గరికపాటీ.. మీది ప్రవచనమా.. ప్రకోపమా?
- DV RAMANA

- 13 hours ago
- 3 min read

జీవితం అంటే ఏదోలా బతికేయడం కాదు.. గౌరవంగా బతకడం.. ఆరోగ్యంగా బతకడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పౌరులందరికీ జీవించే హక్కు ‘రైట్ టు లైఫ’ను చట్టబద్ధంగా కల్పించింది. అంటే ఆరోగ్యంగా, గౌరవంగా జీవించగలిగే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని దానర్థం. ఇక 2021లో మనదేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విద్యార్థులకు డ్రై రేషన్ (విడి సరుకులు) కాకుండా వండిన భోజనం సరఫరా చేయాలన్నది దాని సారాంశం. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. అప్పట్నుంచే ప్రభుత్వాలు పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అంటే ఇది రాజ్యాంగం, న్యాయవ్యవస్థ కల్పించిన చట్టబద్ధ హక్కు. కానీ దీనిపైనే మన ప్రవచనకారుడనే సనాతన విప్లవకారుడు విషం చిమ్మడం విడ్డూరంగా ఉంది. తెల్లవారితే చాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ధర్మోద్ధారకుడిగా చెలామణీ అవుతున్న గరికపాటి నర్సింహారావు ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రపచనాలేనా!.. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. మరో అంశం అందుకుందాం అనుకున్నారేమో గానీ.. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పెట్టే గుడ్డుపై పడ్డారు. ‘అన్నంలో గుడ్డు పెట్టడం ఏమిటండీ.. గాడిద గుడ్డూ! చదివితే చదవమనండి.. లేకపోతే పొమ్మనండి’ అని పిల్లల పట్ల తిరస్కార ధోరణి ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా.. ‘గుడ్డుతో భోజనం పెట్టి, యూనిఫారం ఇచ్చి, టై బూట్లు ఇచ్చి.. సకం సౌకర్యాలు కల్పించి కూర్చోబెడితే.. ఇక వాళ్లేం చదువుతారు? శోభనం పెళ్లికొడుకుల్లా మంచమెక్కి కూర్చుంటారు’. ఇదీ ఆయనగారీ ఎక్కసెక్కం. అపర జ్ఞానిననంటి, విజ్ఞాన పీఠాలు ఎక్కామని, గండపెండేరాలు తొడిగించుకున్నామని జబ్బలు చరుచుకునే ఈ ప్రపచనకారుడికి పేదరికంలో మగ్గిపోతున్న ఆకలి కేకలు పెడుతున్న బాలప్రపంచం గురించి తెలియదనుకోవడానికి లేదు. తెలిసి కూడా ఇన్నిన్ని వెటకారాలు, తిరస్కార బాణాలు వేస్తున్నారంటే ఆయన్ను ఏ రకమైన జ్ఞానవంతుడిగా గుర్తించాలో అర్థం కావడంలేదు. 2021 లెక్కల ప్రకారం మన దేశంలో ఏడు లక్షల శిశుమరణాలు సంభవించాయి. దీనికి కారణం ఆకలి. అయితే ఆకలి చావులు అనడం మన దేశంలో నామోషీ కనుక బహిరంగంగా చెప్పరు. ఈ శిశు మరణాల్లో 70 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణం. దేశ జనాభాలో 12 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గరికపాటి వారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.. ఆ పథకమే వృధా అన్నట్లు మాట్లాడారు.. బడిపిల్లల్లో డ్రాప్ అవుట్లు తగ్గించడానికి, వారికి పౌష్టికాహారం అందించడానికి ఈ పథకానికి కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. పిల్లల్లో పోషక విలువలు పెంచేందుకు వీలుగా గుడ్లు ఇస్తున్నారు. వాటిని తినేవాళ్ళు తింటున్నారు.. తినలేనివారు