top of page

చట్టసభలోనే ప్రధానికి భద్రత లేదా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 11 hours ago
  • 2 min read

మన చట్టసభల కార్యకలాపాలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు చాలానే ఉన్నాయి. వాటికి అదనంగా చట్టసభలు తమకుతాముగా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాల సంగతెలా ఉన్నా సభల నిర్వహణలో నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గురువారం లోక్‌సభలో దీనికి భిన్నమైన, అరుదైన ఘటనలు చోటు చేసుకోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండానే దాన్ని ఆమోదించడం ఒక చిత్రమైతే.. ప్రధానమంత్రిపై సభలోనే దాడికి మహిళా ఎంపీలు ప్రయత్నించారని ఏకంగా సభాధ్యక్షుడైన స్పీకరే ప్రకటించడం మరో విడ్డూరం. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలో ప్రతి ఏటా బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి, గవర్నర్లు ప్రసంగించడం ఒక ఆనవాయితీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 దీన్ని నిర్దేశించింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. గత ఏడాది ప్రభుత్వం సాధించిన విజయాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను ఇందులో ప్రస్తావిస్తారు. పార్లమెంటు ఉభయసభలు దానిపై వేర్వేరుగా చర్చించిన తర్వాత ముక్తాయింపుగా ప్రధానమంత్రి సమాధానం చెప్పడం, అనంతరం మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం సంప్రదాయం. ప్రధానమంత్రి సమాధానం చెప్పడం తప్పనిసరి కాకపోయినప్పటికీ తొలినుంచి అదొక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. స్వతంత్ర భారత పార్లమెంటరీ చరిత్రలో ఇంతకుముందు ఒక్కసారి మాత్రమే ప్రధాని సమాధానం చెప్పకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన ఘటన జరిగింది. మళ్లీ ఇప్పుడు జరగడం రెండోసారి. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడు, ఎవరి హయాంలో జరిగిందన్నది పరిశీలించాలంటే 22 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. 2004లో యూపీఏ తొలి ప్రభుత్వ హయాంలో మొదటి ఘటన చోటుచేసుకుంది. ఆనాడు డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అప్పటి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో చర్చ పూర్తి అయిన తర్వాత చర్చకు సమాధానం చెప్పడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఉద్యుక్తులయ్యారు. కానీ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఆయన్ను తీవ్రంగా అడ్డుకుని మాట్లాడనీయలేదు. దాంతో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రతిపక్షాల అభ్యంతరాలు, గందరగోళం మధ్య స్పీకర్ ప్రకటించారు. మళ్లీ నిన్న గురువారం సరిగ్గా ఆనాటి ఘటనలే పునరావతమయ్యాయి. కాకపోతే అధికార, ప్రతిపక్షలు రివర్స్ అయ్యాయి. 2004లో కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉండగా బీజేపీ అడ్డుపడి ప్రధానిని మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్ అడ్డుపడటం విశేషం. అయితే గతసారి మన్మోహన్‌సింగ్ సభకు వచ్చి ప్రసంగించడానికి ప్రయత్నించి విఫలం కాగా.. తాజా ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పడానికి అసలు సభకే రాలేదు. ఆయన రాకపోవడానికి కారణం తానేనని సాక్షాత్తు లోక్‌సభ స్పీకర్ సభాముఖంగా ప్రకటించడం కూడా చాలా అరుదైన ఘటనే. ప్రధానిపై సభలోనే దాడి జరిగే ప్రమాదమున్నట్లు సమాచారం అందిందని, అందుకే ఆయన్ను సభకు రావద్దని తాను స్వయంగా సూచించినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. 500 మందికిపైగా సభ్యులు, లోక్‌సభ సిబ్బంది, మార్షల్స్ ఉన్న నిండు సభలో సాక్షాత్తు ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరిగితే దేశ ప్రజాస్వామ్యానికి, మనం పాటించే విలువలకు తీవ్ర అపచారం జరిగి ఉండేదని స్పీకర్ వ్యాఖ్యానించారు. గురువారంనాటి ఘటనలకు పూర్వరంగం బుధవారం చోటుచేసుకుందని స్పీకర్ కార్యాలయం ప్రస్తావించింది. బుధవారం లోక్‌సభలో పలువురు ఎంపీల ప్రవర్తన చాలా హేయంగా ఉందని, ఆ ఘటనలు పెద్ద మచ్చలాంటివని అంటూ ప్రతిపక్షానికి చెందిన మహిళా ఎంపీలే బ్యానర్లు పట్టుకుని సభలో ప్రధాని సీటు వైపు దూసుకెళ్లడం, ఆయన్ను కదలకుండా సీటును చుట్టుముట్టడం వంటి చర్యలు ప్రధానమంత్రి భద్రతను ప్రశ్నార్థకం చేశాయని, అందువల్లే గురువారం సభకు రావద్దని తానే సూచించినట్లు స్పీకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలోనే ప్రధానమంత్రిపై భౌతికంగా దాడి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉంది. ఆ ప్లాన్‌లో భాగంగానే కాంగ్రెస్ మహిళా ఎంపీలను కవచాలుగా ముందుకు పంపారని అధికారపక్షం ఆరోపిస్తోంది. ప్రతిపక్షాలు ప్రారంభం నుంచే సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాని మోదీని సభలో ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసింది. దీన్ని విరమింపజేసేందుకు కాంగ్రెస్ నేతలతో చర్చించినా వారు మొండికేశారు. ఎంత ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించేశారు. భద్రతా కారణాలతోనే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొనడం కలకలం రేపింది. ఇది చాలా ఆందోళనకర పరిణామమని, చరిత్రలో ఇలాంటివి చూడలేదని అధికార పక్షం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సభలో ఇంత ఉద్రిక్తతలకు ప్రధాన కారణం మాజీ ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన అముద్రిత పుస్తకంలోని కొన్ని అంశాలే. రాహుల్‌గాంధీ వాటిని ప్రస్తావించేందుకు ప్రయత్నించడం, స్పీకర్ అనుమతి నిరాకరించడంతో మొదలైన గొడవ.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నెహ్రూ-గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పరిస్థితినిదిగజార్చాయి. పలువురు కాంగ్రెస్ మహిళా సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే వారు ప్రధాని ఆసనం వైపు వెళ్లడంతో గందరగోళం చెలరేగింది. ఈ ఘటనల కారణంగా మనం పాటిస్తున్న విలువలకు చట్టసభల సాక్షిగా భంగం వాటిల్లడం, మన మహిళా ప్రతినిధులు దాడులకు పాల్పడతారన్న అపప్రద రావడం విచారకరం.

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page