భారత్‌కు పవర్.. ‘అండ’మాన్!
- DV RAMANA

- 15 hours ago
- 3 min read
ఇప్పటికే ఆ ద్వీపం రక్షణపరంగా కీలకశక్తి
తాజాగా అక్కడి సముద్రంపై టైడల్ విద్యుత్ తయారీ
అతి భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు
అది పూర్తి అయితే దేశమంతటికీ నిరంతర వెలుగులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ప్రకృతి అందాలకు ఆటపట్టు అయిన అండమాన్ పేరు వినగానే గతంలో ప్రత్యక్ష నరకం గుర్తొచ్చేది. నాటి బ్రిటిష్ పాలకులు ఈ దీవులను నరకాన్ని తలపించే సెల్యులార్ జైళ్లుగా ఉపయోగించేవారు. ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వేచ్ఛ కోరుతూ జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని వారికి కంటిలో నలుసులా మారిని వందలాది స్వాతంత్య్ర సేనానులను అరెస్టు చేసి అండమాన్‌లోని జైళ్లలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. అందువల్ల అండమాన్ పేరెత్తగానే అప్పట్లో భయం కలిగేది.
స్వాతంత్య్రానంతరం పరిస్థితులు మారాయి. చుట్టూ సముద్రం, మైమరపించే ప్రకృతి అందాలు ఇక్కడ పర్యాటకానికి ఊపిరులూదాయి. దేశవిదేశాల నుంచి సందర్శకుల తాకిడి పెరగడంతో అండమాన్ పర్యాటకానికి పర్యాయపదంగా మారింది. ఇక్కడి దీవులు, వివిధ రకాల తెగలు, వాటి జీవనశైలి కూడా ఆకట్టుకుంటుంటాయి. అండమాన్ ప్రాంతం ప్రకృతి సంపదకు పెట్టింది పేరు.
మరోవైపు భారత్‌కు అతికీలకమైన సైనిక స్థావరంగానూ అండమాన్ కీలకస్థానంలో నిలిచింది. భారత ప్రాదేశిక జలసరిహద్దులను నిరంతరం రక్షించడంతో పాటు సమీపంలోనే ఉన్న మలక్కా జలసంధి మీదుగా సముద్ర వాణిజ్యం పేరుతో రాకపోకలు సాగిస్తున్న చైనా నౌకలు ఆ ముసుగులో తోక ఝాడించకుండా నిరంతర నిఘా పెట్టేందుకు వీలుగా భారత నౌకాదళం ఇక్కడ అధునాతన రక్షణ వనరులతో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడంతో అండమాన్ నేవీ బేస్‌గా కూడా గుర్తింపు పొందింది.
వీటన్నింటికీ అదనంగా అండమాన్ ద్వీప సముహం ఇప్పుడు మరో ప్రత్యేకత సంతరించుకోబోతున్నది. కొత్త గుర్తింపు పొందనుంది. రక్షణ, పర్యాటక రంగాల్లో తలమానికంగా ఉన్న ఈ ప్రాంతం దేశం మొత్తానికి అవసరమైన కరెంట్ ఉత్పత్తి, సరఫరా చేసే స్థాయికి ఎదగనుంది. అయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గుగనులు అస్సలు లేవు. పోనీ హైడల్(జల) విద్యుత్ ఉత్పత్తి చేస్తారనుకుంటే నదులు అంతకంటే లేవు. ఉన్నదంతా చుట్టూ సముద్రమే. అలాంటిచోట విద్యుత్.. అది కూడా దేశమంతటికీ సరిపడినంత ఎలా ఉత్పత్తి చేస్తారన్న సందేహాలు తలెత్తవచ్చు. అండమాన్ చుట్టూ ఉన్న అపార జలధి సముద్రాన్నే కరెంటు ఉత్పత్తికి ముడిసరుకుగా ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన. అదెలాగో చూద్దాం.
సముద్ర జలాల ఆధారంగా..
జనాభా, పరిశ్రమలు పెరుగుతున్న క్రమంలోనే విద్యుత్ అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా థర్మల్(బొగ్గు), జల(హైడల్), సోలార్(సూర్యరశ్మి), విండ్(గాలి) వంటి ప్రకృతి వనరుల ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టులు విరివిగా నిర్మించి, ఉత్పత్తి పెంచుతున్నా పెరుగుతున్న అవసరాలకు సరిపోవడంలేదు. పైగా థర్మల్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడితే పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. మరోవైపు రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పుడే జల విద్యుత్ తయారీ సాధ్యమవుతుంది. గాలి బాగా వీచినప్పుడు మాత్రమే గాలిమరలు పని చేసి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. ఇక సోలార్ పవర్ అయితే.. వర్షాకాలంలో సూర్యుడిని మేఘాలు కప్పేసే పరిస్థితులే ఎక్కువగా ఉండటం వల్ల తగినంత విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సాధించలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా విద్యుత్ అవసరాలు తీర్చుకునే మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషించింది. అలా తెరపైకి వచ్చేందే సముద్రం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ. దీన్నే టైడల్ పవర్ అంటున్నారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు అండమాన్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. హిందూ మహాసముద్రంలో ఉన్న అండమాన్ దీవుల్లో ఇప్పటికే హాట్ స్పాట్లను గుర్తించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎనర్జీ కన్వర్టర్లు, హైబ్రిడ్ కన్వర్టర్లు ఏర్పాటు చేస్తారు. సముద్రం మీద ఒక వేదిక నిర్మించి.. దానిపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరి కొన్నేళ్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది.
విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుందంటే..
సముద్రంలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలల ఆటుపోట్లు, ప్రవాహాల రూపంలో సాగరంలో నిరంతరం సహజ కదలికలు ఏర్పడుతుంటాయి. వీటివల్ల ఏర్పడే నీటి ఉష్ణోగ్రతలను కరెంట్‌గా మార్చవచ్చు. సముద్ర జలాల్లో సగటున ప్రతి ఏడాది 9.2 లక్షల టెరా వాట్ (ఒక్క టెరావాట్ పది లక్షల మెగావాట్లకు సమానం) గంటల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సముద్రంలో అంతర్గతంగా దాగి ఉండే శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి బ్లూ ఎనర్జీ మార్గాలు ఉపయోగపడతాయి. అనేక దేశాలు ఇప్పటికే సముద్రంలో ఆటుపోట్లు, ప్రవాహాలు, కెరటాలు వంటి వాటితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ భారత్ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. రిప్ కరెంటును ఉపయోగించుకోవడంతోపాటు సముద్ర జలాల మీద సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా నదులు, సముద్ర జలాల మధ్య ఉన్న శాలినిటీ(లవణత్వం) తేడాల ద్వారా కూడా కరెంటు తయారు చేసే మార్గాలను రూపొందిస్తున్నది. భారత్ ఏర్పాటు చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో సంవత్సరానికి టెరా వాట్ గంటల విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక మనదేశంలో ప్రతి ఏటా 1600 టెరా వాట్‌ల విద్యుత్ ఉపయోగిస్తున్నది. ఈ ప్రకారం చూసుకుంటే సుమారు 575 ఏళ్లపాటు కోతలు లేకుండా దేశం మొత్తానికి ఇక్కడి నుంచి విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ రూపొందించింది. సముద్ర జలాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి మంచి ఆలోచనే అయినప్పటికీ దీని ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒక మెగావాట్ టైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ. 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. అదే సోలార్ పవర్‌కు మూడు నుంచి నాలుగు కోట్లు, పవన విద్యుత్‌కు నాలుగు నుంచి ఐదు కోట్లు సరిపోతాయి. అయితే రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సముద్ర జలాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు.






Comments