చమురు లాభం ‘ప్రైవేటు’దే!
- DV RAMANA

- Aug 29, 2025
- 3 min read
తక్కువ ధరకు రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్
అయినా దేశంలో పెట్రో ధరలు తగ్గించని కేంద్రం
అధిక సుంకాలతో ప్రమాదంలో మన ఎగుమతులు
దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ప్రైవేట్ రిఫైనరీలు

‘సొమ్మొకడిది.. సోకొకడిది’.. అంటే పరుల సొమ్ముతో విచ్చలవిడిగా జల్సాలు చేయడమని అర్థం. ఈ నానుడి ప్రస్తుతం దేశంలోని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలకు అతికినట్లు సరిపోతుందేమో! అమెరికా టారిఫ్‌ల కొరడాకు అనేక రంగాల వ్యాపారాలను, ప్రజల అవసరాలను ఫణంగా పెట్టి మరీ రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) దిగుమతి చేసుకుంటోంది. చాలా తక్కువ ధరకు రష్యా ఇస్తుండటం వల్లే ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. దేశప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తోంది. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? తక్కువ ధరకు ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నందుకు.. దేశంలో పెట్రో ధరలు తగ్గాయా అంటే.. ఒక్క పైసా కూడా తగ్గలేదు. మరోవైపు అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో అమెరికాకు వివిద వస్తుసామగ్రి ఎగుమతులు దెబ్బతింటున్నాయి. ఇన్ని త్యాగాలు, కష్టాలను ప్రజలు, ఇతర వ్యాపార రంగాలు భరిస్తుంటే.. తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న క్రూడ్ అయిల్‌ను ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఇతర దేశాలకు అమ్ముకొని ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిస్తున్నాయి. అదెలాగో చూద్దాం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
తమ ఆంక్షలను కాదని రష్యా నుంచి భారీగా ముడి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాల భారం మోపారు. ఇంతకుముందే 25 శాతం సుంకాలు విధించగా, జరిమానా రూపంలో మరో 25 శాతం సుంకాలు విధించారు. ఈ నిర్ణయం ఈ నెల 27 నుంచి అమల్లోకి రావడంతో తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసే పలు రంగాలు పరిశ్రమలపై ఆ భారం పడిరది. ఫలితంగా అమెరికాలో ఆయా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ అమ్మకాలు పడిపోతున్నాయి. దీంతో రష్యా నుంచి భారత్ జరుపుతున్న చమురు కొనుగోళ్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికాతో సహా అనేక యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై వాణిజ్య ఆంక్షలు విధించాయి. వాటి ప్రకారం రష్యా వస్తువులు, ముడిసరుకులు కొనుగోలు చేయకూడదు. ఈ ఆంక్షలను ఎదుర్కొనే క్రమంలో రష్యా తన ప్రధాన వనరుల్లో ఒకటైన ముడిచమురు ధరలను భారీగా తగిస్తూ మిత్రదేశాలకు ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని చైనా, భారత్ సద్వినియోగం చేసుకుంటున్నాయి. భారత్ తన అవసరాల్లో దాదాపు 40 శాతం ముడి చమురును డిస్కౌంట్ రేటుకు రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇది అమెరికాకు కంటగింపుగా మారింది. తమ ఆంక్షలను బేఖాతరు చేసినందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అయినా భారత్ తమ ప్రజల ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితే ముఖ్మమంటూ రష్యా నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తోంది. రోజుకు దాదాపు మూడు మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. కానీ ఆ ప్రయోజనాలు ప్రజలకు దక్కట్లేదు. రష్యా చమురుతో ప్రైవేటు ఆయిల్ కంపెనీలే భారీగా లబ్ధి పొందుతున్నాయి. రష్యా నుంచి చవగ్గా వస్తున్న చమురును దేశంలోని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు పశ్చిమ దేశాలకు ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు దండుకొంటున్నాయి.
