవలు నేషనల్ కంటెంట్ అవుతాయి. కొన్ని చావులు అంకెలుగా మారిపోతాయి. అంతే తేడా. ఈ దేశంలో ఇప్పుడు న్యాయం కూడా బాధని బట్టి కాదు, ఎవరి బాధ కనిపిస్తుందో దాన్ని బట్టి పనిచేస్తోంది. కెమెరా ఉంటే అవుట్‌రేజ్. హ్యాష్‌ట్యాగ్ ఉంటే ఉద్యమం. సెలబ్రిటీ యాంగిల్ ఉంటే ప్రైమ్‌టైమ్ అరుపులు. లేకపోతే? శవం ఎండిపోతుంది. రక్తం మట్టిలో కలిసిపోతుంది. కేసు ఫైల్ మీద దుమ్ము పట్టేస్తుంది.

యువాన్ కోసం ఎన్ని టైమ్‌లైన్స్ మండాయి? తెలంగాణలో యువాన్ అనే యువకుడిని నడిరోడ్డుపై వెంటాడి 17 సార్లు కత్తులతో పొడిచి చంపేశారు. వీడియోలు తిరిగాయి. రక్తం రోడ్డు మీద పారింది. కానీ దేశం మండిపోలేదు. సెలబ్రిటీ హ్యాష్‌ట్యాగ్స్ రాలేదు. ప్రైమ్‌టైమ్ డిబేట్స్ రాలేదు. ఎందుకంటే.. అతని వెనకాల డబ్బు లేదు. ప్రభావం లేదు. ఆ రక్తపు చుక్కలకి వ్యూస్ రావు.

వైష్ణవి కేసు గుర్తుందా? ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. కుటుంబం న్యాయం కోసం తిరిగింది. కొద్దిరోజులు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. తర్వాత కొత్త టాపిక్ వచ్చేసింది. సోషల్ మీడియాలో టాపిక్ ఉంది, వ్యూస్ ఉన్నాయి, అందుకే అందరూ కొత్త చావు మీదకి పరుగెత్తిపోతారు. ఆ అమ్మాయి పేరు కూడా టైమ్‌లైన్స్ నుంచి మాయం అయిపోయింది. ఎందుకంటే అక్కడ గ్లామర్ లేదు. అక్కడ ఉన్నది కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం కన్నీళ్లు మాత్రమే.

రైతుల సంగతి ఇంకా దారుణం. రైతుబంధు కోసం ఎదురు చూసి.. అప్పులతో, పంట నష్టాలతో, అవమానంతో ఎంతోమంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ల ఇళ్లలో పిల్లలు అనాధలయ్యారు. కానీ వారి చావుకి స్టూడియో లైటింగ్ లేదు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ లేదు. వారి బాధ ఆల్గోరిథమ్‌కి కనిపించదు.

రూ.200 కోట్ల స్కామ్ కేసు గుర్తుందా? డబ్బులు పోయి అవమానంతో, అప్పులతో కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా కూలిపోయాయి. కానీ అవుట్‌రేజ్ మార్కెట్‌కి అది లాభమిచ్చే విషయం కాదు. అందుకే సిస్టమ్ ముందుకు నడిచిపోయింది.

అయేషా మీరా కేసు అయితే ఇంకా భయంకరం. ఏళ్ల క్రితం జరిగిన హత్య. కుటుంబం దశాబ్దాలుగా న్యాయం కోసం తిరుగుతోంది. పేర్లు వినిపించాయి. రాజకీయ అనుమానాలు వచ్చాయి. సాక్ష్యాలపై ప్రశ్నలు వచ్చాయి. కానీ కేసు మాత్రం ఇంకా చీకట్లోనే తిరుగుతోంది. పెద్దల పేర్లు వినిపిస్తే చాలు చట్టం తన కళ్లకున్న గంతలను ఇంకా గట్టిగా కట్టుకుంటుంది. దిశ కేసు సమయంలో దేశం మండిపోయింది. కానీ అదే సమయంలో ఎంతోమంది చిన్న పట్టణాల అమ్మాయిల కేసులు ఎఫఐఆర్ స్టేజ్ కూడా దాటలేదు. ఎందుకంటే మీడియా వ్యాన్లు అక్కడికి వెళ్లలేదు. ఒక చిన్నారి కనిపించకుండా పోతే.. అది పేద కుటుంబం అయితే స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. డబ్బున్న కుటుంబం అయితే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఇదే అసలు భయం. ఈ దేశంలో బాధ కూడా స్టేటస్ చూసుకుని విలువ పొందుతోంది.

ఇంకా ఘోరం ఏంటంటే... సోషల్ మీడియా ఇప్పుడు బాధని కూడా విడగొట్టింది. రిచ్ విక్టిమ్. పూర్ విక్టిమ్. కెమెరాకి పనికొచ్చే విషాదం. ఎవరూ పట్టించుకోని విషాదం. అందుకే ఇప్పుడు కొందరు చనిపోతే దేశం ఆగిపోతుంది. మరికొందరు చనిపోతే వారి ఇంట్లో ఫ్యాన్ మాత్రమే ఆగిపోతుంది. ఈ దేశంలో ఇప్పుడు అవుట్‌రేజ్ కూడా సెలెక్టివ్ అయిపోయింది. కొన్ని చావులు నేషనల్ డిబేట్ అవుతాయి. కొన్ని చావులు లోకల్ న్యూస్ టిక్కర్ కూడా కావు. కొందరు తల్లులు మీడియా ముందు ఏడుస్తారు. మరికొందరు తల్లులు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా అర్థం కాక నిశ్శబ్దంగా కూర్చుంటారు. డబ్బున్న వాళ్ల గొడవలు అందరూ చూసుకుంటారు. కానీ సామాన్యుడి రక్తం రోడ్డు మీద ఎండిపోతే... అక్కడ మాత్రం ఎవడూ కనిపించడు. మన దేశంలో అసలు ట్రాజెడీ మర్డర్ కాదు. సామాన్యుడి ప్రాణానికి మార్కెట్ వాల్యూ లేకపోవడం. సామాన్యుడి చావులో ఎంటర్‌టైన్మెంట్ ఉండదు.. కేవలం భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. కెమెరా లేని చావుకి ఈ వ్యవస్థలో విలువ లేదు. నిశ్శబ్దం తప్ప.

- విశ్వ . ఎ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page