top of page

కూర్మారావు వెనక్కు వచ్చేస్తారు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 hours ago
  • 2 min read
  • ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జేసీ

  • ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే

  • ఆరోగ్య సరిలేక బాధ్యత వహించని ఆర్‌డీఎంఏ రవీంద్ర

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం రాత్రి కూర్మారావు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే గొండు శంకర్ విచారం వ్యక్తం చేశారు. మళ్లీ అదే స్థానంలోకి తెస్తామని, రెండు రోజుల సమయం ఇవ్వాలని, అంతవరకు మనసు మార్చుకోవద్దంటూ ఎమ్మెల్యే ఆయన్ను సముదాయించారు. మరోవైపు కూర్మారావు వచ్చి 12 రోజులు గడిచిందో లేదో నెపాన్ని ఆయన మీదకు నెట్టేసి, సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సోషల్ మీడియా, పబ్లిక్‌లో పెద్ద ఎత్తున అసంతప్తి వ్యక్తమైంది. ఏమాత్రం సంబంధం లేని కమిషనర్‌ను బలి తీసుకోవడంపై బుధవారం నుంచి నగరంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే కూడా సీరియస్‌గా తీసుకున్నారు. పాలకమండలి లేని కార్పొరేషన్‌ను గాడిలో పెట్టడం కోసం ఏరికోరి కూర్మారావు తీసుకువస్తే ఆయన సస్పెండ్ కావడాన్ని టీడీపీ నేతలు కూడా జీర్ణించుకోలేదు. మరోవైపు 12 రోజుల వ్యవధిలోనే కూర్మారావు మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల మనసును చూరగొన్నట్లు కొన్ని ప్రకటనల ద్వారా అర్థమవుతుంది. తనను సస్పెండ్ చేశారని తెలియగానే కూర్మారావు వెంటనే రిలీవ్ అయిపోయి కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్నప్ప్పుడు పెద్ద ఎత్తున కార్పొరేషన్‌తో సంబంధం ఉన్నవారు వచ్చి ప్రభుత్వం పునరాలోచిస్తుందని, అంతవరకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కూర్మారావును సస్పెండ్ చేయడంతో జిల్లాలో దీన్ని కులంతో ముడిపెట్టి పెద్ద ఎత్తున ట్రోలింగ్‌లు కూడా జరిగాయి. కార్పొరేషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందినవారు బాధ్యత వహించాల్సిందిపోయి కూర్మారావును టార్గెట్ చేశారంటూ ఒక సామాజికవర్గం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేసింది. దీనిపై సంయమనం పాటించాలని కొందరు వేడుకోవాల్సి వచ్చింది. దీంతో సంబంధం లేకపోయినా కూర్మారావును కొనసాగించాలని టీడీపీ నేతలు ఉత్తర్వులు వచ్చిన వెంటనే నిర్ణయించుకున్నారు.

కూర్మారావును సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే కమిషనర్‌గా మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ రవీంద్ర తాత్కాలిక బాధ్యతలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నగరంలో డయేరియాతో మరణాలు సంభవించడం, ఒక ప్రాంతంలో అధిక భాగం కేసులు నమోదు కావడంతో ఉత్తర్వులు వచ్చిన వెంటనే రవీంద్ర శ్రీకాకుళం వచ్చి వాలారు. కాకపోతే ఆయనకు కొద్ది రోజుల క్రితమే మేజర్ శస్త్రచికిత్స ఒకటి జరిగింది. ఇంకా దాని నుంచి ఆయన బయటపడలేదు. బుధవారం కూడా ఆయన మాస్క్‌తో కనిపించారు. తాను ఇంకా ఫిట్ కాలేదని, కమిషనర్ బాధ్యతలు చేపట్టలేదంటూ కలెక్టర్‌కు విన్నవించడంతో ఆయన్ను తప్పిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా నియమిస్తూ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి కొత్త కమిషనర్ వచ్చేవరకు జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కానీ ఆ ఉత్తర్వుల్లో అలా లేదు. అంటే.. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ కమిషనర్ వస్తున్నారని అర్థమవుతుంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సూచన మేరకు ఇక్కడకు కూర్మారావు వచ్చారు. అయితే ఈయన పేరెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి క్లియరెన్స్ తేవడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆమోదం పొందడం వరకు అన్ని పనులూ ఎమ్మెల్యే గొండు శంకరే చక్కబెట్టారు. ఇలా వచ్చి సీటులో కుదురుకోక ముందే సస్పెండ్ కావడంతో ఆయన్నే మళ్లీ తేవాలని అంతా భావిస్తున్నారు. బహుశా రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడొచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page