జంధ్యాల మిస్ అయిపోయిన ‘అన్నమయ్య’
- Guest Writer
- 6 days ago
- 2 min read

‘ఆనంద భైరవి’ సినిమా (19-4-1984).. జంధ్యాలను నిజంగానే ఆనందతాండవ మాడిస్తోంది. రచయితగా అప్పటివరకూ ఏరుకున్న పేరు ప్రఖ్యాతుల మణి మాణిక్యాలు...దర్శకునిగా కొత్తగా ఖజానాలో చేరిన కీర్తిమయ వజ్ర వైడూర్యాలు...వీటన్నిటికంటే ‘ఆనంద భైరవి’ తొడిగిన కిరీటమే ఆయన్ను దగదగలాడిస్తోంది. ఇంతకుమించి ఇంకేదో చేద్దామనే రకరకాల ఆలోచనలు.. బోలెడన్ని భేటీలు...!
500 ఏళ్ల క్రితమే తెలుగు పాటకు రూపం, రుచి కల్పించిన ‘పద కవితా పితామహుడు’ తాళ్లపాక అన్నమాచార్యుడు జీవితాన్ని తెరకెక్కిస్తే...? ఆ ఆలోచన జంధ్యాలలో చాలా ఉద్వేగాన్ని రేకెత్తించింది. అంతకుముందు ఒకరిద్దరు ‘అన్నమయ్య’ సినిమా తీయాలని తలపోశారు కానీ అది కలగానే మిగిలిపోయింది.
జంధ్యాలతో ‘ఆనంద భైరవి’ తీసిన డి. సీతా పద్మరాజు, బిఏవి శాండిల్య మేము సైతం అంటూ ఉవ్విళ్ళూరారు. బిఏవి శాండిల్య మేనేజింగ్ ట్రస్టీగా ‘అన్నమాచార్య ట్రస్ట’ స్థాపన జరిగిపోయింది. ఈ ట్రస్టు ద్వారా నిధులు సేకరించి సినిమా తీయాలి. దాంతోపాటు అన్నమయ్య కీర్తనలను నాలుగు కేసెట్లుగా విడుదల చేయాలి. జంధ్యాలకు ఇష్టుడు రమేష్‌నాయుడు. ఇలాంటి ప్రాజెక్టుకి స్వర సమర్ధుడు, సర్వ సమర్ధుడు ఆయనే.
రమేష్ నాయుడు కూడా ప్రాణం పెట్టి మరి పని చేయడానికి సిద్ధం. అన్నమయ్య స్వరపరచిన కీర్తనల్లోంచి మేలైనవి ఎంచారు. ఇందుకు ఆత్రేయ కూడా సాయం పట్టారు. ఒక్క ‘హరి అవతార మితడన్నది’ మాత్రం తాళ్లపాక తిరుమలాచార్యునిది. ఒకటో అరో తప్ప అన్ని కొత్త వరసలే కట్టారు రమేష్ నాయుడు. ఈ పాటలన్నీ హేమాహేమీలతో పాడించాలనేది వారి ప్లాన్.
ఆశాభోంస్లేని బొంబాయి నుంచి మద్రాసుకి రప్పించారు. రమేష్ నాయుడు అంటే ఆశాభోంస్లేకి చాలా అభిమానం. ఆయన తొలి హిందీ చిత్రం ‘హేమ్లెట’ (1954) లో నాలుగు పాటలు ఉంటే, మూడు పాటలు ఆశాభోంస్లే తోనే పాడించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్యన మంచి అనుబంధం. ‘అన్నమయ్య’ కోసం ఐదు పాటలు పాడారు ఆశాభోంస్లే. ఈ విషయం తెలిసి ప్రసిద్ధ సినీ సంగీత పరిశోధకులు విఏకె రంగారావు ఎగురుకుంటూ ఏవీఎం రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు. ‘నటనల భ్రమయకు’, ‘సత్యభామ సరసపు నగవు’ పాటల్ని ఆమె లైవ్ లో పాడుతుంటే విని... చెవుల్లో అమృతం కురిసినట్టుగా పులకించిపోయారాయన.
కేజే ఏసుదాస్ 5 పాటలు, వాణి జయరాం 3 పాటలు, ఎస్పీ బాలసుబ్రమణ్యం 10 పాటలు, పి. సుశీల 6 పాటలు ఆలపించారు. మిగతా రెండు డజన్ల పాటలను మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పూర్ణచందర్, సరళారాణి, వేదవతి ప్రభాకర్, నాగూర్ బాబు, వింజమూరి కృష్ణమూర్తి పాడారు.
