top of page

చీకటి బతుకుల్లో నిండు ‘పూర్ణిమ’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 6 hours ago
  • 3 min read
  • అరుదైన ఐఐహెచ్ వ్యాధితో హఠాత్తుగా దృష్టిలోపం

  • ఏడాదిలో ఐదు సర్జరీలు, బ్రెయిన్‌లో స్టెంట్

  • ఆగిపోయిన బీఆర్క్ పూర్తికి ప్రభుత్వ సంస్థలతో పోరాటం

  • తనలాంటివారికి మార్గదర్శిగా ఆన్‌లైన్ గ్రూప్

  • వైకల్యాన్ని జయించిన కావ్యపూర్ణిమ శ్రీకాకుళం ఆడపడుచే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఆమె పుట్టుకతో కబోది కారు. యుక్త వయసులో విద్యాభ్యాసం చేస్తుండగా లోకాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన తరుణంలో ఒకరోజు ఆమె ముందున్న అందమైన లోకం ఉన్నఫళంగా అదృశ్యమైపోయింది. దాని స్థానంలో చీకట్లు అలుముకున్నాయి. తర్వాత అర్థమైంది.. ఆమె చూపు కోల్పోయారని! పేరుకు తగ్గట్లే ఆమె జీవితం నిండు ఫౌర్ణమి రోజు కాసే పండు వెన్నెల్లా వర్థిల్లుతందన్న ఆశలు ఆడియాసలయ్యాయని కుటుంబ సభ్యులు కుమిలిపోయారు. కానీ ఆమె ఏమాత్రం కుమిలిపోలేదు.. కుంగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని.. చిమ్మచీకట్లోనే వెలుగుల ప్రస్థానం ప్రారంభించారు. తనలాంటి వారందరిలో స్ఫూర్తి నింపుతూ.. వారికి అండగా నిలుస్తూ దారి దీపంగా నిలుస్తూ తన వైకల్యాన్నే ఓడించి ఎన్నో సంస్థలను నడుపుతున్న ఆమే బలిజేపల్లి కావ్యపూర్ణిమ. విజయాల బాటలో పయనిస్తూ.. ఎంతో గుర్తింపు పొందుతున్న కావ్యపూర్ణిమ ప్రతిష్టాత్మకమైన ఓఆర్‌డీఐ రేర్ స్టార్ అవార్డు`2026ను ఇటీవలే అందుకున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్న ఆమె మన శ్రీకాకుళం ఆడపడుచే కావడం గర్వకారణం. ఓఆర్‌డీఐ అంటే ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా. అంటే అరుదైన వ్యాధులతో బాధపడుతూ కూడా తమలా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి అభ్యున్నతికి కృషి చేసేవారికి, అరుదైన వ్యాధులతో ధైర్యంగా జీవిస్తున్నవారికి, ఆ రంగంలో సేవలు అందిస్తున్న కౌన్సెలర్లు, వైద్యులు, పరిశోధకులు, సేవాసంస్థలను గుర్తించి ప్రతి ఏటా ఓఆర్‌డీఐ సంస్థ అందజేస్తుంది. జాతీయ DNA దినోత్సవం జరుపుకొనే ఏప్రిల్ 25వ తేదీన ఏటా ఈ అవార్డులు అందజేస్తుంటారు. 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ సంస్థ పదో వార్షికోత్సవం నుంచి.. అంటే 2024లో ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. రోల్ మోడల్(వయసులవారీగా మÖడు గ్రూపులు) రేర్ స్టార్ (జెనటిక్ కౌన్సెలర్), రేర్ స్టార్ (రీసెర్చ్ అండ్ సైంటిస్ట్), రేర్ స్టార్ (ధైర్యసాహసాలు), రేర్ స్టార్ (అడ్వకసీ లీడర్ లేదా గ్రూప్), రేర్ స్టార్ (వలంటీర్), రేర్ స్టార్ (లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్), రేర్ స్టార్ (డాక్టర్).. తదితర ఎనిమిది కేటగిరీల్లో ఈ అవార్డులు ఇస్తుంటారు. 2026 సంవత్సరానికి గాను రోల్‌మోడల్(16`30 ఏళ్లు) కేటగిరీకి ఎంపికైన కావ్యపూర్ణిమ ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.

