top of page

కమీషన్‌ దందాలు..‘కాంట్రాక్ట్‌’ పాపాలు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 6, 2025
  • 2 min read
  • ఐసీడీఎస్‌ సీడీపీవోపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు

  • రవాణా కాంట్రాక్టర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి

  • నిర్ధారణ అయినా చర్యలకు మీనమేషాలు

  • ఆ శాఖ జిల్లా అధికారి సానుభూతి వచనాలు

  • అమలుకు నోచుకోని జేసీ ఆదేశాలు

పత్రికల్లో కథనాలొస్తే ఆధారాలు కావాలంటారు.. అవే ప్రతిపక్షాలు చేస్తే ఆరోపణంటారు.. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్ని ఆధారాలతో దొరికిపోయినా చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకాడుతుంటారు. ఎచ్చెర్ల సీడీపీవోతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌పై ఆధారాలతో సహా నేరుగా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడానికి మాత్రం సంబంధిత శాఖ ఇప్పటికీ నీళ్లు నములుతోంది. వివరాల్లోకి వెళితే..

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల చైల్డ్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు (ఐసీడీఎస్‌) అధికారిగా డోల పాపినాయుడు వ్యవహరిస్తున్నారు. రవాణా కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న పొందూరు మండలం మద్దిలపేటకు చెందిన పైడి వెంకటరమణకు బిల్లు బకాయిలు చెల్లించడానికి పాపినాయుడు కమీషన్‌ డిమాండ్‌ చేశారు. కమీషన్‌ ఇవ్వనందుకు 14 నెలల రవాణా బిల్లులను నిలిపివేయడంతోపాటు వేరే వారిని రవాణాకు నియోగించారు. కమీషన్‌ ఇవ్వనందుకు కక్షగట్టి కాంట్రాక్ట్‌ గడువు ముగియకుండానే వేరొకరికి రవాణా చేసే బాధ్యత అప్పగించారని ఆరోపిస్తూ పైడి వెంకటమరణ ఈ నెల 22న గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. దీనిపై ఉన్నతాధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు ‘తప్పు జరిగింది.. క్షమించండి,.. అంటూ డోల పాపినాయుడు సమాధానం ఇచ్చారు. రవాణా బిల్లు చెల్లించడానికి రూ.40వేలు లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన ఆయన దీన్నుంచి బయటపడేందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా సీడీపీవో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు కారని, వారిని సస్పెండ్‌ చేయడం భావ్యం కాదని సానుభూతి చూపుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రాపకం

పాపినాయుడు ఎచ్చెర్లకు రాకముందు ఐదుచోట్ల పనిచేశారు. ప్రతి చోటా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటి ఆధారంగా అధికారులు సస్పెండ్‌ చేసినా పాపినాయుడులో మార్పు రాలేదని తాజా ఉదంతంలో అర్థమవుతుంది. తనపై గతంలో జరిగిన విచారణలను రాజకీయ ప్రోద్బలంతో బుట్టదాఖలు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఎన్‌పేట, పొందూరు, ఆమదాలవలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో పనిచేసిన పాపినాయుడు రాజకీయ ప్రాబల్యంతోనే సీడీపీవోగా నెట్టుకొస్తున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొనసాగుతున్న పాపినాయుడుతో తమ సమస్యలు చెప్పుకోవడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు భయపడతారని చర్చ జరుగుతోంది. పాపినాయుడుకు ఎచ్చెర్లలో సీడీపీవోగా పోస్టింగ్‌ ఇస్తే అంగీకరించేదిలేదని ఎమ్మెల్యే భీష్మించుకొని కూర్చున్నా.. చివరికి లాబీయింగ్‌తో కొన్ని రోజులు వెయిటింగ్‌లో ఉంచి, ఆయన కోరుకున్నట్టు ఎచ్చెర్లలోనే పోస్టింగ్‌ ఇచ్చారు.

కమీషన్‌ ఇవ్వలేదని కక్ష

ఎచ్చెర్ల ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లకు బాలామృతం ప్యాకెట్లు సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును మద్దిలపేటకు చెందిన పైడి వెంకటరమణ నిర్వహిస్తున్నారు. ఈయనకు 2026 మార్చి వరకు రవాణా కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ ఉంది. ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల పరిధిలోని 116 అంగన్‌వాడీ సెంటర్లకు బాలామృతం రవాణా చేస్తుంటారు. ఇందుకు గాను ఒక్కో బాలామృతం ప్యాకెట్‌కు రవాణా ఛార్జీ కింద ప్రభుత్వం చెల్లించాలన్నది కాంట్రాక్ట్‌ ఒప్పందం. కానీ 14 నెలలుగా రవాణా ఛార్జీలు బకాయి పడిన ప్రభుత్వం ఇటీవలే పెండిరగు బిల్లులకు సంబంధించి రూ.2.75 లక్షలు విడుదల చేసింది. ఆ బిల్లులు చెల్లించడానికి ప్యాకెట్‌కు రూ.0.75 పైసలు చొప్పున సుమారు రూ.40 వేలు కమీషన్‌ ఇవ్వాలని సీడీపీవో పాపినాయుడు డిమాండ్‌ చేశారు. సీడీపీవో తరఫున డేటా ఎంట్రీ ఆపరేటర్‌ మంతనాలు జరిపారు. అయితే అంత మొత్తం ఇవ్వలేనని.. ఎంతో కొంత ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదు సరికదా.. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన బాలామృతం ప్యాకెట్ల స్టాక్‌ను రవాణా కాంట్రాక్టర్‌ వెంకటరమణ ద్వారా కాకుండా వేరే వ్యక్తితో అంగన్‌వాడీలకు పంపిణీ చేయించారు. గడువు ఉన్నా కమీషన్‌ ఇవ్వలేదన్న కక్షతోనే తనను రవాణా కాంట్రాక్టర్‌గా తప్పించి గుడ్లు సరఫరా చేస్తున్న వ్యక్తితో రవాణా చేయించడంపై బాధితుడు వెంకటరమణ గత నెల 22న కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీతో పాటు కమీషన్‌ కోసం సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తనతో జరిపిన ఫోన్‌ సంభాషణల ఆడియో ఫైలును ఉన్నతాధికారులకు అందించారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జేసీ జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ పాపినాయుడుకు షోకాజ్‌ నోటీసు జారీచేసి సెప్టెంబర్‌ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలింది. దీంతో బాధ్యులిద్దరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వారి వివరణను లిఖిత పూర్వకంగా తీసుకొని నివేదికలు సిద్ధం చేయాలని ఐసీడీఎస్‌ పీడీ విమలను ఆదేశించారు. కానీ ఇదే సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన పాపినాయుడు ఉద్యోగ విరమణ చేసే సమయం దగ్గర పడినందున ఆయన్ను సస్పెండ్‌ చేయొద్దని అధికార కూటమి నాయకుల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page