పార్కింగ్ సరే.. బోరేదీ?
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
మారుతీనగర్ జంక్షన్‌లో పంచాయతీ బోరుకు సమాధి
అసలు అక్కడ అటువంటిదేమీ లేదంటున్న పంచాయతీ అధికారి
ప్రైవేటు స్థలంలో ఉందంటున్న యాజమాన్యం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫొటో చూడండి.. నరసన్నపేట మారుతీనగర్ జంక్షన్‌లో కొన్నాళ్ల క్రితం నిర్మిస్తున్న ఓ భవనం ముందు కనిపిస్తున్న పంచాయతీకి చెందిన బోరు. (పని చేస్తుందా? రిపేరు చేస్తే బాగుపడుతుందా అనేది వేరే విషయం)

అదే యాంగిల్‌లో ఇప్ప్పుడు ఈ ఫొటోను చూడండి.. అదే నరసన్నపేట, అదే మారుతీనగర్ జంక్షన్‌లో అదే భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత అందంగా కనిపిస్తున్న పార్కింగ్ ఏరియా. బావుంది కదూ..
మరి అక్కడ బోరేదీ? మీకు కనపడకపోతే కళ్లదోషం ఉన్నట్టు కాదు. ఆ బోరు మాయమైపోయింది. అసలే తాగునీరుకు ఇబ్బంది పడుతున్నామంటూ పంచాయతీ ప్రజలు ఒకటికి పదిసార్లు బోర్లు బాగుచేయించాలని ఫిర్యాదు చేస్తే, అటువైపు చూడలేదు సరికదా.. అక్కడో బోరు ఉండాలి.. ఏమైందని అడిగితే.. అబ్బే అలాంటిదేమీ ఉన్నట్టు తమకు తెలియదని స్వయంగా పంచాయతీ సెక్రటరీయే ఓ ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. అంటే.. అర్థమవుతుంది కదా.. బోరు భూమిలో కలిసిపోయింది.
అంతేనా.. కాదు. అంతకు మించి లోతుల్లోకి వెళ్లాలి. పంచాయతీ నిధులతో ఒక బోరు వేసిందంటే.. అది కచ్చితంగా ప్రభుత్వ భూమిలోనే అయివుండాలి. ఇప్ప్పుడు అటువంటి బోరును కప్పేసి పార్కింగ్ కింద చదును చేశారంటే.. ప్రభుత్వ భూమిని పార్కింగ్‌గా మార్చినట్టే కదా. మరి మెయిన్‌రోడ్డు మీదే ఇంత జరుగుతుంటే పంచాయతీ ఈవో ఏం చేస్తున్నట్టు? ఇప్ప్పుడు ఇదే అడుగుతున్నారు మారుతీనగర్ ప్రజలు. ఈ జంక్షన్‌లో ఆహా హోటల్ ఆమధ్య ప్రారంభించారు. ఓహో అంటూ అందరూ నోరెళ్లబెట్టి చూశారు. తీరా చూస్తే అక్కడ బోరును మింగేశారు. పనిలో పనిగా ప్రభుత్వ స్థలాన్ని వాడేస్తున్నారు. ఈ స్థలం ఎవరిదని ఆరా తీస్తే అది గతంలో జలగల చెరువు పోరంబోకుగా ఉండేది. ఆ తర్వాత ఆ చెరువు పూర్తిగా కప్పేయడంతో రోడ్డు పోరంబోకుకు ఆనుకొని కాలువ తవ్వారు. మారుతీనగర్ ప్రజల వాడుక నీరు ఈ కాలువ నుంచే బయటకు వెళ్తుంది. అయితే ఇప్ప్పుడు ఈ భవనం నిర్మించినప్ప్పుడు ఆ కాలువను మÖసేసి, పక్కనే ఉన్న బోరు సమాధి చేసేయడంతో వాడుకనీరు కాలువల్లోంచి మెయిన్ రోడ్డు మీదకు ప్రవహిస్తోంది.
ప్రభుత్వ స్థలంలో ఉన్న పబ్లిక్ బోర్‌ను ఎందుకు తొలగించారని స్థానికులు, ఆటోడ్రైవర్లు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. తమ స్థలంలో బోరు ఉందని, అందుకే తొలగించామని చెబుతున్నారట. ప్రైవేటు స్థలంలో బోరు ఉండటమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాదు కాదు అది కాలువ గట్టు అని కొందరంటున్నారు. దీనిపై మÖడు పర్యాయాలు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు యాళ్ల మహేష్ ‘సత్యం’కు తెలిపాడు. ఏడాది క్రితం నుంచి బోరు తొలగించిన వారిపై చర్యలు తీసుకొని నూతనంగా బోర్‌ను ఏర్పాటు చేయాలని స్థానిక పంచాయతీ ఈవోను కోరినా ఫలితం కలినిపించలేదని తెలిపాడు. ఇటీవల మరోమారు గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారని తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 21న అక్కడ బోరు లేదని, పబ్లిక్ బోరు ఉన్నట్టు పంచాయతీ రికార్డుల్లో నమోదు కాలేదని పంచాయతీ సెక్రటరీ ఒక ఎండార్స్‌మెంట్‌ను ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలో పంచాయతీకి చెందిన పబ్లిక్ బోర్‌ను 2024 నవంబర్‌లో ప్రైవేట్ వ్యక్తులు తొలగించినట్టు స్థానికులు చెబుతున్నారు. నరసన్నపేటలో ప్రధాన రోడ్డును విస్తరించినా పబ్లిక్ బోర్ అవసరాన్ని గుర్తించి దానికి ఎటువంటి నష్టం కలగనివ్వకుండా కాపాడుకున్నామని, అలాగే 2017లో రోడ్డు పక్కనే వైఎస్సార్ విహ్రాన్ని ఏర్పాటు చేసినప్ప్పుడూ బోర్‌ను తొలగించే ప్రయత్నం చేయలేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఆహా హోటల్ నిర్మించాకే పార్కింగ్ కోసం పబ్లిక్ బోర్‌ను లేపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనం మాత్రం వేరేవారిది. హోటల్ నడుపుతున్నది మరొకరు. అడ్రస్ కోసం మనం ఆహా హోటల్ అనే చెప్ప్పుకోవాలి.






Comments