top of page

మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 hours ago
  • 3 min read
  • పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన

  • జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్

  • వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం

  • నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు

  • అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్యేకంగా వాటర్‌బోర్డ్ ట్రిబ్యునళ్లు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర మధ్య గోదావరి, కష్ణా జలాల కోసం గానీ, ఒడిశాతో మనరాష్ట్రానికి వంశధార నీటి విషయంలో వివాదాలు ఉండటం తెలిసిందే. కానీ ఒకే జిల్లాలో నియోజకవర్గాల మధ్య తాగునీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు జరిగే వాతావరణం కనిపిస్తున్నది. ఉద్దానం ప్రాంతానికి తాగునీరు అందించడానికి నిర్మించిన ప్రాజెక్టు తమ నియోజకవర్గం మీదుగానే వెళ్తున్నా.. తమకు మాత్రం చుక్క నీరు అందడంలేదంటూ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వాపోతుంటే.. పేరుకు ఉద్దానానికి వాటర్ ప్రాజెక్టు ఉన్నా మోటార్లు పాడైపోయినా, విద్యుత్ సరఫరా లేకపోయినా మొత్తం మూడు రోజుల్లో మూలకు చేరిపోతుందని ఉద్దాన ప్రాంత నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ‘పానీ’పట్ యుద్ధానికి రెండు రోజుల క్రితం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశమే వేదికైంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రశ్నించాల్సిన నాయకులు ఒకే తానులో ఉన్నారు కాబట్టి పెద్దగా కుస్తీలు పట్టలేదు కానీ, లోలోన రగిలిపోతున్నారు.

పాతపట్నం దాహార్తి

ఉద్దానం తాగునీటి అవసరాల కోసం హిరమండలం నుంచి నీటిని తరలించుకుపోతున్నా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమవుతున్నారని బుధవారం జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో 9 గ్రామాలు, హిరమండలంలో 4, పాతపట్నంలో 6, ఎలఎన్‌పేటలో 4, కొత్తూరులో 3 గ్రామాల ప్రజలు తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందించలేక ఆ గ్రామాల్లో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని వాపోయారు. జల్ జీవన్ మిషన్ పథకంలో కేటాయించిన రూ.110 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని, తాగునీటిపై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. దీనికి పూర్తి భిన్నంగా జల్ జీవన్ మిషన్ పథకం నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు జరగడంలేదని స్వయంగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయే సమావేశంలో అసంతప్తి వ్యక్తం చేశారు. దీనిపై ‘సత్యం’ క్షేత్రస్థాయి పరిశీలనలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉద్దానానికి ఇక్కడి నీరు

జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న ఉద్దానం గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడానికి సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.4162 కోట్ల వ్యయంతో 807 గ్రామాల్లో ఆరు లక్షల మందికి పైగా తాగునీరు అందించేందుకు ఉద్దానం తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. దీనికి హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని వంశధార నదీ పరివాహక ప్రాంతం నుంచి కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు సురక్షితమైన నీరును అందిస్తున్నారు. అంటే.. దీనికి ప్రధాన నీటివనరు వంశధార నదిపై ఉన్న హిరమండలం రిజర్వాయరే. ప్రతిరోజు 84 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. 14 రిజర్వాయర్లు, 259 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లతో మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. కేంద్రం జల్ జీవన్ మిషన్‌తో దీన్ని అనుసంధానం చేసింది. కట్ చేస్తే.. వంశధార నది మీద కట్టిన గొట్టా రిజర్వాయర్ పాతపట్నం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచే ఉద్దానానికి పైప్‌లైన్లు వెళ్లాయి. గొట్టా, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల మీదుగా పలాస నియోజకవర్గంలోకి వెళ్తుంది. అంటే.. పాతపట్నంలో ఉన్న రిజర్వాయర్ నుంచి ఆ నియోజకవర్గంలోనే ఉన్న మండలాల మీదుగా ఉద్దానానికి నీరు వెళ్తున్నా ఆ నియోజకవర్గంలో మాత్రం చుక్క నీరు ఇచ్చేందుకు వీలు లేకుండాపోయింది. ఇదే విషయాన్ని 2023లో అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి జగన్మోహన్ రెడ్డిని కలిసి పాతపట్నానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దీంతో అప్పటి ప్రభుత్వం పాతపట్నం నియోజకవర్గానికి కూడా తాగునీరు అందించే పథకానికి రూ.260 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు కొరసవాడ`కాగువాడ మధ్య ప్రాజెక్టుకు అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల రూ.265 కోట్ల అంచనాలతో మళ్లీ ఈ పథకం పనులు ప్రారంభిస్తున్నట్లు మరో శిలాఫలకం వేసింది. పనులు జరుగుతున్నాయని నమ్మకం కుదరడానికి పైప్‌లైన్లు కూడా వేసింది. అయితే ఇది మందకొడిగా సాగుతోంది. ఈలోగా జిల్లాలో క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొత్తూరులో బుధవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమైదైంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఏడాదికేడాది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లాలోని 30 మండలాలకు గాను 18 మండలాల్లో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు అడుగంటాయి. జనానికి తాగునీటి సమస్యలూ తప్పడం లేదు. బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో వేసవి తాపం మరింత పెరగనుంది.

ముందస్తు ప్రణాళికల్లేని యంత్రాంగం

జిల్లాలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన ముందస్తు ప్రణాళికపై జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారుల వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదు. రూ.700 కోట్లతో నిర్మించిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా, నీటిని సరఫరా చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ఉన్నా తాగునీటి కష్టాలు తప్పడం లేదన్న వాదన స్థానికంగా వినిపిస్తున్నది. ఈ ప్రాజెక్టు కేవలం హిరమండలం ర్పుిర్వాయర్ నుంచి ఇచ్ఛాపురం వరకు పైప్‌లైన్లు వేయడానికి మాత్రమే ఉద్దేశించిందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఓవర్‌హెడ్ ట్యాంకులకు పైప్‌లైన్లను అనుసంధానం చేయడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి జల్ జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటుచేయాలి. జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా గత ఏడాది డిసెంబర్ నాటికి కుళాయిలు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు రద్దు చేశారు. మూడోసారి టెండర్లు ఖరారు చేసినా పనులు ముందుకు సాగలేదు. దీంతో ఈ టెండర్లు కూడా రద్దు చేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించాలని ఇచ్ఛాపురానికి చెందిన స్థానిక సంస్థల ప్రŸజాప్రతినిధులు జెడ్పీ సమావేశంలో కోరారు. ఉద్దానంలో తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించారో చెప్పాలని అధికారులను కోరినా సమాధానం చెప్పలేని పరిస్థితి. పైప్‌లైన్ లీకేజీలను అరికట్టడానికి నిధులు మంజూరు చేస్తున్నా పనులు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీ సమావేశంలో ఇదే అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఉద్దానం ప్రాజెక్టు పనులను అడ్డగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాతపట్నం నియోజకవర్గానికి నీరందించకుండా నీటిని తరలించుకుపోతున్న ఉద్దానం ప్రాజెక్టును మార్చాలని సభలో డిమాండ్ చేశారు. ఈ లెక్కన జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ పŸథకంలో 25 శాతం కంటే తక్కువగా చేసిన పనులను 2024 డిసెంబర్‌లో రద్దు చేస్తూ జీవో 73 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో రూ.229 కోట్లతో చేపట్టిన 1,322 పనులు రద్దయ్యాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page