మానేస్తున్నారు. కానీ దాన్ని గాడిదగుడ్డంటూ వెక్కిరించి మీ గరికపాటి తన స్థాయినే తగ్గించుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని దండగమారి పథకం కాదు.. ఆ మాటకొస్తే ప్రభుత్వ పథకాల్లో బోల్డన్ని దండగమారి, చెత్త పథకాలున్నాయి.. ఫ్రీ ఫ్రీ అంటూ ఓట్ల కోసం పాలకులు దండగమారి పథకాలను రుద్దుతున్నాయి. వాటి డొల్లతనం గురించి ప్రభుత్వానికి సలహాలిచ్చి.. చేతనైతే వాటిని, ఇతర ఉచితాలను రద్దు చేయిస్తే బాగుంటుంది. వాటిని పట్టించుకోకుండా పేద విద్యార్ధుల నోటికాడి కూడును వ్యతిరేకిస్తారేకించడం న్యాయం కాదు. గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి వివరణ ఇవ్వాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చాలి అన్నారు. దానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పిల్లలకు యూనిఫారాలు వద్దు, పుస్తకాలు వద్దు, కోడిగుడ్లు వద్దు అంటూ అసహనం. ఇది కూడా ప్రభుత్వ ఐడియానే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం డైరెక్ట్‌గా ప్రతిపాదించకుండా ప్రజల రియాక్షన్ తెలుసుకునేందుకు అని ఆయన ద్వారా జనాల్లోకి వదిలారని అంటున్నారు. ప్రస్తుతం రియాక్షన్ పెడిసి కొట్టింది కాబట్టి ఈ గాడిద గుడ్డు పథకం ఇప్పట్లో అమల్లోకి రాకపోవచ్చు. ఆకలి అనేది కఠోర వాస్తవం. ప్రాణి పుట్టిన వెంటనే చేసే మొదటి ఆక్రందన ఆకలి రోదనే. కడుపు నిండితేనే కదా ప్రాణం నిలిచేది? ప్రాణం నిలిస్తేనే కదా చదువు, సంస్కారం, ఆధ్యాత్మికత అబ్బేది? కానీ దురదృష్టవశాత్తు మన మధ్య ఉన్న కొందరు సో కాల్డ్ జ్ఞానులు ఆకలిని కూడా ఆచారాల త్రాసులో తూకం వేయాలని చూస్తున్నారు. కంచం నిండా తిండి లేని వాడికి పౌష్టికాహారం కంటే పట్టింపులు ముఖ్యం అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానం నింపడం తప్ప ఎదుటివాడి కంచంలో ఏం ఉండాలో శాసించడం కాదు. కడుపు నిండని పరిస్థితే లేని పిల్లలకు రోజూ కోడిగుడ్డు లభించడం వరం. అవి కేవలం ప్రోటీన్లు, ఇతర పోషకాలతో కూడిన అండాలు మాత్రమే. నిల్వ చేసే ఉష్ణోగ్రతల వల్ల కూడా వీటిలో ఎలాంటి జీవక్రియలు జరగవు, అందుకే పిండం లేని ఈ గుడ్లను శాస్త్రీయంగా శాకాహారంగానే పరిగణిస్తారు. దీన్నే మాంసాహారం, హింసగా భావిస్తే.. మరి పాలు తాగడం కూడా హింస కాదా? గరికపాటివారు ఆలోచించాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో వలసలు వెళ్లే పేద కుటుంబాలు వందలు వేలల్లో ఉన్నాయి. వారి పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. అటువంటి వారిని స్కూలు వైపు మళ్లించేదే ఈ మధ్యాహ్న భోజనం. అందులో రుచి, పౌష్టికాహారం ఉంటేనే పిల్లలు వస్తారు. ఈ సామాజిక వాస్తవం మీ మేథస్సుకు అందడం లేదా? మనువాద సిద్ధాంతాలు గరికపాటి బుర్రను కలుషితం చేశాయేమో అనిపిస్తోంది. ఆయన దృష్టిలో ఆహారం అంటే కేవలం మడి-ఆచారం అన్నట్లుంది. కానీ పేదవాడికి ఆహారం అంటే మనుగడ. పిల్లలకు నైతిక విలువలు చెప్పే మీరు.. వారి ఆహారం మీద దాడి చేయడం ఏ రకమైన ధర్మం. నిజమైన ఆధ్యాత్మికత అంటే అందరినీ ప్రేమించడం. అందరి శ్రేయస్సు కోరడం.






Comments