top of page

మమత పదవిలో ఉన్నా.. ఊడినట్లే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు వెలువడ్డాయి.. ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అన్నది తేలిపోయింది. ఆ ప్రకారం అధికార మార్పిడి జరగడమన్నది తదుపరి రాజ్యాంగ ప్రక్రియ. కానీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఘట్టం విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీకి పది సీట్ల దూరంలోనే టీవీకే పార్టీ నిలిచిపోవడాన్ని సాకుగా చూపించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతుదారుల వివరాలతో రావాలని గవర్నర్ ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే అధినేత VIJAYను వెనక్కి పంపడం ఆ రాష్ట్రాల్లో రాజకీయ వివాదం రేపుతుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఆ సమస్య లేకపోయినా రాజ్యాంగపరమైన వివాదం రాజుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మమతాబెనర్జీ నేతృత్వంలోని ఆ పార్టీ 80 సీట్లతో చతికిలపడగా, ప్రతిపక్ష బీజేపీ ఏకంగా 207 సీట్ల గెలుచుకుని దాదాపు మÖడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. కానీ ప్రభుత్వమార్పిడికి వీలు కల్పిస్తూ రాజీనామా చేయాల్సిన సిటింగ్ సీఎం మమతాబెనర్జీ అందుకు ససేమిరా అని మొరాయిస్తున్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎన్నికల్లో ప్రభుత్వపక్షం ఓడిపోతే ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలి. కానీ మమత ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దానికి ఆమె చెబుతున్న కారణాలు ఏవైనా.. ఆ సాకుతో రాజ్యాంగ ప్రక్రియకు ఆటంకం కలిగించడం మాత్రం సమంజసం కాదు. అదొక చెడు సంప్రదాయానికి దారితీసే ప్రమాదముంది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగలేదని, ఈ ఎన్నికల్లో విజయాన్ని బీజేపీవారు దొంగిలించారని ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఏకంగా వంద నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్, కేంద్ర సాయుధ బలగాల సహకారంతో బీజేపీ విజయం సాధించిందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. తమ పార్టీయే నైతిక విజయం సాధించిందని, అందువల్ల తాను పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేస్తూనే.. ఎన్నికలు జరిగిన తీరుపై సుప్రీంకోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని మమత తమ పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? అసలు ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?? అన్న సందేహాలు.. వాటి చుట్టూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి గవర్నర్ రాజ్యాంగ అధిపతి. అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా ఆయన ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల బలం కలిగిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. అధికారంలో కొనసాగగలుగుతుంది. కానీ సీఎం మమత పార్టీ ఈ ఎన్నికల్లో గెలవకపోగా.. రాజీనామా చేసేది లేదని.. చిన్నపిల్లల తరహాలో మారాం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రాధినేత అయిన గవర్నర్ క్రియాశీలమై తన అధికారాలను ప్రయోగించే ఛాన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైన సభ్యుల వివరాలతో ఎన్నికల కమిషన్ సమర్పించే జాబితా ఆధారంగా గెజిట్ నోటిఫై చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుడతారు. అలా వీలుకాని పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1)ను ప్రయోగింవవచ్చు. ముఖ్యమంత్రి, ఆమె మంత్రివర్గం గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు పదవుల్లో కొనసాగుతారని ఈ ఆర్టికల్ స్పష్టంగా చెబుతోంది. అంటే ప్రజాతీర్పు కోల్పోయిన మమత ప్రభుత్వాన్ని ఆమె రాజీనామా చేయకపోయినా రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉందన్నమాట. అలాకాకుండా పాత ప్రభుత్వం రాజీనామా చేయని పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. దాని వల్ల రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఈ రెండూ కాకుండా ఎటువంటి చర్యలు లేకుండానే ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభుత్వం దానంతట అదే రద్దయిపోతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రభుత్వ పదవీకాలం ఐదేళ్లకు ముగిసిపోతుంది. ఆలోగానే ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే ఆ ప్రభుత్వం రాజీనామా చేసినా చేయకపోయినా ఐదేళ్ల పదవీకాలం ముగిసిన మరుక్షణం ఆ ప్రభుత్వం దిగిపోయినట్లే పరిగణిస్తారు. ఈ ప్రకారం చూస్తే బెంగాల్లో ప్రస్తుత అసెంబ్లీ, ప్రభుత్వ ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 20తో ముగిస్తుంది. అంతే మమత రాజీనామా చేయకపోయినా ఆ రోజుతో ఆమె మాజీ అయిపోతారు. అలాగే ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించిన క్షణం నుంచే పాత ప్రభుత్వం మనుగడ కోల్పోతుంది. అంటే ఏ రకంగా చూసినా మమత మొండిపట్టు ఆమె రాజకీయానికే మచ్చగా, అవమానంగా పరిణమిస్తుంది. గతంలో దేశంలో ఇలాంటి మÖడు ఘటనలు జరిగాయి. కానీ వాటికీ, నేటి పరిణామాలకు చాలా తేడా ఉంది. 1985లో యÖపీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన ఎన్డీతివారీ, 1973లో గోవాలో మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ ముఖ్యమంత్రి శశికళ కాకోద్కర్, 2001లో తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఓ.పన్నీరుసెల్వం తమ పదవులు వీడటానికి నిరాకరించారు. పదవులు చేపట్టేనాటికి వారు ప్రజాప్రతినిధులు కారు. కానీ వారి పార్టీలు అసెంబ్లీలో మెజారిటీలో ఉన్నాయి. అందువల్ల వారు పదవులు త్యజించాల్సిన అవసరం లేకపోయింది. కానీ బెంగాల్లో తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా, సీఎంగా ఉన్న మమత కూడా పరాజయం పాలయ్యారు. అందువల్ల ఆమె రాజ్యాంగపరంగా పదవీచ్యుతురాలే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page