గుండెకు రక్ష.. స్టెమీ చికిత్స!
- DV RAMANA

- 5 days ago
- 3 min read
ఈ విధానం ద్వారా చాలావరకు మరణాలకు చెక్
గోల్డెన్ అవర్ పరిరక్షకురాలిగా పేర్కొంటున్న వైద్యవర్గాలు
ఇప్పటివరకు రాష్ట్రంలో 3027 ‘పోటు’ బాధితులకు రక్షణ
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఇంజక్షన్

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
దాదాపు నాలుగేళ్ల క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయారు.
నిండా పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడు మైదానంలో క్రికెట్ ఆడి.. ఇంటికి బయల్దేరుతుండగా నిలువునా కూలి ప్రాణాలు కోల్పోయాడు.
మరొకాయన ఈమధ్యే ఇంటి వద్ద పేపర్ చదువుతూ అలాగే కుర్చీలో అచేతనంగా ఉండిపోయారు.
ఇలా చెప్పుకొంటూపోతే ఇలాంటి ఘటనలు ఈమధ్యకాలంలో కోకొల్లలు. ఇవన్నీ గుండెపోటు మరణాలే. గతంలో 40 ఏళ్లు దాటినవారికే గుండెపోటు వస్తుందన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు, పరిమితులన్నీ చెరిగిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే నిండు జీవితాలు అంతమవుతున్నాయి. మరికొంతమంది ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆకస్మాత్తుగా వచ్చే గుండెనొప్పితో ప్రాణాలకు గండమే. తక్షణ వైద్యం అందితేనే గుండెపోటు బాధితుల ప్రాణాలను రక్షించుకోవచ్చు. రోగిని చికిత్సకు తరలించడం ఏమాత్రం ఆలస్యమైనే అంతే సంగతులు. ఒక వ్యక్తి గుండె పోటుకు గురైన విషయాన్ని సకాలంలో గమనించి.. అది మరణానికి దారితీయకముందే శరవేగంగా ఆస్పత్రికి తరలించే తగిన చికిత్స అందేలా చేసే ఆ సమయమే అతి కీలకమైనది. దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్‌లోనే ఒక ముఖ్యమైన ఇంజక్షన్ ఇస్తే రోగిని ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చు. అయితే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు, మందులు అందుబాటులో ఉండవు. ఈ ప్రాంతాలకు చెందిన వారికి స్ట్రోక్ వస్తే సమీప పెద్ద పట్టణాల్లోని ఆస్పత్రులకు తరలించేలోపే గోల్డెన్ అవర్ కరిగిపోయి.. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి గొల్డెన్ అవర్ మరణాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య విధానమే స్టెమీ చికిత్స.
గ్రామీణ రోగులకు ఉపయుక్తం
గోల్డెన్ అవర్ వైద్యం అందక గ్రామీణ ప్రాంతాల వారు హైరిస్క్ ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో గుండెపోటు రోగులకు సత్వర వైద్య చికిత్స ఆందడం జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ విధానం పరిధిలోకి రాష్ట్రంలో ఉన్న మొత్తం 238 ప్రభుత్వ సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు)లు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులను తీసుకొచ్చింది. ఈ ఆస్పత్రుల్లో అత్యంత ఖరీదైన ‘టెనెక్టేప్లాస్’ అనే ఇంజక్షన్లను అందుబాటులో ఉంచారు. రూ. 45వేల విలువైన ఈ ఇంజక్షన్‌ను రోగులకు పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. సాధారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే దమనుల్లో రక్తం గడ్డ కట్టి క్లాట్స్ ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. గడ్డ కట్టుకుపోయిన రక్తాన్ని కరిగించి రక్తసరఫరాను టెనెక్టేప్లాస్ ఇంజక్షన్ పునరిద్ధరిస్తుంది. స్టేమీ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన పరికరాలు, యంత్రాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రూ.16.60 కోట్లు మంజూరు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్ ధర రూ. 40 వేల నుంచి 45 వేల వరకు ఉంది. ఇతర ఖర్చులు అదనం. అయితే ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను టెండర్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ఒక్కో ఇంజెక్షన్‌కు సుమారు రూ.19 వేలు, దానికి సపోర్టింగ్ మందుల కోసం రూ. ఆరువేలు ఖర్చు చేస్తోంది. సీహెచ్‌సీల్లో మూడు చొప్పున, ఏరియా ఆస్పత్రుల్లో నాలుగు చొప్పున, జిల్లా ఆస్పత్రుల్లో ఐదు చొప్పున ఇంజక్షన్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇవి కాకుండా అదనంగా ఎప్పుడు అవసరమైనా వెంటనే తెప్పించుకునేందుకు వీలుగా జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో అదనంగా ఇంజక్షన్లను అందుబాటులో ఉంచుతున్నారు.
96 శాతం సత్ఫలితాలు
స్టెమీ విధానం పుణ్యాన గత మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తం గా సుమారు మూడు వేలమంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఛాతీనొప్పి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన వారిలో 3,155 మందికి ‘టెనెక్టెప్లాస్’ ఇంజక్షన్లు ఇవ్వగా.. వారిలో 3027 మంది ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. అంటే దాదాపు 96 శాతం మంది ప్రాణాలను ఈ కొత్త విధానం కాపాడగలిగిందన్నమాట. ఆస్పత్రులకు వచ్చేవారే కాకుండా హృద్రోగ లక్షణాలు ఉన్నవారిని ముందే గుర్తించి గుండెనొప్పి రాకుండా చూసేలా ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేస్తోంది. ఆకస్మిక మరణాల రేటును బాగా తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. స్టెమీ చికిత్స కింద ప్రతి నెలా సగటున 175 మంది ప్రభుత్వాస్పత్రుల్లో టెనెక్టేప్లాస్ ఇంజక్షన్ తీసుకుంటున్నారు. గత ఏడాది జూన్ ఒకటి నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలవారీగా అనంతపురం జిల్లాలో 617 మందికి స్టెమీ చికిత్స లభించింది. విశాఖ జిల్లాలో 416, కర్నూలులో 412, గుంటూరులో 354, కాకినాడలో 346, తిరుపతిలో 213, ఎన్టీఆర్ జిల్లాలో 205, శ్రీకాకుళం జిల్లాలో 203, కడపలో 147, ప్రకాశంలో 134, నెల్లూరులో 108 మందికి చొప్పున స్టెమీ వైద్యం అందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
‘యాప్’ ద్వారా పర్యవేక్షణ
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో స్టెమీ విధానం అమల్లో ఉంది. ఈ ఆస్పత్రులకు గుండెనొప్పితో బాధపడుతూ వచ్చిన వారి ఆరోగ్య వివరాలను అక్కడి వైద్య సిబ్బంది సేకరించి తమ పరిధిలోని బోధనాస్పత్రుల్లోని కార్డియాలజీ విభాగానికి ‘స్టెమీ’ యాప్ ద్వారా పంపుతున్నారు. కార్డియాలజీ నిపుణులు వాటిని పరిశీలించి ఇంజక్షన్ ఇవ్వాలా? అవసరం లేదా? ఇంజక్షన్ ఇస్తే తదుపరి చికిత్స ఎలా? అన్న దానిపై వైద్య సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే 108 కాల్ సెంటర్ ద్వారా కూడా స్టెమీ చికిత్స పొందినవారి వివరాలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.










Comments