top of page

గంట గంటకూ మరణ ఘంటికలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

ప్రపంచం ప్రస్తుతం జనాభా బాంబుపై ఉంది. ఈ బాంబు విస్ఫోటిస్తే సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఛిద్రమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఉంది. జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య పెరిగి జననాల కంటే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చైనా, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు జననాలను ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో సంభవిస్తున్న మరణాల లెక్కలు రకరకాల విశ్లేషణలకు తావిస్తున్నాయి. మానవాళి తమ దైనందిన పనుల్లో మునిగిపోయి, సెల్‌ఫోన్లలో లీనమైపోయి, నిద్రావస్థలోకి జారుకుంటున్న వేళ ప్రపంచంలో అనేక రూపాల్లో మరణమృదంగం నిర్విరామంగా మోగుతూనే ఉంది. కానీ ఆ కర్ణక£ఠోర శబ్దాలు మనకు వినిపించడంలేదు.. అన్ని మరణాల గురించి తెలియడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంట వ్యవధిలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేవీ యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవిస్తున్న మరణాలు కావు. నిత్య జీవితంలో సహజంగా జరుగుతున్నవే. అదే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వేళ ఇవి మరింత అధికంగా ఉంటున్నాయి. ఈ లెక్కలు మన ఆరోగ్య వ్యవస్థలు, జీవన విధానాలపై ఎన్నో కొత్త ప్రశ్నలు, సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే జననమరణాలు జీవితచక్రంలో సహజ పరిణామాలు మాత్రమే కావు. మానవ సమాజ ప్రగతే వాటిపై ఆధారపడి ఉంది. ఆ దృష్టితో చూస్తే ఇవి కేవలం లెక్కలు మాత్రమే కావు. వీటి వెనుక ఆయా కుటుంబాల మనుగడతోపాటు దేశప్రగతి ప్రభావితమవుతుంది. ఇంతకీ ప్రతి గంటకు ఏ దేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? ఇందులో భారతదేశం స్థానం ఏంటి? అనే విషయాలను ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోయింది. ఇందులో 146 కోట్లకుపైగా జనాభాతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా 141 కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, 34 కోట్లకు పైగా జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ఏ దేశంలో ఎంత జనాభా ఉంది.. ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు చెప్పడమే ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం కాదు. ఏ దేశం గంటకు అత్యధికంగా ఎంతమందిని కోల్పోతున్నది.. ఎంతమంది కొత్తగా పుడుతున్నారు.. దానివల్ల జనాభా సమతుల్యతపై ఎంతమేరకు ప్రభావం పడుతున్నదన్నది విశ్లేషించడమే లక్ష్యం. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం మరణాల సంఖ్య చాలా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా చైనా, భారత్ వంటి దేశాల్లో ప్రతి గంట వ్యవధిలో వెయ్యి కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి ఆయా దేశాల భారీ జనాభాతో పాటు, అక్కడ ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతున్నాయి. మరణాల సంఖ్యను పరిశీలిస్తే ప్రతి గంటకు సుమారు 1,221 మరణాలతో చైనా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. చైనాలో జనాభా ఎక్కువగా ఉండటం, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, అక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత రెండోస్థానంలో భారతదేశం ఉంది. ఈ దేశంలో ప్రతి గంటకు సుమారు 1,069 మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా. చిత్రమేమిటంటే.. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్ మరణాల విషయంలో రెండోస్థానంలో.. అలాగే జనాభాలో రెండో స్థానంలో ఉన్న చైనా మరణాల విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి. మన దేశంలో మరణాల వృద్ధికి జనాభా పెరుగుదల ఒక కారణం కాగా.. సరైన జీవన ప్రమాణాలు లేకపోవడం, మారుతున్న జీవనశైలి వ్యాధులు, అందరికీ సరైన వైద్య సదుపాయాలు అందకపోవడం వంటి సమస్యలు కారణమవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ప్రతి నిమిషానికి 18 మందికిపైగానే చనిపోతున్నారు. కాగా చైనా, భారత్‌ల తర్వాత మరణాల సంఖ్యలో అమెరికా మÖడో స్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రతి గంటకు సుమారు 332 మరణాలు సంభవిస్తున్నాయి. చైనా, ఇండియాల కంటే అమెరికా జనాభా చాలా తక్కువైనప్పటికీ మరణాలు అధికంగా ఉండటానికి ఆ దేశంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం, దీర్ఘకాలిక రోగాల బెడద తీవ్రంగా ఉండటం కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇతర దేశాల పరిస్థితి పరిశీలిస్తే.. ప్రతి గంటకు 313 మరణాలతో నాలుగో స్థానంలో నైజీరియా, 238కి పైగా మరణాలతో ఐదో స్థానంలో ఇండోనేషియా, సుమారు 198 మరణాలతో ఆరో స్థానంలో రష్యా, ఆ తర్వాత 181 మరణాలతో ఏడో స్థానంలో పాకిస్తాన్, 180కిపైగా మరణాలతో ఎనిమిదో స్థానంలో గంటకు 180 మరణాలతో జపాన్, సుమారు 167 మరణాలతో తొమ్మిదో స్థానంలో బ్రెజిల్, 108కిపైగా మరణాలతో పదో స్థానంలో జర్మనీ నిలుస్తున్నాయి. ఈ నివేదిక ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. అధిక మరణాలు సంభవించడానికి జనాభా ఒక్కటే కారణం కాదని ఇది స్పష్టం చేస్తుంది. దేశాల ఆర్థిక పరిస్థితులు, వైద్య రంగంలో పరిష్కారం కాకుండా ఉన్న లోపాలు, నివారించగల వ్యాధుల పట్ల నిర్లక్ష్యం కూడా దీనికి కారణాలుగా చెబుతున్నారు. ప్రతి గంటకూ ఎటువంటి హ్యాష్‌ట్యాగ్‌లు లేకుండా, హెచ్చరికలు లేకుండా నిశ్శబ్దంగా వేలాది మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ మరణాల సంఖ్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఏ దేశం మొదటి స్థానంలో ఉందనేది ముఖ్యం కాదు. ఇలాంటి మరణాలను తగ్గించడానికి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రపంచ దేశాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయనేదే అసలైన ప్రశ్న. అదుపుతప్పిన జనాభా విస్ఫోటనం ఎంత ప్రమాదకరమో.. దానితో సంబంధం లేకుండా మరణాలు పెరగడం కూడా అంతే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page