మద్రాసులోని హోటల్ సవేరాలో ఇందుకు సంబంధించి ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. అక్కడొక స్కీంని కూడా ప్రకటించారు. ఆంధ్ర బ్యాంకులో రూ.350లు కట్టిన వారికి ఈ నాలుగు క్యాసెట్లు ఇస్తారు. దాంతోపాటు అందమైన పెట్టెలో అన్నమయ్య విగ్రహం, వెంకటేశ్వరుని బొమ్మ అనుగ్రహం, ముదిగొండ శివప్రసాద్ రాసిన అన్నమయ్య కథతో పాటు కొన్ని పాటల అందాల వివరణ గల ఒక చిన్న పుస్తకం. ఈ స్కీంని ప్రకటించగానే ఫస్ట్ చెక్కు ఇచ్చింది వీఎకే రంగారావు. రమేష్‌నాయుడు చేతుల మీదుగా ఆంధ్రాబ్యాంక్ జిఎం బి.శ్రీనివాసరావు కి ఆ చెక్కు అందజేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా ఇంకో ఎత్తు.
సినిమా పేరు ‘హరికీర్తనాచార్య అన్నమాచార్య’. బ్యానర్ పేరు ‘శ్రీ చరణ చిత్రాలయం’. 1984 ఆగస్టులో ‘ఆనందభైరవి’ యూనిట్ అమెరికా యాత్ర ప్లానింగ్‌లో ఉంది. ఆ యాత్ర నుంచి రాగానే జంధ్యాల ‘అన్నమయ్య’ తీయాలనేది ప్లాన్. ఈలోగా చేస్తున్న సినిమాలు పూర్తిచేసేయాలి. అలాగే ‘అన్నమయ్య’ స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాలి. ఈ స్క్రిప్ట్ పని కోసం హేమాహేమీల్ని కలిశారు. కథ విషయంలో శోభారాజు సహకారం తీసుకున్నారు. ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి చేయాలనేది జంధ్యాల ఆలోచన. అమెరికా నుంచి తిరిగి వచ్చాక, ఆర్టిస్టులు ఎంపిక మొదలుపెట్టారు.
అన్నమయ్య పాత్రకు ఎవరైనా తెలుగు కుర్రాణ్ణి తీసుకోవాలనేది జంధ్యాల ఆశ. ఎవరూ నచ్చడం లేదు. ఎవరూ ఆనడం లేదు. “తాళ్లపాక అన్నమాచార్యుడి పాత్రలో 20 నుంచి 90 ఏళ్ల వరకు వివిధ వయసుల్లో నటులు కావాలి. ముఖ్యమైన అన్నమయ్య పాత్రకు తెలుగు వాళ్లయితేనే నాకు తేలిక. ఇప్పటికి 300మందిని పరీక్షించాను. కానీ ఆకారం బాగుంటే, ఎక్స్ప్రెషన్ ఉండడం లేదు. అది ఉంటే ఆ మొహంలో కళ, నిర్మలత్వం కనిపించడం లేదు. ఇవన్నీ ఉన్న యువకులు దొరికితే ఇప్పటికైనా సరే వాళ్లనే తీసుకుంటాను” అని జంధ్యాల చెప్పుకొచ్చారు. (ఈ వార్త 1987 డిసెంబర్ 21 - 1988 జనవరి 6 నాటి ‘సితార’ పత్రికలో వచ్చింది.)
చివరకు ఆయన కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. మరాఠీ నటుడు సచిన్ ని తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామిగా అరుణ్ గోవిల్ ఓకే. ‘రామాయణ’ టీవీ సీరియల్‌లో రాముడిగా ఆయన ఫేమస్ కదా. అన్నమయ్య గురువుగా జెవి సోమయాజులు కూడా సిద్ధం. కానీ కాలం కరుణించలేదు. జంధ్యాల కల నెరవేరలేదు. ఆడియో క్యాసెట్లు బయటకు వచ్చాయి కానీ, సినిమా మాత్రం ముందుకి కదల్లేదు. జంధ్యాల ‘అన్నమయ్య’ చేసి ఉంటే ఎలా ఉండేదో అని చాలామంది ‘అన్నమయ్య’ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
- పులగం చిన్నారాయణ






Comments