top of page

నిధులున్నా నిలకడ లేదు.. శంకుస్థాపనలకు చలనం లేదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • ఖాళీ ఖజానా కాదు.. ఖాళీ కుర్చీలు

  • భయంతో పారిపోతున్న అధికారులు

  • ముగ్గురు డీఈలకు ఒక్కరూ లేరు

  • డయేరియా మిగిల్చిన గాయాలు.. ఇంకా మారని పరిస్థితులు

  • ప్రగతిలో కనపడని కమిషనర్ కూర్మారావు మార్క్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నత్తనడకన సాగుతున్నాయి. ఎమ్మెల్యే గొండు శంకర్ అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేస్తున్నా.. కమిషనర్ కూర్మారావు పరిపాలనా వైఖరి, ఇంజినీరింగ్ సిబ్బంది కొరత కారణంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు టెండర్ల దశ కూడా దాటడం లేదు. అధికారులు లేక, ఉన్నవారిని సస్పెండ్ లేదా సరెండర్ చేస్తూ వెనక్కి పంపేస్తుండటంతో నగరంలో డ్రైనేజీ, రోడ్ల పనులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి.

ఈ ఫొటోలు గుర్తున్నాయా కమిషనర్ గారూ..? లేకపోతే మరోసారి గుర్తు తెచ్చుకోండి.

ఇందులో మొదటిది మీరు కమిషనర్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత తోటపాలెం పంచాయతీ ప్రారంభంలో ఉన్న నీలమ్మ కాలనీలో కాలువ నిర్మించి, దాన్ని ముత్యాలమ్మతల్లి హÃల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను కలిపి, నాగావళి నదిలోకి మురుగునీరును మళ్లించడానికి రూ.1.60 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలోనిది. శ్రీకాకుళం మున్సిపాలిటీ నుంచి అనేకమంది పేదలు ఆ చెరువుగట్టున కాలనీ ఏర్పాటు చేసుకుంటే, అప్పటి ప్రభుత్వాలు రోడ్లు, ఇళ్లు, వీధిదీపాలు ఇచ్చాయి గానీ సరైన మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. అందుకోసం ఎన్నికల హామీలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ పనులను అట్టహాసంగా ప్రారంభించారు. ఇంతవరకు ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా మొదలు కాలేదు.