ప్రైవేట్ కంపెనీలకే ఆ ఛాన్స్
తక్కువ ధరకు రష్యా నుంచి కొని.. ఎక్కువ ధరకు అమ్మి అపరిమిత లాభాలు దండుకునే ఛాన్స్ మోదీ సర్కారు పుణ్యమా అని అన్ని దేశీయ ఆయిల్ కంపెనీలకు లేదు. ప్రభుత్వరంగ ఆయిల్ రీఫైనరీలకు ఇతర దేశాలకు పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ అనుమతి లేదు. ప్రైవేటు సంస్థలకు మాత్రం అలాంటి ఆంక్షలేవీ లేవు. దాంతో రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు లాభాల పంట పండుతోంది. తనపై విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఆయా దేశాలకు చమురు ఎగుమతులను రష్యా నిలిపేసింది. ఫలితంగా పశ్చిమ దేశాల్లో చమురు కొరత ఏర్పడిరది. ఎక్కువ ధరకు కొనాల్సిన అగత్యం ఏర్పడిరది. దీన్ని ఆసరాగా చేసుకున్న మనదేశంలోని ప్రైవేటు రిఫైనరీలు రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న చమురును పశ్చిమ దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించి లాభపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేశానికి గానీ, సామాన్యులకు గానీ ఒనగూరుతున్న లాభం ఏమీ లేదు. పైగా ట్రంప్ తాజా సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు చవకైనా తగ్గని పెట్రో ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నా.. రష్యా చమురు ద్వారా లభిస్తున్న ధరల రాయితీని ప్రజాప్రయోజనాలకు మళ్లించాలన్న ఆలోచన ప్రభుత్వానికి కలగడంలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే తదనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాల పేరుతో సవరణలతో కాలక్షేపం చేస్తోంది.
సుంకాలకు బలయ్యే భారతీయ వ్యాపార రంగాలు
భారతీయ ఎగుమతులపై విధించిన 50 శాతం సుంకాల వల్ల వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, కార్పెట్లు తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటి వల్ల భారత్ నుంచి అమెరికాకు ఈ రంగాల ఎగుమతులు 40 నుంచి 50 శాతం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. థింక్ ట్యాంక్ జీటీఆర్‌ఐ ప్రకారం.. కొత్త సుంకాలు భారతీయ వస్తువులను అమెరికాలో చాలా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. దీనివల్ల ఎగుమతులు దాదాపు సగం తగ్గిపోతాయి. కోల్‌కతాకు చెందిన సముద్ర ఆహార ఎగుమతిదారు యోగేష్ గుప్తా మాట్లాడుతూ భారతదేశ రొయ్యలు ఇప్పుడు అమెరికా మార్కెట్లో బాగా ఖరీదైపోయాయని అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో ఇప్పటికే ఈక్వెడార్ నుండి తీవ్ర పోటీ ఎదురవుతోందన్నారు. అక్కడ కేవలం 15 శాతం సుంకం మాత్రమే ఉంది. మరోవైపు భారతీయ రొయ్యలపై ఇప్పటికే 2.49 శాతం యాంటీ డంపింగ్ సుంకం, 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ సుంకం ఉన్నాయి. అమెరికా విధించిన 50 శాతం సుంకాలతో ఈ భారం మరింత పెరిగి అమెరికాలో భారతీయ రొయ్యల ధరలు రెట్టింపుపైగా పెరిగాయని ఆయన చెప్పారు. కాగా సుంకాల ప్రతికూల ప్రభావంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) పేర్కొంది. వస్త్ర, రెడీమేడ్ దుస్తుల ఎగుమతిదారులకు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించింది. మరోవైపు అమెరికాకు ఎగుమతి చేసే సేంద్రియ , రసాయనాల ఎగుమతులపై 54 శాతం సుంకం పడుతుందని పేర్కొంది. అలాగే కార్పెట్లు (52.9 శాతం) ఉన్నాయి. దుస్తులు, అల్లిక దుస్తులు (63.9శాతం), నేత వస్త్రాలు (60.3 శాతం), వజ్రాలు, బంగారం ఉత్పత్తులు (52.1 శాతం), యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు (51.3 శాతం), ఫర్నిచర్, పరుపుల(52.3 శాతం) తయారీ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవుతాయని జీటీఆర్‌ఐ వెల్లడిరచింది.










Comments