గ్యాస్ కష్టాలకు బహుముఖ చెక్!
- DV RAMANA

- 3 hours ago
- 3 min read
కేంద్రానికి పాఠాలు నేర్పిన పశ్చిమాసియా యుద్ధం
గల్ఫ్‌కు ప్రత్యామ్నాయంగా 15 దేశాలతో ఒప్పందాలు
వ్యూహాత్మక నిల్వలను 30 రోజులకు పెంచే ప్రణాళికలు
రవాణా ఇక్కట్ల నియంత్రణకు భారీగా పైపులైన్ల నిర్మాణాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
యుద్ధం ఒక దేశాన్ని, ఒక నాగరికతను నాశనం చేస్తుంది.. కొన్ని దేశాలను సంక్షోభంలోకి నెడుతుంది. అదే యుద్ధం మరో దేశాన్ని లేదా సమÖహాన్ని విజేతగా నిలబెట్టి అందలం ఎక్కిస్తుంది. అదే యుద్ధం మరికొన్ని దేశాలకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పుతుంది. ప్రస్తుతం అమెరికా`ఇరాన్ యుద్ధంలో విజేత ఎవరు, విజితలెవరన్నది పక్కనపెడితే.. ఈ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. కానీ ఈ యుద్ధం నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుంది. పెట్రో, గ్యాస్ ఉత్పత్తుల కోసం మనదేశం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. అందులోనూ ప్రస్తుతం ఉద్రిక్తతలు అలుముకున్న గల్ఫ్ దేశాల నుంచి 80 శాతం దిగుమతులు చేసుకుంటున్నది. కానీ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మÖతపడి ఆయిల్, గ్యాస్ రవాణా స్తంభించిన పరిస్థితుల్లో ఉన్న ఫళంగా భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చింది. 145 కోట్లకుపైగా జనాభా ఉన్న అతిపెద్ద దేశానికి సరిపడా ఇంధన వనరులను అప్పటికప్పుడు సమకూర్చుకోవడం చాలా కష్టతరం. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. దాంతో ఒకవైపు గల్ఫ్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు క్రూడ్, గ్యాస్ తెప్పించుకునేందుకు ఆఫ్రికా దేశాలతో వాణిజ్య ద్వారాలు తెరిచిన భారత ప్రభుత్వం మరోవైపు దేశీయంగా అత్యవసర సమయాల్లో కనీసం కొన్ని రోజులపాటు వినియోగించుకునేందుకు వీలుగా వ్యూహాత్మక గ్యాస్ నిల్వల సామర్థ్యాన్ని బాగా పెంచుకోవడం, ప్రజలను ఎల్పీజీ నుంచి పైప్డ్ గ్యాస్ వైపు మళ్లించడం అనే బహుముఖ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
దిగుమతుల వికేంద్రీకరణ
యుద్ధానికి ముందు వరకు భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పతి చేయగలిగేది. మిగతా 60 శాతాన్ని ఖతార్ వంటి రెండు మÖడు దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కానీ యుద్ధం కారణంగా హర్మూజ్‌లో రవాణా స్తంభించడంతో అక్కడి నుంచి గ్యాస్ వచ్చే దారులు మÖసుకుపోయాయి. దాంతో ఉన్నఫళంగా దేశీయ ఉత్పత్తిని 20 శాతం వరకు పెంచిన ప్రభుత్వం.. అదీ సరిపోని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ దిగుమతులపై దృష్టి సారించింది. యుద్ధానికి ముందు మనదేశం దిగుమతి చేసుకుంటున్న 60 శాతం గ్యాస్‌లో దాదాపు 90 శాతం ఖతార్, యÖఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాల నుంచి వచ్చేది. ఇప్పుడు ఆ దేశం నుంచి ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో ఆఫ్రికా దేశాలతోపాటు అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా తదితర 15 దేశాలతో ఒప్పందాలు చేసుకుని దిగుమతి చేసుకుంటున్నది.
స్ట్రాటజిక్ నిల్వ సామర్థ్యం పెంపు
యుద్ధాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కేంద్రం నడుం కట్టింది. క్రూడ్ ఆయిల్ విషయంలో వ్యూహాత్మక నిల్వల విషయంలో ఇప్పటికే కేంద్రం ముందున్నది. దేశంలో విశాఖ సహా మÖడు ప్రాంతాల్లో భూగర్భ నిల్వ కేంద్రాల్లో సుమారు 50 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలను కేంద్రం నిర్వహిస్తూ వస్తున్నది. దేశంలో మరో రెండు నిల్వకేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ కోట్లాది ప్రజలకు అవసరమైన ఎల్పీజీ విషయంలో ఇప్పటివరకు వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఎల్పీజీ నిల్వకు దేశంలో విశాఖ, మంగళూరులలో మాత్రమే రెండు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. మంగళూరులో 80 వేల టన్నులు, విశాఖలో 60వేల టన్నులు.. మొత్తం 1.40 లక్షల టన్నుల గ్యాస్ మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ ప్రజల అవసరాలకు రోజుకు 80వేల టన్నుల గ్యాస్ అవసరం. అంటే ప్రస్తుతం ఉన్న 1.40 లక్షల టన్నులు ఒకటిన్నర రోజులకు మించి సరిపోవు. ఈ నిల్వ సామర్థ్యాన్ని 30 రోజులకు పెంచాలన్న లక్ష్యంతో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుత నిల్వ కేంద్రాలు కేవలం రెండు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా మరిన్ని నిల్వ కేంద్రాలను నిర్మించడానికి చర్యలు చేపట్టారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గ్యాస్ నిల్వల విషయంలో మనదేశం చాలా వెనుకంజలో ఉంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏకంగా 200 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలను కొనసాగిస్తుంటాయి. దీనివల్ల యుద్ధాలు, ఇతర సంక్షోభాలు ఏర్పడినా ప్రజా గ్యాస్ సరఫరా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో నడుస్తున్నది. దీర్ఘకాలిక ప్రణాళికలతో కొత్త స్టోరేజ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, సరఫరా ఆగినా దేశీయంగా వాటి ప్రభావం పెద్దగా ఉండదు.
పైపులైన్ వ్యవస్థలకు ప్రాధాన్యం
మరోవైపు వంటగ్యాస్ రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు వీలుగా రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించేలా నాలుగు పైప్‌లైన్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి సుమారు రూ. 12,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2500 కిలోమీటర్ల నిడివిన నాలుగు పైప్‌లైన్ల నిర్మాణానికి బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం ఇది ముగింపు దశలో ఉంది. చర్లపల్లి - నాగ్‌పూర్, శిఖ్రాపూర్ -హుబ్లీ - గోవా, పారాదీప్ - రాయ్‌పూర్, ఝన్సీ - సీతార్‌గంజ్ మార్గాల్లో నిర్మించే ఈ పైపులైన్ల ద్వారా ప్రస్తుతం ఎల్పీజీని రవాణా చేస్తారు. దీనివల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు, పోర్టులను బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు తగ్గిపోతాయి. అవసరమైన సమయాల్లో ఈ పైప్‌లైన్లే స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉంటే పంపిణీ ఖర్చులను చాలావరకు నియంత్రించవచ్చు. అలాగే పైప్డ్ గ్యాస్ సరఫరాను విస్తృతం చేసే వెసులుబాటు కలుగుతుంది.






Comments