గవర్నర్లది ‘వివక్షా’ధికారం!
- DV RAMANA

- 2 days ago
- 3 min read

బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలనకు చిహ్నాలుగా ఉన్న రాజ్‌భవన్ల పేరును లోక్‌భవన్లుగా మారుస్తూ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ నివాస భవనాన్నే రాజ్‌భవన్‌గా వ్యవహరించేవారు. అందుకు తగినట్లే గవర్నర్లు రాష్ట్రానికి తామే రాజులమన్నట్లు విర్రవీగిపోయేవారు. రాచరిక వ్యవస్థలు, బ్రిటిష్‌పాలనలు పోయి మన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన విషయాన్ని దాదాపు 75 ఏళ్ల తర్వాత గుర్తించిన కేంద్రం రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్ అంటే ప్రజాభవన్‌గా మార్చింది. కానీ పేరు మారిన పాత రాజకీయ వాసనలతో లోక్‌భవన్లు ఇంకా దుర్గంధం వెదజల్లుతూనే ఉన్నాయి. దీనికి తాజా నిదర్శనమే ఇటీవల ఎన్నికలు జరిగిన తమిళనాడు లో నెలకొన్న ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం. ఈ నెల నాలుగో తేదీన వెలువడిన ఫలితాల్లో అధికార డీఎంకే ఓడిపోగా.. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలను ఏ పార్టీ కూడా దక్కించుకోలేకపోయాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో సినీనటుడు VIJAY నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు కాస్త దూరంలో ఆగిపోయింది. రాజ్యాంగ నియమాల ప్రకారం ఏ పార్టీకీ మెజారిటీ లభించని పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు కలిగిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. తదుపరి 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకునేలా గడువు నిర్దేశించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు సైతం ఇదే రూలింగ్ ఇచ్చింది. కానీ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాత్రం మద్దతు ఇస్తున్న మెజారిటీ సభ్యుల, పార్టీల వివరాలు ఇస్తే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చేదిలేదంటున్నారు. ఆ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని రెండుసార్లు స్వయంగా తనను కలిసి కోరిన టీవీకే అధినేత VIJAY విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. అధినేత విజjáYT రెండుచోట్ల గెలిచినందున బలనిరూపణ సమయంలో దాన్ని ఒకటిగానే పరిగణిస్తారు. అందువల్ల టీవీకే బలం 107 అవుతుంది. కాగా ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, తాజాగా చెరో రెండు స్థానాలు ఉన్న వామపక్షాలు, వీసీకే పార్టీ టీవీకే VIJAYకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. దాంతో టీవీకే సంఖ్యాబలం 116 అవుతుంది. మెజారిటీకి మరో రెండు సీట్లే అవసరం. దాన్ని సమకూర్చుకోవడం పెద్ద సమస్య కాబోదు. పైగా రెండో అతిపెద్ద పార్టీ అయిన డీఎంకే ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి తాము అడ్డురాబోమని స్పష్టంగా ప్రకటించింది. అయినా సరే గవర్నర్ తన మంకుపట్టు వీడకుండా మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల స్పష్టమైన వివరాలతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. ముందే పూర్తి మెజార్టీ చూపించాలన్న గవర్నర్ వింత వైఖరిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలతోపాటు రాజ్యాంగ, న్యాయ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గవర్నర్ల పనితీరుపై మరోమారు విమర్శలు రేగుతున్నాయి. ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి, గవర్నర్ వ్యవస్థ తీరు గురించి మళ్లీ చర్చ మొదలైంది. గవర్నర్లు రాజ్యాంగం తమకు కల్పించిన విచక్షణాధికారాలను రాజకీయాల కోసం వివక్షాధికారాలుగా దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు కొత్త కాకపోయినా.. మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వ బలనిరూపణకు అసెంబ్లీ లేదా లోక్‌సభలే రాజ్యాంగపరమైన వేదికలని SRబొమ్మై వెర్సస్ యÖనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్వయంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 75(1) ప్రకారం రాష్ట్రపతికి, ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్‌కు ప్రభుత్వాల ఏర్పాటుకు పార్టీలకు అవకాశం కల్పించే విచక్షణాధికారం ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని వినియోగించే విషయంలో కొన్ని అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ మెజారిటీ సాధించిన పార్టీని లేదా ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమి నేతను ప్రభుత్వ ఏర్పాటుకు మొదటి అవకాశం ఇవ్వాలి. అలాకాకుండా ఏ పార్టీకి లేదా కూటమికి మెజారిటీ రాకపోతే రెండో ఆప్షన్‌గా ఎక్కువ స్థానాలు పొంది అసెంబ్లీ లేదా లోక్‌సభలో అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. చట్టసభ వేదికపై ప్రభుత్వ బలం నిరూపించుకునేందుకు కొంత గడువు ఇవ్వాలి. అది ఎన్ని రోజులన్నది రాజ్యాంగ అధినేత నిర్ణయమే. ఆ ప్రకారమే 1996 సాధారణ ఎన్నికల్లో, 1998, 1999 మధ్యంతర ఎన్నికల్లో లోక్‌సభలో ఏ పార్టీకీ, కూటమికి మెజారిటీ లభించని పరిస్థితుల్లో రాష్ట్రపతులు ఈ రాజ్యాంగ ధర్మాన్నే అనుసరించి స్ఫూర్తిగా నిలిచారు. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, 1998, 1999 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ అదే బీజేపీకి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అవకాశం ఇవ్వడంతో ఆ మÖడు సందర్భాల్లోనూ ఏబీవాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ రాష్ట్రాల్లో పరిస్థితి వేరేగా ఉంది. 2017లో 40 సీట్లున్న గోవాలో నాటి గవర్నర్ అత్యధికంగా 17 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ను కాదని 13 సీట్లే గెలిచిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అలాగే 2018లో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల కూటమిని కాదని మెజారిటీకి అవసరమైన 113 సీట్లకే తక్కువగా 104 సీట్లే గెలిచిన బీజేపీకే అప్పటి గవర్నర్ అవకాశం కల్పించి ప్రభుత్వం ఏర్పాటు చేయించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కేంద్రంలో బీజేపీ సర్కారు దన్నుతో.. ఢిల్లీ పెద్దల మంత్రాంగం ప్రకారం నాటి గవర్నర్లు నడుచుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు. మళ్లీ ఇప్పుడు తమిళనాడులో అటువంటి రాజ్యాంగ భ్రష్టత్వమే జరుగుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా కేంద్రంలోని బీజేపీనే వేలెత్తి చూపిస్తుంది.






Comments