top of page

చికిత్సలో మోసాల ‘తిమ్మిరి’!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 days ago
  • 2 min read
  • డాక్టర్ కేర్.. లెస్

  • హోమియో కేంద్రంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

  • రోగికి తెలియకుండానే అతని పేరిట ప్రైవేట్ లోన్

  • ఒకదాని బదులు మరోటి నమోదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గాయం ఒకచోట అయితే మందు ఇంకోచోట వేశాడన్నది సామెత. కానీ దానికి మించి నగరంలోని ఓ వైద్యసంస్థ తమను నమ్మి వచ్చిన రోగి నెత్తిన చెయ్యిపెట్టింది. తిమ్మిర్లు రుగ్మతకు చికిత్స కోసం వచ్చిన రోగిని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్(జత్తు మొలిపించడం) పేరుతో మోసం చేయడమే కాకుండా రోగికి తెలియకుండానే అతడి పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసేసుకుని తమ ఖాతాలో జమ చేసేసుకున్న ఘరానా మోసంపై నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు అందింది. ఈ నెల 11న జరిగిన జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో డాక్టర్ కేర్ హోమియో కేంద్రంపై ఈ మేరకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. రాతపూర్వకంగా అందిన ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని టూటౌన్ పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ కేర్ ఆస్పత్రి మేనేజర్‌ను మంగళవారం స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బలవంతంగా తీసుకున్న నగదును నెల రోజుల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఆ మేరకు బాధితుడు వెంకటరావుతో పోలీసుల సమక్షంలో ఒక రిక్వెస్ట్ లెటర్ రాయించారు. దాన్ని ప్రధాన కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్నారు.

ఏడాది చికిత్స పేరుతో..

ఎస్పీ గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదు ప్రకారం.. బలగకు చెందిన చౌదరి వెంకటరావు తిమ్మిర్లు రుగ్మతతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఏప్రిల్ ఒకటో తేదీన పాలకొండ రోడ్డులోని పెద్ద రెళ్లి వీధి వద్ద ఉన్న డాక్డర్ కేర్ హోమియో పతి కేంద్రాన్ని ఆశ్రయించాడు. అతని లక్షణాలు తెలుసుకున్న వైద్యుడు ఏడాదిపాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని , దీనికి అవసరమైన మందులను జర్మనీ నుంచి తెప్పించాల్సి ఉంటుందని చెప్పారు. దానికోసం రోగి అధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు తీసుకున్నారు. చికిత్స, మందులకు ఒకేసారి కాకుండా నెలనెలా వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తే సరిపోతుందని భరోసా ఇచ్చి మొదటి విడతగా రూ.5,200 చెల్లిస్తే మందులకు ఆర్డర్ పెడతామని చెప్పి సొమ్ము వసూలు చేశారు. అయితే ఆ సొమ్మునే డౌన్ పేమెంట్‌గా చూపించి బజాజ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రోగి పేరుతో ట్రీట్‌మెంట్ ఐడీ నెం. SRIKAN 96 మీద రూ.26 వేలు లోన్ మంజూరు చేయించి ఆ సొమ్మును నేరుగా డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థ అకౌంట్‌లో జమ చేయించేసుకున్నారు. పది నెలల్లో వాయిదాల రూపంలో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా షరతు పెట్టారు. ఇవేవీ వెంకటరావు ఈ నెల రెండో తేదీన నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ సొమ్ము చెల్లించాలంటూ బజాజ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో అవాక్కయ్యాడు. ఎటువంటి రుణం తీసుకోని తానెందుకు వాయిదా సొమ్ము చెల్లించాలని ఎదురు ప్రశ్నించాడు. కాదు కాదు.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం డాక్టర్ కేర్ హోమియోపతి కేంద్రం ద్వారా రూ.26 వేల రుణం తీసుకున్నారని బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులు ఫోన్‌లోనే ఆధారాలతో చెప్పడంతో హతాశుడైన వెంకటరావు డాక్టర్ కేర్ సెంటర్‌కు వెళ్లి తనకు తెలియకుండా, సమ్మతి లేకుండా లోన్ ఎలా తీసుకుంటారని నిర్వాహకులను నిలదీశాడు. అయితే ఏడాది ట్రీట్‌మెంట్ అనేది ఈ స్కీంలో భాగమేనని ఆస్పత్రి మేనేజర్ చల్లగా చెప్పాడు. అలాగే తిమ్మిర్లు ట్రీట్‌మెంట్ కోసం వస్తే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని ఎలా చెబుతారని మళ్లీ ప్రశ్నించగా ఇది కేవలం లోన్ కోడ్ మాత్రమేనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్కీం పూర్తయే వరకు మందులు వాడాల్సిందేనని, రుణ వాయిదాలు కట్టాల్సిందేనని వారు స్పష్టం చేశారు. అప్పటికి తనను తాను సర్ది చెప్పుకున్న బాధితుడు నెల రోజులు మందులు వాడాడు. అయినా సమస్య ఏమాత్రం తగ్గకపోగా మరింత తీవ్రం కావడంతో తన నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని వెంకటరావు డిమాండ్ చేయగా కేంద్రం సిబ్బంది ఎదురుతిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తే.. ఎవరికైనా చెప్పుకో అంటూ దురుసుగా వ్యవహరించారని తెలిసింది. దీంతో గత్యంతరం లేక వెంకటరావు నేరుగా ఎస్పీ గ్రీవెన్స్‌లోనే ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగి డాక్టర్ కేర్ మేనేజర్, డాక్టర్‌ను పిలిపించి హెచ్చరించడంతో నెలరోజుల్లో తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చే ఏర్పాటు చేస్తానని.. దానికి బాధితుడు ఒక లెటర్ ఇవ్వాలని కోరారు. ఆ మేరకు మందులు, ట్రీట్ మెంట్ నిలిపేస్తుండడంతో తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి జమ చెల్లించాలని కోరుతున్నట్లు పోలీసులు ఒక లెటర్ రాయించారు. ఈ లేఖను మెయిల్ ద్వారా సంస్థ మేనేజ్‌మెంట్‌కు పంపించి నగదు వాపసు చేయిస్తామంటూ బాధితుడి బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా తీసుకున్నారు. అనంతరం పోలీసులు డాక్టర్ కేర్ మేనేజర్, డాక్టర్‌ను మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page