top of page

కమీషన్ గేట్లు ‘బార్’లా తెరిచేశారు

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 day ago
  • 2 min read
  • కలెక్షన్లు తెచ్చేవారికి ఖరీదైన సీట్లు

  • యూనియన్ నేతలు పేరుతో డీడీ కోసం దోపిడీ

  • జిల్లా ఖజానా శాఖలో రవికుమార్ రాజ్యాంగం మొదలైంది

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఖజానా శాఖలో ప్రతీదానికి కమీషన్ తీసుకోడానికి గేట్లు ‘బార’లా తెరిచేసినట్లే. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతీ బిల్లు పాసవడానికి నిర్ధిష్టమైన కమీషన్ వసూలు చేయడం ఈ శాఖలో ఆనవాయితీయే. అయితే ఇందులో కొంత మానవీయ కోణం, మరికొన్ని మొహమాటాలు, తక్కువ పర్సంటేజీ వసూలు గతంలో ఉండేవి. అయితే పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయడం కోసం నేరుగా ట్రెజరీస్ డీడీయే ఏటీవో లాగిన్ నుంచి, కిందిస్థాయి అకౌంటెంట్ల, ఎస్టీవోల నోట్‌ఫైల్ లేకుండానే బిల్లు చెల్లించేయడం వంటి ప్రక్రియకు ఇప్ప్పుడు అడ్డూ అదుపు లేకుండాపోయింది. జిల్లాలో డీడీగా పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతుండటంతో గత కొన్నేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకు కూర్చున్న రవికుమార్ వర్కింగ్ అవర్స్‌లో కమీషన్లు, సాయంత్రమైతే కళింగ రోడ్డులో 80 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న వైన్‌షాపులో డ్యాన్సులకు ఇప్ప్పుడు అడిగే నాధుడే లేడు. మొత్తం ఏడుగుర్నీ ఒకేరోజు సస్పెండ్ చేయడం వల్ల డీడీ ఆగడాలు భరించలేక కొందరు సెలవు పెట్టేశారు. ఇక మిగిలింది జిల్లా ఖజానా శాఖలో కేవలం డీడీ అడుగులకు మడుగులొత్తుతూ ఆయనకు కలెక్షన్ ఏజెంట్లుగా పని చేస్తున్న కొద్దిమంది మాత్రమే. దీంతో వీరి సస్పెన్షన్ వ్యవహారం తేలేలోపు మొత్తం బిల్లులన్నీ పాస్ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రవికుమార్‌కు ఎస్టీవో సత్యనారాయణ, సీనియర్ అకౌంటెంట్లు బొత్స శ్రీనివాసరావు, సాయిప్రసాద్, కోటిలతో పాటు జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్‌లు ఇప్ప్పుడు అన్నీ అయి వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా వీరు తనకు అనుకూలంగా నడుస్తుండటంతో కమీషన్ల కోసం వీరికి సొమ్ములొచ్చే సీట్లు డీడీ అప్పగించారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ బిల్లులు చూసే పని పూర్వం ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో చేసేవారు. కానీ సొమ్ములొచ్చే ఈ సీటులో తనవారు ఉండాలని సీనియర్ అకౌంటెంట్ కోటికి మైనర్ ఇరిగేషన్, జిల్లాపరిషత్‌తో పాటు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను డీడీ రవికుమార్ కట్టబెట్టారు. అప్పట్నుంచీ ఈ డిపార్ట్‌మెంట్ బిల్లులకు ‘బార’లా తలుపులు తెరిచేశారు. వైకాపా హయాంలో రోడ్లు, భవనాల శాఖకు పని లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బిల్లులు చెల్లింపులు, కొత్త పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ సీటును చూస్తున్న సాయికష్ణను తీసేసి సాయిప్రసాద్ అనే తన అనుయాయుడికి అప్పగించారు. అప్పట్నుంచి కాసుల వర్షం కురుస్తుందట. ఇది కాకుండా తనకు అనుకూలంగా ఉన్న డీవీ సత్యనారాయణకు టీచర్లు, ఆర్టీసీ, ఆర్టీవో వంటి బలమైన డిపార్ట్‌మెంట్లు అప్పగించారు. బొత్స శ్రీనివాసరావు ఇరిగేషన్, అగ్రికల్చర్ శాఖలు చూస్తున్నారు. వరప్రసాద్ ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పోలీస్ బెటాలియన్ బిల్లులు చూస్తారు. ఇప్ప్పుడు వరప్రసాదే డీడీకి రథసారధి. ట్రెజరీలో పదోన్నతులు, బదిలీలు, రెగ్యులరైజేషన్ వంటివి చేపట్టినప్ప్పుడు సిబ్బంది నుంచి సొమ్ములు వసూలు చేసి డీడీకి ఇచ్చే పని ఈయనే చూస్తున్నారు. విచిత్రంగా వీరందరూ ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం రణస్థలంలో సీనియర్ అకౌంటెంట్లుగా పని చేస్తున్న శ్రీధర్, మధులకు ప్రమోషన్ వచ్చి ఎస్టీవోలుగా బదిలీపై వెళ్లిపోయారు. అదే సమయంలో శ్రీకాకుళం డివిజనల్ సబ్‌ట్రెజరీలో ఏసీబీ రైడ్ చేసి ఎస్టీవోను, అకౌంటెంట్‌ను పట్టుకుంది. దీంతో రణస్థలంలో, శ్రీకాకుళంలో సిబ్బంది కొరత ఏర్పడింది. అంతర్ జిల్లా బదిలీల కింద ప్రత్యేక జీవో తెచ్చుకొని నెల్లూరు నుంచి వచ్చిన యుగంధర్ కూన రవి సిఫార్స్ మేరకు సబ్‌ట్రెజరీలో పోస్టింగ్ కావాలని పట్టుబట్టారు. కానీ రణస్థలంలో పూర్తిగా ఖాళీ అయిపోయిందని, అక్కడ నియమించాలని సిబ్బంది చెప్పడంతో దీన్ని అడ్డుకుంటున్నారంటూ స్వయంగా కూన రవి కార్యాలయానికి ప్రదీప్, రాజశేఖర్‌ల మీద డీడీ ఫిర్యాదు చేసి ఈ కథను పోలీస్‌స్టేషన్‌కు చేర్చారు. అప్పట్నుంచి నిన్నటి ఏడుగురి సస్పెన్షన్ వరకు నలిగిన ఈ కథలో ప్రస్తుతం జిల్లా డీడీ కార్యాలయంలో డీడీ రవికుమార్ వల్ల, రవికుమార్ చేత, రవికుమార్ కొరకు పని చేస్తున్న యంత్రాంగమే ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page