విధికి కన్ను కుట్టింది

శారీరక వైకల్యాన్ని అవరోధంగా భావించకుండా తాను ధైర్యంగా నిలబడటమే కాకుండా తనలాంటి వారెందరికో సేవ అనే మనోనేత్రంతో ముందుకు నడిపిస్తున్న కావ్యపూర్ణిమ శ్రీకాకుళం నగరానికి చెందినవారే. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సేవకుడైన దివంగత బీఎస్ శాస్త్రికి ఈమె స్వయానా మనవరాలు. శాస్త్రి పెద్ద కుమారుడి కుమార్తె. పుట్టుకతో ఈమెకు దృష్టిలోపం లేదు. ఈ లోకంలోకి వచ్చినప్పటినుంచీ తన కళ్లతో అందమైన లోకాన్ని, తనవారిని చూసుకుని మురిసిపోయేవారు. ప్రకృతిని ఆస్వాదించేవారు. అయితే ఆమె నేత్రానందాన్ని చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. బీఆర్క్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో 21 ఏళ్ల వయసులో 2017 ఆగస్టులో ఆమె చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. హఠాత్తుగా రెండు కళ్లు దృష్టి కోల్పోయాయి. ఏమైందో అర్థంకాని పరిస్థితి. తాను పూర్తిగా చూపు కోల్పోయానని నిర్థారించుకోవడానికి ఒక సుదీర్ఘ పోరాటమే చేయాల్సి వచ్చింది. వైద్యులు రకరకాల పరీక్షలు చేశారు. చివరికి బ్రెయిన్‌లో న్యూరాలజికల్ సమస్య కారణంగా బ్రెయిన్ నుంచి కంటి కి వెళ్లే నరాల్లో నీరు ఎక్కువగా చేరిపోవడం వల్ల దృష్టిలోపం ఏర్పడిందని చెప్పారు. దీన్నే వైద్య పరిభాషలో ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్(ఐఐహెచ్) అంటారు. సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్, క్లాట్స్ ఉన్న వారిలో ఇటువంటి సంభవిస్తుంటాయి. కానీ పూర్ణిమలో అలాంటివేవీ లేకుండానే చూపు దెబ్బతిన్నది. ఒకవేళ చూపు కాకపోతే ఈ లోపం వినికిడి శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని వెద్యులు చెబుతున్నారు. తనకు చూపు తిరిగి రాదని నిర్థారించుకోవడానికి ఆమెకు కొన్ని నెలల సమయం పట్టింది. ఆ మధ్యకాలంలో రకరకాల టెస్టులు నిర్వహించి.. 2017`18 మధ్య ఏడాది వ్యవధిలో రెండు బ్రెయిన్ సర్జరీలు, మÖడు స్పైన్(వెన్ను) సర్జరీలు చేశారు. బ్రెయిన్‌లో నీరు పెరగకుండా స్టెంట్ కూడా వేశారు. ఇన్ని చేసినా కూడా పోయిన చూపును తిరిగి తీసుకురాలేకపోయారు. దాంతో పూర్ణిమకు అర్థమైంది. తన చుట్టూ అలుముకున్న చీకట్లను పారదోలేందుకు తన పేరును సార్థకం చేసుకుంటూ నిరంతరం పండువెన్నల విరజిమ్మడం ప్రారంభించింది.

అనితర సాధ్యం ఆమె పోరాటం

నవయవ్వనంలో చూపు కోల్పోతే సాధారణంగా ఎవరైనా సర్వం కోల్పోయినట్లు కుంగిపోతారు. ఇతరులపై ఆధారపడుతూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ కావ్యపూర్ణిమ తనకు సంక్రమించిన వైకల్యాన్ని చూసుకుని ఏమాత్రం కుంగిపోలేదు. పైగా దాన్ని చూసుకుని స్ఫూర్తి పొందారు.. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నారు. తనంతట తాను వైకల్యాన్ని అధిగమించి జీవితంలో నిలబడటమే కాకుండా తనలాంటి అభాగ్యులకు అండగా నిలవాలని సంకల్పించారు. అందులో మొదటిగా మధ్యలో నిలిచిపోయిన బీఆర్క్ కోర్సును పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే కుటుంబ సభ్యుల నుంచే మొదటి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో చదువు కాకుండా ఇతర వ్యాపకాలపై దృష్టిపెట్టమన్న సూచనలు వచ్చాయి. కానీ వారిని ఒప్పించి 2019లో మళ్లీ బీఆర్క్‌లో చేరారు. కానీ దృష్టిలోపం ఉన్నవారికి ప్రవేశం కల్పించడానికి నిబంధనలు అంగీకరించవని ముంబై వర్సిటీ అధికారులు తిరస్కరించారు. దాంతో ప్రవేశం కోసమే పూర్ణిమ పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. వికలాంగుల సంక్షేమానికి 2016లో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఒక చట్టంలో ఉన్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్.. అంటే ఇతర సహకారంతో చదువు కొనసాగించే అవకాశాన్ని వికలాంగులకు కల్పిస్తున్న ఒక క్లాజ్ ఆధారంగా అధికారులతో పోరాడి ఎట్టకేలకు ప్రవేశం సంపాదించారు. ప్రవేశం పొందిన ఇతర విద్యార్థుల్లా పాఠ్య పుస్తకాలు చదివే, రాసే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఆమె ఆన్‌లైన్‌ను ఆశ్రయించారు. యÖట్యాబ్ తదితర మాధ్యమాల్లో ఉన్న సాంకేతిక సౌలభ్యాలను తెలుసుకున్నారు. వాయిస్ నోట్స్, వాయిస్ టు టెక్స్ట్, టెక్ట్స్ టు ఆడియా కన్వర్షన్ సౌలభ్యాలను ఉపయోగించుకుని చదువు సాగించారు. వీటికి అదనంగా అర్కిటెక్చర్‌లో ప్లాన్లు, డ్రాయింగులు, స్కెచ్‌ల ద్వారా జూరీకి పరీక్షలు ఇచ్చే విధానం ఆమెకు కలిసివచ్చింది. ఆ విధంగా బీఆర్క్‌ను 2021 మే నెలలో పూర్తి చేశారు.

