top of page

గోల్‌మాల్ గోవిందం!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 hours ago
  • 4 min read
  • ఇద్దరు గోవిందులు కలిసి మాయ చేశారు

  • ఆధార్, ఆరోగ్య రిపోర్టు.. అన్నీ కల్పనలే

  • అసలుసిసలు కేసుల సెటిల్మెంట్‌కు సవాలక్ష సాకులు

  • నకిలీ పాలసీల బుట్టలో పడటంపై అనుమానాలు

  • ఈ అక్రమాల్లో ఆయా సంస్థల సిబ్బంది ప్రమేయంపై చర్చ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

  • బెండి మహాలక్ష్మి.. ఊరు వంజంగి.. వయసు 55 ఏళ్లు. ఆమె కూతురు వయసు 63. కోడళ్లలో ఒకామె వయసు 65. అంటే ఆమె కొడుకు వయసు ఎంతో ఊహించవచ్చు. అలాగే ఈ 55 ఏళ్ల మహిళకు 49 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు! అంటే.. ఆరేళ్లకే ఆమె తల్లి. ఇదెలా సాధ్యమని అడక్కండి. అదంతే..!

  • మురపాక సూర్యనారాయణ.. వయసు 46. ఈయనది కూడా వంజంగే. కారణాలేమైనా కానీ.. 2021 ఏప్రిల్ 24న కన్నుమూశాడు. కానీ నాలుగు నెలల తర్వాత.. అంటే ఆ ఏడాది ఆగస్టులో ఆయన కొన్ని ప్రైవేటు బీమా సంస్థల్లో టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి పై నుంచి డాక్యుమెంట్లు పంపాడా? అనే ప్రశ్న ఉత్పన్నమైతే మీరు ఇన్సూరెన్స్ కంపెనీలనే నేరుగా సంప్రదించండి.

  • బెండి సత్యవతి.. వయసు 47. ఈమెది కూడా వంజంగే. విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆమె ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ డొమైన్‌లో ఆ వివరాలు ఉన్నాయి. చాలామంది క్యాన్సర్ పేషెంట్లలాగే ఆమె కూడా చనిపోయింది. కానీ ఆమెకు రూ.1.50 కోట్లకు కొన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు టెర్మ్ పాలసీ ఇష్యూ చేశాయి.

  • .. వీటిలో రెండు కేసులకు నామినీగా ఉన్న వ్యక్తి ఒకరే. పరలోకం నుంచి పాలసీ చేయించుకున్న వ్యక్తి తరఫున వచ్చిన బీమా సొమ్ములో మెజార్టీ వాటా పొందింది కూడా ఈ వ్యక్తే. ఇచ్చినోడికి, పుచ్చుకున్నోడికి నొప్పి లేనప్ప్పుడు పత్రికలకు ఎందుకీ గోల? అనే మహానుభావులు కూడా ఉంటారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

తిరగబడుతున్న బోర్డులు

జీవితం ఏదో ఒకరోజు ముగిసిపోతుందని, ఆ తర్వాత కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే.. తనకొస్తున్న సంపాదనలో కొంత మొత్తంతో బీమా చేయించుకోవాలని భావించి చాలామంది టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కడుతుంటారు. వయసు, ఆరోగ్యం, ఇన్నాళ్లు బతుకుతాం.. అన్న అంచనాల ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా పాలసీదారులకు ప్రీమియం నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న పెద్దమనసు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎందుకుంటుంది? ఇదంతా లభాల కోసం చేసే వ్యాపారం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వందమంది టెర్మ్ ఇన్సూరెన్స్ కడితే వాటిలో పది శాతం క్లెయిమ్‌లు సెటిల్మెంట్‌కు వస్తేనే ఆ కంపెనీలు మూతపడుతున్నాయి. అటువంటిది ఒక్క ఊరిలో లేదా ఒక జిల్లాలో పాలసీలు కడుతున్నవారిలో 90 శాతం మంది కొద్ది కాలానికే కాలం చేసేస్తుంటే.. ఇన్సూరెన్స్ కంపెనీలు వారి క్లెయిములు సెటిల్ చేయలేక దివాలా తీస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి తమ బ్రాంచిలను ఎత్తేస్తున్నాయి. ఉన్న అరకొర కంపెనీలు కూడా అన్నీ సవ్యంగా ఉండి, చచ్చిపోయినవారికి కూడా పాలసీ సెటిల్మెంట్‌కు నిరాకరిస్తున్నాయి. దీనివల్ల నిజమైన బాధితులు రోడ్డున పడుతున్నారు. అందుకే ఈ గగ్గోలు.

