హైకోర్టు ఆర్డర్ కంటే... ‘మామూళ్ల’కే బలమెక్కువా?
- BAGADI NARAYANARAO

- 15 hours ago
- 2 min read
కోర్టు ఆదేశించినా మూతపడని అక్రమ కార్ఖానా!
ఉన్నతాధికారుల అండతోనే యథేచ్ఛగా నిర్వహణ?
రెండు నెలలుగా ఫైల్ దాచుకున్న పంచాయతీ అధికారులు!

(సత్యంన్యూస్, పొందూరు)
న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ స్వీట్స్ తయారీ కేంద్రం (కార్ఖానా) వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా, సదరు కార్ఖానాను మూసివేయించడంలో పంచాయతీ అధికారులు చూపుతున్న కృత్రిమ అలసత్వం వెనుక భారీ రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి మామూళ్ల పర్వం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తీర్పు వచ్చినా మీనమేషాలు
జనవాసాల మధ్య అక్రమంగా నడుస్తున్న ఈ కార్ఖానాను తక్షణమే మూసివేయాలంటూ గత మే 7వ తేదీన హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయితే, తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా పంచాయతీ అధికారులు మాత్రం ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదంటూ కాలయాపన చేస్తుండటం గమనార్హం. దీనిపై అల్లంశెట్టి రవి అనే స్థానికుడు ఈ నెల 1న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చలనమూ లేదు. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు వెనుకడుగు వేయడం వెనుక అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మూడేళ్లపాటు కౌంటర్ దాఖలు చేయకుండా మేనేజ్
మండల పరిషత్ కార్యాలయం ప్రహారీకి ఎదురుగా, నివాస సముదాయాల మధ్య మీనాక్షీ స్వీట్ షాప్ నిర్వాహకుడు తండ్యాల ప్రసాదరావు ఈ కార్ఖానాను ఏర్పాటు చేశారు. 2023లో స్థానికుల ఫిర్యాదుతో పంచాయతీ నోటీసులు ఇవ్వగా, నిర్వాహకుడు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఆ సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా, పంచాయతీ అధికారులు రాజకీయ నాయకుల అండతో మూడేళ్ల పాటు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేశారు. దీనిపై స్థానికులు ఇన్‌ప్లీడ్ అవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, పంచాయతీ కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసిన కౌంటర్‌లో సదరు కార్ఖానాకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, కేవలం స్వీట్ షాపునకు మాత్రమే పన్ను వసూలు చేస్తున్నామని అధికారులు అంగీకరించక తప్పలేదు. ఈ కౌంటర్ ఆధారంగానే మే 7న కోర్టు తుది తీర్పునిచ్చింది.
ఏ ఒక్క శాఖ అనుమతీ లేదు.. అంతా మాయాజాలం!
స్వీట్స్ తయారీ కేంద్రం నడపాలంటే కింది అనుమతులు తప్పనిసరి. ఫ్యాక్టరీ లైసెన్స్, లేబర్ రిజిస్ట్రేషన్, ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫఎసఎసఏఐ) లైసెన్స్, కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అనుమతి, హెల్త్ డిపార్ట్‌మెంట్, ఫైర్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉండాలి. కానీ, ఈ కార్ఖానాకు ఏ ఒక్క శాఖ నుంచీ అనుమతి లేదు. కేవలం కాంప్లెక్స్‌లో ఉన్న స్వీట్ షాప్ లైసెన్సులను చూపించి, అన్ని శాఖల అధికారులనూ నిర్వాహకుడు మేనేజ్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
నిబంధనలు బూడిద పాలు.. కాలుష్యంతో అల్లాడుతున్న స్థానికులు
కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు అండతో చిమ్నీని నిర్మించినా, పొగ మాత్రం జనావాసాల మీదకే వస్తుందనేది స్థానికుల ఆరోపణ. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు కేవలం నెల రోజుల పాటు వాణిజ్య సిలిండర్లకు బదులు గృహ అవసరాల గ్యాస్ వాడి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం కర్రపొట్టు, మొక్కజొన్న కంకులను ఇంధనంగా వాడుతుండటంతో వచ్చే విపరీతమైన పొగ, వ్యర్థ జలాల వల్ల స్థానికులు శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతున్నారు.
నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు
ఈ అక్రమ కార్ఖానా ఉన్న స్థలాన్ని దున్న ప్రకాష్‌రావు అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకోగా, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే లీజు అగ్రిమెంట్‌ను కూడా పునరుద్ధరించుకున్నారు. ఈ విషయం తెలిసినా పంచాయతీ అధికారులు యజమానిని వారించలేదు. నెలకు అన్ని శాఖలకూ అందుతున్న మామూళ్ల వల్లే అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హైకోర్టు తీర్పును అమలు చేసి, ఈ అక్రమ కార్ఖానాను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






Comments