మన ఆర్థికానికి పసిడి పోటు!
- DV RAMANA

- 3 hours ago
- 4 min read
కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు
గతంలోనూ మÖడుసార్లు స్వర్ణంతోనే సంక్షోభాలు
అందుకే గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తెచ్చిన ఇందిర
90 దశకంలో బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి
UPA-2 హయాంలోనూ కఠిన ఆంక్షలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు. దాంతోపాటు ఇంధన వనరుల వినియోగంతోపాటు పలు అంశాల్లో పొదుపు పాటించాలని హితవు పలికారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నదనడానికి ప్రధాని చేసిన ఈ సూచనలే సంకేతాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగం పెరిగేకొద్దీ దిగుమతుల ఖర్చులు పెరిగి విలువైన విదేశీమారక ద్రవ్య నిల్వలను ఖాళీ చేసేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే మÖడు నెలల క్రితంతో పోల్చుకుంటే విదేశీమారక ద్రవ్యం 728 మిలియన్ డాలర్ల నుంచి సుమారు 680 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మÖడు రూపాయలు చొప్పున పెంచారు. గతంలోనూ మనదేశం ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రధానంగా ఇంధన, పసిడి లావాదేవీలపైనే దృష్టి సారించాయి. తొలుత ఇందిరా గాంధీ హయాంలో, రెండోసారి పీవీ నరసింహారావు హయాంలో, మÖడోసారి యÖపీఏ`2 ప్రభుత్వ హయాంలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాన్నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు రకరకాల విధానాలు అనుసరించాయి. అయితే విధానాలు, చర్యలు ఏవైనా.. వాటి అంతిమ లక్ష్యం మాత్రం ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయడమే. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి సంక్షోభం ముంగిటే దేశం నిలిచిన నేపథ్యంలో అప్పట్లో తలెత్తిన సంక్షోభాలు.. వాటిని ఎదుర్కొన్న విధానం నుంచి ఇప్పుడు మనం పాఠాలు నేర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
1968లో గోల్డ్ కంట్రోల్ చట్టం
లాల్‌బహదూర్ శాస్త్రి అకాలమరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి కాస్త గంభీరంగానే ఉంది. 1965 నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన భారత్`పాక్ యుద్ధం కారణంగా రక్షణ వ్యయం బాగా పెరిగిపోయి విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోయాయి. దానికితోడు 1965`66 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు తాండవించి పంటలు పోయి ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. దాంతో విదేశాల నుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకునేందుకు భారీగా విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో మనదేశంలో సహజంగానే ఉండే బంగారం డిమాండ్ వల్ల భారీగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఈ రూపంలో కూడా విదేశీమారకం ఆవిరైపోయేది. ఈ పరిస్థితుల్లోనే నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కొంతకాలంపాటు బంగారం కొనుగోళ్లు మానేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించే 1967నాటి హిందూ పత్రిక వార్త అంటూ ఒక క్లిప్పింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. ఆ క్లిప్పింగ్ నిజమైనది కాదని.. హిందూ యాజమాన్యం ఖండించింది. ఆ పత్రిక క్లిప్పింగ్ అసలైనది కాకపోవచ్చు గానీ.. నాడు ఇందిరాగాంధీ బంగారం కొనుగోళ్లు, పొదుపుపై పలు సభల్లో పిలుపునివ్వడం మాత్రం వాస్తవమే. ఆ డబ్బును జాతీయ రక్షణ నిధి, ఇతర పొదుపు పథకాల్లో పెట్టాలని కూడా సూచించారు. బంగారం కొనుగోళ్లు, దిగుమతులను అడ్డుకునేందుకు నాడు ఆమె ప్రభుత్వం ఏకంగా బంగారం నియంత్రణ చట్టాన్ని (గోల్డ్ కంట్రోల్ యాక్ట్) కూడా తీసుకొచ్చింది. నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో 1968 ఆగస్టు 24న ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వ్యక్తిగతంగా ఒకరు రెండు కేజీల ఆభరణాలు, ఒక కుటుంబం నాలుగు కేజీలకు మించి ఆభరణాలు ఉంచుకోకుండా పరిమితులు విధించారు. నాణాలు, విగ్రహాలు రూపంలో అయితే 50 గ్రాములకు మించి ఉంచుకోకూడదు. ఇక బంగారం పనివారి వద్ద కూడా తమవద్ద వంద గ్రాములకు మించి పసిడి ఉంచకోరాదని ఆంక్షలు పెట్టారు. బంగారం పనివారు ప్రత్యేకంగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాపారులు ఒకరి నుంచి మరొకరు అంతర్గత వ్యాపారం చేయడాన్ని నిషేధించారు. అయితే ఈ చట్టం ఆచరణలో విఫలం కావడమే కాకుండా కొత్త సమస్యలు సృష్టించింది. బంగారం బ్లాక్‌మార్కెటింగ్ పెరిగింది. దొంగమార్గాల్లో స్మగ్లింగ్ పెరిగింది. కాగా ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1990లో పీవీ నరసింహారావు ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను రద్దు చేసింది.