హెల్త్ రిపోర్టు ఎట్ రూ.10వేలు

మొదటి కేసులో పేర్కొన్న బెండి మహాలక్ష్మి ఆమదాలవలస జెడ్పీటీసీ బెండి గోవిందరావుకు స్వయాన తల్లి. ఈమె 1940లో పుట్టారని గ్రామ రికార్డులు చెబుతున్నాయి. ఆ రికార్డులు మీకెక్కడివని అడక్కండి. ఆమె అందుకుంటున్న వద్ధాప్య పింఛను ఐడీ నెంబరు 101241577. ఈ లెక్క ప్రకారం ఆమెకు 79 ఏళ్లు. అంటే త్వరలోనే ఆమె మరణించడం ఖాయమని అందరికంటే ముందు ఆమె కుమారుడికే తెలిసిందన్నమాట. అందుకే 2022 జనవరిలో ఆమె పేరిట రూ.1.40 కోట్లకు కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో టెర్మ్ పాలసీలు కట్టారు. అక్కడికి ఆరు నెలల వ్యవధిలోనే ఆమె మరణించింది. నామినీగా ఉన్న గోవిందరావుకు సహజంగానే బీమా సొమ్ము అందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 79 ఏళ్లు ఉన్న మహిళను ఇన్సూరెన్స్ పాలసీలో 55 ఏళ్లుగా చూపించారు. ఈ పని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మన దేశంలో అన్నిటికీ ఆధారే ఆధారం. ఆధార్ మారిస్తే అన్నీ మారిపోయినట్టే. వెంటనే ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన గోవిందరావు అనే మరో వ్యక్తిని మన బెండి గోవిందరావు కలిశారు. ఆధార్‌లో వయసును 55గా మార్పించారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఆమెకు టెర్మ్ పాలసీ మంజూరు చేసింది. ఆధార్ కార్డు చూపించినంత మాత్రన టెర్మ్ పాలసీ ఇష్యూ చేసేస్తే ఇక ఫీల్డ్ స్టాఫ్ ఎందుకనే అనుమానం మీకు వస్తే మీలో ఐక్యూ లెవెల్స్ ఉన్నట్టే. టెర్మ్ పాలసీ కోసం ఫారం నింపిన తర్వాత వైద్యపరీక్షలకు వెళ్లాలి. 79 ఏళ్ల వద్ధ మహిళ ఆధార్ కార్డులో 55 ఏళ్ల వయసుకు మారినంత సులువు కాదిది. మళ్లీ ఇక్కడా మేనేజ్ చేసేశారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ శ్రీకాకుళంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న ఒక మెడికల్ సెంటర్‌కు ఇలాంటి కేసులను రిఫర్ చేస్తున్నాయి. అక్కడో రూ.10వేలు కొడితే ఆరోగ్యంగా ఉన్నట్టు రిపోర్టులు వచ్చేస్తాయి. దాన్ని చూపించి టెర్మ్ పాలసీలు ఇష్యూ చేసేస్తున్నారు. అసలు బెండి మహాలక్ష్మి వైద్యపరీక్షలకే వెళ్లకుండా పాలసీ ఇష్యూ అయింది. ఆరు నెలల తర్వాత చనిపోగానే, ఆమె కొడుకు ఖాతాలో రూ.1.40 కోట్లు పడ్డాయి.

చనిపోతుందని తెలిశాక పాలసీ

ఇదే ఆమదాలవలస జెడ్పీటీసీ బెండి గోవిందరావుకు ఉన్న ఇద్దరు భార్యల్లో ఒకరైన సత్యవతి(47) విశాఖపట్నం మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే పరిస్థితి చేయి దాటిపోయిందని అక్కడి వైద్యులు చెప్పేశారు. అంతే.. వెంటనే బెండి గోవిందరావు ఆమె పేరిట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.1.50 కోట్లకు టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అనుకున్నట్టుగానే ఆరు నెలల్లో ఆమె కాలం చేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు ఆయన ఖాతాలో పడిపోయాయి. ఎందుకంటే.. ఈయనే ఆ పాలసీలను నామినీ. ఈ రెండు కేసుల్లో ఒకరు తల్లి, ఒకరు భార్య. ఆయనే నామినీ.. అయినా కళ్లు మూసుకొని బీమా సొమ్ము ఇచ్చేశాయి ఇన్సూరెన్స్ కంపెనీలు.

చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికించారు

ఓకే అని సరిపెట్టుకున్నా.. ఇదే ఊరిలో మురపాక సూర్యనారాయణ (46) అనే వ్యక్తి 2021 ఏప్రిల్ 24న చనిపోయారు. అయ్యో ముందే తెలిస్తే ఈయన పేరు మీద కూడా టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని సొమ్ము చేసుకునేవారం కదా అనే భావన కలిగినట్లుంది. ఇప్పుడైనా ఆ పని చేయవచ్చు కదా.. అనిపించి వెంటనే ఆయన మరణ ధ్రువీకరణ పత్రం ఇష్యూ కాకుండా ఆపించారు. ఈలోగా మతుడి సోదరుడితో ఒప్పందం కుదుర్చుకుని ఆయనే సూర్యనారాయణగా ఇన్సూరెన్స్ కంపెనీ ముందు నిలబెట్టి పాలసీ తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా ఆగస్టు 18న సూర్యనారాయణ చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.98 లక్షలు నష్టపోయాయి. నామినీగా ఉన్న మురపాక సంగమయ్య ఖాతాలో ఈ డబ్బులు పడ్డాయి. ఆయనకో మూడు లక్షలు పడేసి మిగతా సొమ్మును బెండి గోవిందరావే తీసుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమన్నట్టు చనిపోయిన మురపాక సూర్యనారాయణ పేరిట వచ్చిన సొమ్ముతో వీరు సైలెంట్‌గా ఉన్నారు. సాధారణంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు టెర్మ్ ఇన్సూరెన్స్‌లు నెలకు ఇన్ని చేయాలనే టార్గెట్ ఉంటుంది. ఈ టార్గెట్లను సాధించడానికే మంచం మీద ఉన్నా, పాడె మీద ఉన్నా, చివరకు చనిపోయిన వారికి కూడా పాలసీలు చేయించేస్తున్నారు. క్లెయిమ్ సెటిల్మెంట్లు చేసినప్ప్పుడు అవి ఫేక్ అని తెలిసినా కూడా కోర్టులకు, కన్జూమర్ కోర్టుకు వెళ్తామన్న బెదిరింపులకు భయపడి తమ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటే వ్యాపారం చేయడం కష్టమవుతుందని భావించిన మహా మహా కరోడాలే ఇటువంటి చెల్లింపులు చేసేస్తున్నారు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సడన్‌గా చనిపోయిన సందర్భాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సవాలక్ష ఆంక్షలు పెట్టే ఈ కంపెనీలు.. ఇటువంటి మాయా కేసులను సులువుగా సెటిల్ చేస్తున్నాయంటే ఇందులో అందరికీ భాగం ఉండే ఉంటుంది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ లైఫ్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియంజ్ లైఫ్, యాక్సిస్ మాక్స్ లైఫ్, రియలన్స్ నిప్పన్ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ వంటి సంస్థలన్నీ బెండి గోవిందరావు లాంటి అనేకమంది ముందు మోకరిల్లిపోయాయి. సాధారణంగా టెర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టేటప్ప్పుడు వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందనేది కంపెనీల వారీగా కస్టమర్ చూస్తాడు. అందులో ఎవరు ఎక్కువ మందికి సులువుగా చెల్లింపులు జరుపుతున్నారో చూసుకుని ఆ కంపెనీ వైపు మొగ్గు చూపుతాడు. అందుకే బెండి గోవిందరావు లాంటి కేసులున్నా సెటిల్మెంట్ వైపే వీరంతా ఆలోచిస్తున్నారు. జిల్లాలో ఇటువంటి కేసులు కోకొల్లలు. మెడికల్ ల్యాబ్‌లను మేనేజ్ చేసి చాలామందితో టెర్మ్ ఇన్సూరెన్స్‌లు కట్టించేశారు ఏజెంట్లు. ఈ వ్యవహారంపై గురువారం ‘నకిలీ బీమా’ పేరిట ‘సత్యం’ ప్రచురించిన కథనం ఇన్సూరెన్స్ సెక్టార్‌లో పెద్ద కుదుపునే తీసుకువచ్చింది. అయితే దీనిపై ఆయా సంస్థలు ఏమేరకు చర్యలు తీసుకుంటాయనేది అనుమానమే. ఎందుకంటే.. ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నాయి. తెలిసీ ఇటువంటి ఫ్రాడ్ చేసినందుకు తమ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం మినహా ఈ చర్యలకు కర్త, కర్మ, క్రియలుగా వ్యవహరించినవారిపై భారత శిక్షాస్మతిలో ఉన్న చట్టాలను ప్రయోగిస్తారా లేదా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ఇష్టం. వారు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. బెండి గోవిందరావు ఆమదాలవలసకే పరిమితం కాకుండా జిల్లాలో అనేకచోట్ల క్యాన్సర్ పేషెంట్లకు, చనిపోయిన వ్యక్తులకు టెర్మ్ పాలసీలు కట్టి సొమ్ములు చేసుకున్నారనే ఫిర్యాదులు మాత్రం రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్‌కు చేరాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page