రెండో ఫొటో మిర్తిబట్టి నగరంలో ప్రవేశించిన తర్వాత పూర్తిగా ఆక్రమణలకు గురైపోయిందని, దీన్ని పీఎసఎనఎం హైస్కూల్ వద్ద మహాలక్ష్మి మెడికల్స్ దగ్గరున్న మెయిన్ డ్రైన్‌కి కనెక్టివిటీ ఇస్తే గాని విలీన పంచాయతీల్లో కాలనీలు ముంపు నుంచి బయటపడవని స్వయంగా పరిశీలించి కలెక్టర్ దినకర్ ప్రతిపాదిస్తున్న సందర్భంలోనిది. డీసీసీబీ కాలనీలో ఆక్రమణలు తొలగించి రూ.1.72 కోట్లతో కాలువ నిర్మించాలనేది ప్రతిపాదన. దీనికి కూడా ఇంతవరకు టెండర్ల ప్రక్రియ మొదలుకాలేదు. కనీసం ఆ పనులు చేపట్టడానికి కూడా కార్పొరేషన్‌లో డీఈలు లేరు. అందర్నీ సస్పెండ్, సరెండర్ అని వెనక్కు పంపేయడంతో ఎస్టిమేట్ వేయడానికి గాని, పని రికార్డు చేయడానికి గాని ఇంజినీరింగ్ సిబ్బంది కమిషనర్ కూర్మారావు వచ్చిన తర్వాత పత్తా లేకుండాపోయారు. పోనీ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదివిన కూర్మారావు ఈ పనులను చేపట్టగలిగినా కమిషనర్‌గా ఆయన పరిధి కాదు కాబట్టి ఆయన వేలు పెట్టడంలేదు. దీంతో కోట్లాది రూపాయల పనులు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో నిలిచిపోయాయి. మిర్తిబట్టి పరిస్థితిని చూసి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. సరిగ్గా ఆ టైమ్‌కు డీఈ రవిశర్మను కమిషనర్ కూర్మారావు సరెండర్ చేసేశారు. పోనీ మిగిలిన ఇద్దరు డీఈలతోనైనా పని కానివ్వొచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఇందులో ఒక డీఈ జగన్మోహనరావు డయేరియా దెబ్బకు సస్పెండయ్యారు. హనుమంతు కూర్మారావుకు ఇచ్చిన హైప్ స్థానిక మీడియా (సత్యంతో సహా) జగన్మోహనరావుకు ఇవ్వకపోవడంతో ఆయన సస్పెన్షన్‌ను పట్టించుకునే నాధుడే లేకపోయారు. చచ్చీచెడీ మళ్లీ ఆయన సస్పెన్షన్ ఎత్తించుకోగలిగారు. అయితే ఆయన ఇంకా ఇక్కడ విధుల్లో చేరలేదు. మరో డీఈ కమలాకర్ వీఆరఎస్ తీసుకుని వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో శాంతిస్వరూప్ అనే మరో ఇంజినీర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక్కడి పరిస్థితి చూసి ఇప్పటి వరకు ఆయన విధుల్లో చేరలేదు. ఈ రెండు పోస్టుల పరిస్థితి ఇలా ఉండటంతో సరెండర్ చేసిన రవిశర్మను ఇక్కడే కొనసాగించాలని ఈఎన్‌సీ మళ్లీ ఇక్కడికే పంపారు. ఆయన తన జాయినింగ్ రిపోర్టు ఇచ్చి ఐదు రోజులు గడిచినా కూర్మారావు ఇంకా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ విభాగం మీద ఈసారి విపరీతమైన వర్క్‌లోడ్ ఉంది. సుడా నుంచి రూ.12 కోట్లు తీసుకొచ్చారు. ఇందులో సీఎస్‌పీ రోడ్డు.. అంటే పాలకొండ రోడ్డులో బలగ ప్రాంతంలో రోడ్డు విస్తరిస్తుండటంతో కాలువల నిర్మాణం కోసం రూ.3 కోట్లు కేటాయించగా, మిగిలిన సొమ్ముల్లో రూ.7 కోట్లు నగర వ్యాప్తంగా వివిధ కాలువల నిర్మాణానికి కేటాయించారు. ఈ పనులన్నీ ప్రారంభం కావాల్సివుంది. ఇంజినీరింగ్ అధికారులు లేకపోవడంతో, కమిషనర్‌కు భయపడి కొత్తవారు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది కాకుండా వివిధ బ్యాంకుల రుణాలు రూ.50 కోట్లతో వివిధ పనులకు ప్రతిపాదనలు తయారుచేయాల్సి ఉంది. దానికి కూడా కమిషనర్ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. డయేరియా సంభవించిన ప్రాంతంలో రూ.2 కోట్లతో పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో కొంతమంది పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. కొంతమంది నిక్కచ్చిగా పని చేసినా, బిల్లుల చెల్లింపు కోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అందర్నీ ఒకే గాటన కట్టేసి చూడటం వల్ల గోల్కొండ రేవు రోడ్డు, మంగువారితోట, ఆరంగివీధి వంటి వెనుకబడిన ప్రాంతాల్లో సగటువాసే ఇబ్బందులు పడుతున్నాడు. పైప్‌లైన్‌ను ఎత్తు చేయడం కోసం సిమెంట్ రోడ్డును మధ్యకు తవ్వేశారు. ఇప్ప్పుడు అక్కడ కొత్త రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఎందుకంటే.. డయేరియా పనులనే ఇంతవరకు రికార్డు చేయడానికి ఒక డీఈ లేనప్ప్పుడు, కమిషనర్ టేబుల్ మీద బిల్లు పెడితే అనుమానంగా చూస్తున్నప్ప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి అనేక పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ కొబ్బరికాయ కొట్టేశారు. పని విషయంలో స్పీడ్‌గా ఉండే కూర్మారావు ఒకదాని తర్వాత మరొకటి చకచకా పూర్తి చేసుకుపోతారని భావించారు. కానీ వెనక్కు తిరిగి చూసుకుంటే సిబ్బందిని సరెండర్ చేయడం, సస్పెండ్ చేయడం మినహా క్షేత్ర స్థాయిలో పనుల పురోగతి కనిపించడంలేదని తేలింది. దీంతో కమిషనర్ కూడా తన మాట వినడంలేదన్న భావనకు ఎమ్మెల్యే వచ్చేశారు. ఇప్పటికే ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్ ఉండిపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. జరిగిన అరకొర పనులను రికార్డు చేయడానికి డీఈలు లేరు. నిధులున్నా పనులు జరగడంలేదు. అలాంటప్ప్పుడు కూర్మారావు నిజాయితీపరుడైనా కార్పొరేషన్‌కు ప్రయోజనం లేకుండాపోయింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page