కరకట్ట మీద కట్టుకో.. అడిగితే మా పేరు చెప్పు!
- BAGADI NARAYANARAO

- Dec 13, 2025
- 3 min read
రిటైనింగ్ వాల్‌కి సేకరించిన భూమిలో ప్లాన్ ఇచ్చేశారు
బఫర్ జోన్ మాట దేవుడెరుగు.. అమ్మేసిన భూమిపై నిర్మాణాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని టౌన్‌ప్లానింగ్
సమస్య పరిష్కారమైందంటూ తప్పుడు ఎండార్స్‌మెంట్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
లంచం ఇస్తే ఏ పనైనా సాధ్యమని నగరపాలక సంస్థ టౌన్ ప్ల్లానింగ్ విభాగం అధికారులు చేతివాటంతో మరోమారు నిరూపించుకుంది. నగరంలో అనధికారిక నిర్మాణాలు పట్టణ ప్రణాళిక విభాగం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నగరంలోని అనధికారిక నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అన్ని పత్రాలు ఉన్నాయి కాబట్టే అనుమతిచ్చామని చెప్పి పంపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీనికోసం రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేసి వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రెటరీతో కలిసి పంచుకుంటున్నారు. నిర్మాణం చేస్తున్న స్థలం ప్రభుత్వం, మున్సిపాలిటీ, రిజర్వు స్థలం, రివర్ బెడ్‌కు చెందిన బఫర్ జోన్ అని చూడకుండా డబ్బులు తీసుకొని వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రెటరీలు అనుమతులు ఇచ్చేస్తున్నారు.
నగరంలోని గుజరాతీపేట`2 పరిధిలో నాగావళి రివర్‌బెడ్‌లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగడానికి వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రెటరీలు కీలకంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ ఆ ప్రాంతంలో సాగుతుంది. నగర పాలక సంస్థ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసి నిర్మాణాలకు అన్ని అనుమతులు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వే నెంబర్ 129/3బి లో ఉన్న భూమిని నాగావళి కరకట్ట (రిటర్నింగ్ వాల్) నిర్మాణం కోసం ప్రభుత్వం (ఇరిగేషన్ శాఖ) సేకరించి అవార్డు పాస్ చేసిన స్థలంలో పీఎం హౌసింగ్ స్కీం కింద తప్పుడు డాక్యుమెంట్లతో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2011 జూలై 20న 82 సెంట్లు భూమిని ఫ్లడ్ బ్యాంక్ కోసం సేకరించి పరిహారంగా హక్కుదారులకు సుమారు రూ.33.77 లక్షలు అవార్డును పాస్ చేశారు. ఇందులో భాగంగా 123/3బి లో రాము అనే వ్యక్తికి చెందిన ఒకటిన్నర సెంట్లు స్థలానికి ప్రభుత్వం పరిహారం కింద రూ.61,785 జమ చేసింది. సేకరించిన స్థలంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కరకట్ట (రిటర్నింగ్ వాల్) నిర్మాణం చేపట్టగా, ఇంకా అక్కడ కొంత స్థలం మిగిలిపోయింది. ఇప్పుడు దాన్నే తన భూమిగా చూపించి ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద దరఖాస్తు చేసుకుంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ఓకే చేసేశారు.
గుజరాతీపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి కుడివైపు వెళ్లే మార్గం చివరిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం సాగుతుంది. ఇది నాగావళి బఫర్ జోన్‌లో ఉంది. అయినా రాము అనే వ్యక్తి కరకట్ట కోసం ప్రభుత్వం సేకరించిన స్థలంలో పీఎం హౌసింగ్ స్కీం కింద ఇల్లు నిర్మాణానికి సచివాలయం ప్లానింగ్ సెక్రెటరీ అనుమతి ఇచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ప్లానింగ్ సెక్రటరీ స్పందిస్తూ ప్రభుత్వం ఆ స్థలంలో పీఎం హౌసింగ్ స్కీం కింద ఇల్లు మంజూరు అయినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం కరకట్ట కోసం సేకరించగా మిగిలిన అరసెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం చేస్తున్నట్టు ప్లానింగ్ సెక్రటరీ చెబుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలను నిర్మాణదారుడి వద్ద ఉన్నట్టు పేర్కొన్నారు. స్థానికులు ఫిర్యాదు చేసిన తర్వాత నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చి ఇంటి నిర్మాణం నిలుపుదల చేయించినట్టు తెలిపారు.
ప్లానింగ్ సెక్రటరీ అరసెంటు స్థలం అని చెబుతున్నా సదరు నిర్మాణదారుడు బఫర్ జోన్‌లో 2 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు. ప్లానింగ్ సెక్రెటరీ చెప్పినట్టు ఇంటి నిర్మాణం నిలుపుదల చేయలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. బఫర్ జోన్‌లోని స్థలంతో పాటు పక్కనే ఉన్న ఇతరుల స్థలాన్ని కలిపి దౌర్జన్యంగా ఇల్లు నిర్మిస్తున్నట్టు స్థానికులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా నగరపాలక సంస్థ అధికారులు స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాము అనే వ్యక్తి ఆక్రమించి కడుతున్న స్థలం ప్రభుత్వానిదని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినట్టు చేశారు.
బఫర్ జోన్‌లో ఇల్లు కట్టకూడదని చెబుతున్న వార్డు ప్లానింగ్ సెక్రెటరీ పీఎం హౌసింగ్ ఇల్లు నిర్మాణానికి ఏవిధంగా అనుమతిచ్చారో తెలియాల్సి ఉంది. రెండుసార్లు అక్రమ నిర్మాణంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడు నుంచి వివరణ తీసుకోకుండా సమస్య పరిష్కారం అయినట్టు అధికారులు పోస్టు ద్వారా ఎండార్స్‌మెంట్ పంపించినట్టు తెలుస్తోంది. వార్డు ప్లానింగ్ సెక్రెటరీని కలిసి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తే ఆక్రమణదారుడికి మద్దతుగా మాట్లాడినట్టు స్థానికులు వాపోతున్నారు.
నగరంలో అనేక చోట్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగడానికి పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల చేతివాటం కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులు నుంచి లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. గుజరాతీపేట పరిధిలో నాగావళి బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణంపై నగరపాలక సంస్థ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి నిర్మాణాల కోసం కార్పొరేషన్ కార్యాలయం వరకు రాకుండా ప్లానింగ్ సెక్రటరీలకే అధికారాలు ఇచ్చారు. అప్పట్లో నిబంధనలకు అనుకూలంగా ఇళ్లు నిర్మించుకున్నా కనీసం మానవత్వం చూపకుండా ప్రభుత్వానికి ఒక్కో వార్డులో 500 ఓట్లకు తక్కువ లేకుండా నష్టం చేసిన వీరిలో చాలామంది ఆ తర్వాత కాలంలో కాంట్రాక్టర్లుగా, దళారులుగా అవతారమెత్తారు. ప్లాన్ పెట్టిన దగ్గర్నుంచి భవనం నిర్మించేవరకు అన్నీ ఏకమొత్తంలో కాంట్రాక్ట్ తీసుకొని, ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో కూడా అడ్డంగా అనుమతులిచ్చి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా డివిజన్‌కు 500 ఓట్లకు తక్కువ లేకుండా వీరంతా కలిసి నష్టం చేస్తారనడంలో సందేహం లేదు. తిలా పాపం, తలా పిడికెడు లాగ కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్లానింగ్ సెక్రటరీల ద్వారా అన్నీ కానిచ్చేస్తున్నారు.






Comments