దెబ్బతీసిన గల్ఫ్ యుద్ధం
ఇక 1990 దశకంలో గల్ఫ్ యుద్ధంతోపాటు కేంద్ర ప్రభుత్వ అపసవ్య విధానాలు దేశ ఆర్థికాన్ని ఛిద్రం చేశాయి. కేవలం రెండు వారాలకు సరిపడా 1.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే మిగిలాయి. ద్రవ్యోల్బణం 17 శాతానికి చేరుకుంది. దాంతో చేసిన అప్పులు తీర్చడానికి కేంద్రం తన వద్ద ఉన్న 67 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వద్ద తాకట్టు పెట్టాల్సి వచ్చింది. గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం, దేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన సోవియట్ యూనియన్ పతనంతోపాటు ఆర్థిక లోటు పెరగడం వల్ల దేశం దాదాపు దివాలా స్థితికి చేరుకుంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో 1991 జూలై 24న ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎల్‌పీజీ మోడల్ అంటూ సంస్కరణల విప్లవానికి శ్రీకారం చుట్టారు. అదే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ ద్వారా లైసెన్స్ రాజ్‌ను అంతం చేసి వ్యాపారాన్ని సులభతరం చేశారు. ప్రైవేటైజేషన్ ద్వారా ప్రభుత్వ రంగానికి పోటీగా ప్రైవేట్ రంగానికి తలుపులు బార్లా తెరిచారు. గ్లోబలైజేషన్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి ప్రపంచ దేశాలకు స్వాగతం పలికారు. దిగుమతి సుంకాలు తగ్గించి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ఈ సంస్కరణలపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా అద్భుతమైన ఫలితాలు లభించాయి. ఏడాదిలోపే దేశ ఆర్థికరంగం ఐసీయÖ నుంచి బయటపడింది. 1991 జూలైలో 1.1 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు 1992 మార్చి నాటికి 5.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోగలిగారు. అప్పటినుంచీ భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతూ నేడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుంది.
కరెంట్ అకౌంట్ లోటు
తొంబై దశకంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థికరంగాన్ని సంస్కరించి పరిపుష్టం చేసిన డాక్టర్ మన్మోహన్‌సింగ్ రెండోసారి ప్రధానమంత్రి చేపట్టిన చివరి రోజుల్లో మళ్లీ అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రముఖ గోల్డ్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆనాటి సంక్షోభాన్ని నివేదిక రూపంలో గుర్తు చేసింది. మన్మోహన్ నేతృత్వంలోని యÖపీఏ`2 ప్రభుత్వం చివరి కాలం అంటే 2012`13 ఆర్థిక సంవత్సరంలో దేశం ఇటువంటి ఆర్థిక విపత్తునే ఎదుర్కొంది. కరెంటు అకౌంటు లోటు విపరీతంగా పెరగడంతోపాటు బంగారం దిగుమతులు భారీగా పెరిగిపోవడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా బంగారం కొనవద్దని దేశప్రజలకు పిలుపునిచ్చారు. అప్పట్లో బంగారం దిగుమతులు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి రూపాయి పతనమైంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని రెండు నుంచి 15 శాతానికి పెంచింది. అలాగే బంగారు నాణేల దిగుమతిని నిషేధించి 80:20 రూల్ తెచ్చారు. అంటే దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతం తిరిగి ఎగుమతి చేయాల్సి ఉంటుందన్న కఠిన ఆంక్షలు ఆమల్లోకి తెచ్చింది. భారతీయ రూపాయి విలువ బలహీనపడకుండా ఉండాలంటే విదేశీమారక నిల్వలను ఆదా చేయాల్సిందే. భారతీయులు తమ బంగారం కొనుగోళ్లను కనీసం 10 శాతం తగ్గించుకున్నా దేశానికి సుమారు 7.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నిపుణుల అంచనా. ఈ నిధులను అత్యవసరమైన క్రూడ్, ఎరువుల దిగుమతులకు వాడుకోవచ్చు.
ఎందుకీ ఆందోళన?
భారత ఆర్థిక వ్యవస్థకు బంగారం ఇప్పుడు ఒక భారంగా మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనదేశ బంగారం దిగుమతులు ఏకంగా 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది 2023 నాటి 35 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. క్రూడ్ ఆయిల్ తర్వాత భారత్ అత్యధికంగా ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతులపైనే. దేశం చేస్తున్న మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు పది శాతానికి చేరింది. దీనికి తోడు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రూడ్ ధరలను పెంచుతుండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేది లేక బంగారం కొనొద్దని, పెట్రోల్ వాడకం తగ్గించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు.






Comments