అందరినీ కలుపుకెళ్లే కార్యక్రమాలు
  • తన వైకల్యాన్ని అధిగమించి విజయాలు సాధించడంతో కావ్యపూర్ణిమ సంతృప్తి చెందలేదు. తనలాంటి వారందరికీ అండగా నిలవాలని, అందరికీ కలుపుకొని తనదంటూ ఒక కొత్త ప్రపంచం సృష్టించాలన్న సంకల్పంతో పనిచేయడం ప్రారంభించారు. తనకు వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఐఐహెచ్ వారియర్స్ ఇండియా పేరుతో ఒక ఆన్‌లైన్ సపోర్టు గ్రూపును ఏర్పాటు చేశారు. తనలాంటి లక్షణాలతో బాధపడుతూ సరైన్ గైడెన్స్ లేని వారికి సలహాలు ఇవ్వడం, డాక్టర్లను సూచించడం, కౌన్సెలింగ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 120 మంది సభ్యులు ఉన్నారు.

  • అదే కాకుండా ‘పూర్ణమిదం’ అనే పేరుతో ఒక ఆన్‌లైన్ ఇనీషియేటివ్ సంస్థను స్థాపించారు. అందరినీ కలుపుకొని వెళ్లడం అనే లక్ష్యంతో దీన్ని నడుపుతున్నారు. వైకల్యం, ఆర్కిటెక్చర్, పర్యావరణం రంగాల్లో ఈ సంస్థ విశాఖ కేంద్రంగా సేవలు అందిస్తున్నది. ఇదే సంస్థ కింద ఈ రంగాలకు సంబంధించి పరిశోధనలు చేయడం, అవసరమైన వారికి సలహాలు ఇవ్వడం నిరంతరం కొనసాగుతున్నాయి.

  • వీటికి అదనంగా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని డిజెబిలిటీ కమిటీలో సభ్యురాలిగా కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో తను చదువుకున్న ఆర్కిటెక్చర్ రంగాన్ని విస్మరించకుండా నిర్మాణ శాస్త్ర రంగంలోనూ కొనసాగుతున్నారు.

  • కావ్యపూర్ణిమకు చిన్నతనం నుంచి చిత్రకళ(ఆర్ట్), న్యాటకళలోనూ ఆసక్తి, అనురక్తి ఉన్నాయి. భరత నాట్యంలో ప్రవేశం కలిగిన ఆమె చూపు కోల్పోవడానికి ముందు ఎన్నో ప్రదర్శలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ‘తాను చూపు కోల్పోవడం తప్ప ఇంకేమీ కోల్పోలేదని, జీవితంలో చోటు చేసుకున్న ఈ కొత్త దశ తనలో ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని, అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని అందించిందని చెప్పే కావ్యపూర్ణిమ 2024లో ఎన్‌సీపీఈడీపీ ఎంఫసిస్ యÖనివర్సల్ డిజైన్ అవార్డ్- 2024తోపాటు క్రెడాయ్, యంగ్ ఇండియన్స్, వైజాగ్ సిటీ పోలీస్, ఏపీ వికలాంగుల సంక్షేమ శాఖల గుర్తింపు పొందారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page