చైనాపై జనాభా బాంబు!
- DV RAMANA

- Jan 28
- 3 min read

కొత్త కొత్త సమస్యలను సష్టించి ప్రపంచంపైకి వదిలి చోద్యం చూడటంలో చైనా పొందే శునకానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వంటి మహమ్మారులకు పుట్టినిల్లుగా నిలిచినా, ఇరుగుపొరుగు దేశాలతో కయ్యాలకు దిగినా, తన సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే జగమొండిగా చైనా ట్రాక్ రికార్డును బహుశా మరే దేశమూ బీట్ చేయలేదేమో. తన ఆవిష్కరణలు, సైనిక శక్తి, ఆర్థిక విజయాలతో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా ఇప్పుడు స్వయంగా కొత్త సంక్షోభంలో చిక్కుకుంది. ఇది కక్షతో వేరే ఏ దేశమో సష్టించిన సమస్య కాదు. అచ్చంగా దాని స్వయంకతమే. అభివద్ధిలో అగ్రస్థానంలో ఉన్న చైనా మూడేళ్ల క్రితం వరకు కూడా ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా ఉండేది. జనాభా వద్ధి అభివద్ధికి చేటు అని భావించి కఠినమైన నియంత్రణ పద్ధతులు అమలు చేసింది. ఫలితంగా జనాభా క్రమంగా తగ్గడం ప్రారంభించి చైనాను మొదటి స్థానం నుంచి తప్పించి రెండోస్థానానికి దించింది. అక్కడితో జనాభా నియంత్రణ పద్ధతులను ఆపేసి ఉంటే బాగుండేదేమో.. కానీ వాటిని కొనసాగించడం వల్ల జనాభా క్షీణత శతిమించి ఇప్పుడు సంక్షోభ స్థాయికి చేరుకోవడం అక్కడి పాలకులను ఆందోళనకు గురి చేస్తోంది. దీనికితోడు ఆ దేశ యువత కూడా పెరిగిన జీవన వ్యయాన్ని, బిజీ లైఫ్‌ను దష్టిలో ఉంచుకుని పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. చైనాలో గతంలో అనుసరించిన వన్ ఛైల్డ్ విధానమే దీనికి కారణమని చెప్పాలి. దీనివల్ల అక్కడ వద్ధ జనాభా పెరిగిపోతోంది. జనాభా తగ్గిపోతోంది. ప్రమాదాన్ని పసిగట్టి పిల్లలను కనడానికి జంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఫలితం కనిపించడంలేదు. గత ఏడాది వ్యవధిలో ఆ దేశంలో జనాభా తగ్గుదల భారీగా ఉండటమేకాదు.. పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే రానున్న రోజుల్లో కొత్త సంక్షోభానికి కారణమవుతుందన్న ఆందోళన మొదలైంది. ఏడాది కాలంలో చైనా జనాభా 33.9 లక్షల మేర తగ్గి 140.4 కోట్లకు పరిమితమైంది. 2025లో అక్కడ జననాల రేటు ఏకంగా 17 శాతం పడిపోయింది. జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది(2024)తో పోలిస్తే 16.2 లక్షల మేర తగ్గింది. మరోవైపు చూస్తే మరణాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.13 కోట్లుగా నమోదైంది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. గత 50 ఏళ్లలో అత్యధిక మరణాలు నమోదైన సంవత్సరం ఇదేనని చెబుతున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇంత భారీగా జనాభా తగ్గిన ఏకైక దేశం చైనా మాత్రమే. పిల్లల్ని కనటం, వారి బాగోగులు చూసే విషయంలో చైనీయుల్లో ఆసక్తి తగ్గిందని, ఆ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి గానీ నిర్ణయాలు తీసుకోవడంలేదని చెబుతున్నారు. దేశ యువతలో వచ్చిన ఈ మార్పును గుర్తించిన చైనా ప్రభుత్వం.. ఈ వైఖరి మార్పు కోసం పలు ప్రోత్సహకాల్ని ప్రకటిస్తోంది. మూడేళ్లకంటే తక్కువ వయసున్న బిడ్డల పోషణ కోసం వారి తల్లిదండ్రులకు వార్షిక సబ్సిడీగా 3600 యువాన్లు(భారతీయ కరెన్సీలో రూ.41వేలు) ఇచ్చే పథకాన్ని గత ఏడాది జనవరిలోనే ప్రారంభించింది. అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావట్లేదంటున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం.. రాబోయే సంవత్సరాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి డ్రాగన్ దేశ జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. దశాబ్దాల తరబడి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగటం తెలిసిందే. అయితే ఈ రికార్డును 2023లో భారత్ బ్రేక్ చేయటం తెలిసిందే. అప్పుడు చైనాలో మొదలైన జనాబా క్షీణత అంతకంతకూ పెరుగుతూ ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం అమలు చేసిన జనాభా నియంత్రణ కార్యక్రమాలు, యువత ఆలోచనల్లో మార్పుల కారణంగా గత కొంతకాలంగా దేశంలో పెళ్లిళ్ల సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశ వ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు 61 లక్షలు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. 2023తో పోలిస్తే వివాహాల సంఖ్యలో ఏకంగా 20 శాతం తగ్గుదల నమోదైంది. ఇంత తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరగడం గత 45 ఏళ్లలో ఇదే మొదటిసారని, గత పదేళ్ల నుంచి దాదాపు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అయితే 2025లో మాత్రం పెళ్లిళ్ల సంఖ్యలో 8.5 శాతం పెరుగుదల నమోదు కావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2025లో జనాభా భారీగా తగ్గడానికి మరో కీలక కారణం ఉందని చైనీయులు చెబుతున్నారు. చైనీయుల క్యాలెండర్ ప్రకారం 2025ను వుడ్ స్నేక్ నామ సంవత్సరంగా పరిగణించారు. పాము పేరిట ఉన్న ఆ సంవత్సరంలో పిల్లలను అస్సలు కనకూడదని.. దానికి ఆ ఏడాది అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగానే 2025లో చైనాలో జననాల సంఖ్య భారీగా తగ్గిపోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేý సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ దేశాన్ని మరో సమస్య కూడా పట్టి పీడిస్తోంది. వద్ధుల జనాభా పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో వీరి సంఖ్య 32.3 కోట్లుగా చెబుతున్నారు. అంటే మొత్తం జనాభాలో 23 శాతం. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. జనాభా పెంచడానికి చైనా ఎంతలా ప్రయత్నిస్తోందంటే.. ఆ చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం కండోమ్ ధరలను పెంచేసింది. దానివల్ల వాటి వినియోగం తగ్గుతుందని ఆశించారు. కానీ అది నెరవేరలేదని చెబుతున్నారు. జనాభా పెరగాలంటే చైనా మహిళల సగటు సంతాన సాఫల్య రేటు 2.1, అంతుకు మించి ఉండాలని అంచనా వేస్తున్నారు. పిల్లలను ఆచితూచి కనాలని గతంలో నిర్దేశించిన ప్రభుత్వమే ఇప్పుడు మళ్లీ ప్రజల మైండ్‌సెట్‌ను మునుపటి స్థాయికి తీసుకెళ్లడానికి తంటాలు పడుతోంది.










Comments