చిత్తశుద్ధి లేకపోబట్టి.. బక్కచిక్కిన మిర్తిబట్టీ!
- Prasad Satyam
- 2 days ago
- 2 min read
ఆక్రమణలతో కొన్నిచోట్ల మురుగు కాలువ కంటే హీనం
ఇంకొన్ని చోట్ల రూపురేఖల్లేకుండా పూర్తిగా అంతర్థానం
ఫలితంగా నగరంలోని శివారు కాలనీలకు ముంపు చింత
పునరుద్ధరణకు సంకల్పం పూనిన ఎమ్మెల్యే గొండు శంకర్
అధికారులతో కలిసి పర్యటన.. కార్యాచరణ ప్రణాళిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
20 నుంచి 6 అడుగులు.. 6 నుంచి 2 అడుగులు.. అటుతర్వాత అంతర్థానం.. ఇదీ నగరం చుట్టూ ప్రవహించే మిర్తిబట్టి బక్కచిక్కిపోతున్న తీరు. 20 అడుగుల వెడల్పుతో శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశించే మిర్తిబట్టి తిలక్‌నగర్ దగ్గరకొచ్చేసరికి ఐదు నుంచి ఆరడుగుల మురుగుకాలువలా కుచించుకుపోయింది. మరోచోట ఐదడుగుల మేరకు మురుగు పారాల్సి ఉండగా కేవలం రెండు అడుగుల సిమెంట్ పైప్‌లైన్ నుంచి రోడ్డు దాటుతుంది. ఒకవైపు మÖడు ఇళ్లు, దానికి ఎదురుగా మరో నాలుగిళ్లు మాత్రమే ఉన్న ఒక చిన్న వీధికి అవసరం లేకపోయినా 16 అడుగుల సిమెంట్ రోడ్డు వేసి మిర్తిబట్టిని రెండు అడుగుల కాలువ స్థాయికి కుదించేశారు. ఈ పాపం ఎవరిది? వర్షాలు పడితే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమైన కొన్ని పంచాయతీలు మునిగిపోతున్నాయని చాలా కాలంగా ఆ ప్రాంతాలవారు గగ్గోలుపెడుతున్నా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? వీటన్నింటికీ ఒక్కటే సమాధానం.. సమస్యను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ మిర్తిబట్టీని నాగావళితో అనుసంధానించే విషయంలో ఇప్పటివరకు పాలకులు చిత్తశుద్ధి చూపకపోవడమే కారణం. ఫలితంగా 1998 నుంచి మిర్తిబట్టి క్రమంగా కుచించుకుపోతూ వచ్చింది.
ఆక్రమణలకు అధికారుల తీరే కారణం
ఈ బట్టీ నగరం అవతల ఏమేరకు ఆక్రమణలకు గురైందన్నది పక్కనపెడితే.. నగరంలోకి మాత్రం 60 అడుగుల వెడల్పుతో ప్రవేశిస్తున్నది. కాలక్రమంలో నగర పరిధిలో మిర్తిబట్టీకి ఆనుకొని ఇరువైపులా అనేక కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీల మురుగంతా మిర్తిబట్టీలోకే చేరేలా కనెక్షన్లు ఇచ్చారు. కానీ 2004 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వాలేవీ దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయాయి సరికదా.. ఎఫఎంబీని పట్టించుకోకుండా అధికారులే మిర్తిబట్టి పరిమాణాన్ని ఐదు నుంచి ఆరడుగుల మేరకు కుదించి కొన్నిచోట్ల (తిలక్‌నగర్, డీసీసీబీ కాలనీ ఎక్స్‌టెన్షన్) కాలువకు ఇరువైపులా గోడలు కట్టడం వల్ల బట్టీ వెడల్పు ఇంతేనని భావించిన పరిసర ప్రాంతాలవారు కాలువ స్థలాలను ఆక్రమించేసి సొంత నిర్మాణాలు చేసుకున్నారు. పోనీ మిగిలిన ఆరడుగుల కాలువైనా పూర్తిగా ఉందా.. అంటే అదీ లేదు. డీసీసీబీ కాలనీలో ఇది పూర్తిగా అంతర్ధానమైనపోయింది. తిలక్‌నగర్ నుంచి డీసీసీబీ కాలనీ మీదుగా పీఎసఎనఎం స్కూల్ వరకు ఐదు నుంచి ఆరు అడుగుల వెడల్పుతో సాగాలిసన కాలువ డీసీసీబీ కాలనీ నుంచి అసలు కనిపించకుండా పోయింది. సరస్వతీ నది అంతర్ధానమై మళ్లీ ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వద్ద కనిపించినట్టు మిర్తిబట్టి కూడా మÖడు ప్రాంతాల్లో మాయమైపోయి మళ్లీ పీఎసఎనఎం హైస్కూల్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి మెడికల్ షాపు పక్కన మళ్లీ కాలువలా కనిపిస్తుంది. ఇది ఇందిరానగర్ కాలనీ, పరిసర ప్రాంతాలన్నింటినీ చుట్టి రామలక్ష్మణ జంక్షన్ వద్ద మళ్లీ కలవాలి. అక్కడి నుంచి వాంబే కాలనీ వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు (ఇంకా నిర్మాణం పూర్తికాలేదు) చేరుతుంది. అక్కడ మురుగు నీటిని శుద్ధి చేసి నాగావళి నదిలో కలుపుతారు. ఇది మిర్తిబట్టి స్వరూపం.
ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
మిర్తిబట్టి ఆక్రమణలకు గురికావడం వల్ల తిలక్‌నగర్, డీసీసీబీ కాలనీలతోపాటు ఆపైన ఉన్న నర్సెస్ కాలనీ, ఏఎసఎన్ కాలనీ వంటి ప్రాంతాల్లో మురుగు కాలువలను నగరపాలక సంస్థ నిర్మించలేకపోతోంది. స్థానికుల అవసరాల మేరకు రోడ్లు నిర్మిస్తున్నా కాలువలను దేనికి కనెక్ట్ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024 ఎన్నికల ముందు నగరంలో 88 రోడ్లు, కాలువల పనులకు అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినా వీటిని రద్దు చేయలేదు. కానీ ఇప్ప్పుడా పనులను చూస్తే ఒకదానితో ఒకదానికి పొంతన లేకుండా ఉంది. రోడ్డు, కాలువ నిర్మిస్తున్నా అందులో నీరు బయటకు పోవడానికి దారి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్ నగర పరిధిలో మిర్తిబట్టి నడిచే ప్రాంతమంతా పర్యటించారు. ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో రికార్డు చేసుకున్నారు. తనతో పాటు సర్వేయర్‌ను వెంటబెట్టుకొని వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావుతో పాటు ఏఈ సందీప్ టీమ్ కూడా ఎమ్మెల్యే ను ఫాలో అయ్యి మిర్తిబట్టి ఒక్కోచోట ఒక్కో రూపంలో ఉండటాన్ని గుర్తించింది. ఎక్కడ ఏ పనులు చేపడితే మురుగు ప్రవాహం స్వేచ్ఛగా ఊరు దాటిపోతుందో గుర్తించి ఆ పనులకు ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఓ అంచనాకు వచ్చింది. ఆ మేరకు 15వ ఆర్ధిక సంఘం నుంచి రూ.1.72 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించడం, ఆ పనులకు భూమిపూజ చేయడం బుధవారం చకచకా జరిగిపోయాయి. కాగా ఎమ్మెల్యే పర్యటనలో తిలక్‌నగర్ కాలనీకి చెందిన కొందరు దశాబ్దాలు గడిచినా తమకు కాలువలు సమకూరలేదని మొర పెట్టుకున్నారు. కాలువ ప్రాంతంలో భారీ భవనాలు కడుతున్నప్ప్పుడు అప్పటి యంత్రాంగానికి, నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని గగ్గోలు పెట్టారు. ఇప్ప్పుడు ఆ ఆక్రమణలు తొలగిస్తే గానీ మిర్తిబట్టి నాగావళిలో కలిసే అవకాశం లేదు. అది జరగనంత వరకు చినుకు పడితే కార్పొరేషన్ మునిగిపోక తప్పదు.






Comments