జెన్ జెడ్ హీరోలు.. అయ్యారు జీరోలు!
- DV RAMANA

- 7 hours ago
- 3 min read

ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. సుస్థిర ప్రభుత్వంపై తిరుగుబాటు.. నెలల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూల్చివేత.. సాక్షాత్తు దేశప్రధానినే కట్టుబట్టలతో దేశం నుంచి పలాయనం చిత్తగించేలా చేసిన జెన్ జడ్ ఉద్యమం బంగ్లాదేశ్ గతినే మార్చేసింది. దేశాన్ని మళ్లీ ఎన్నికల వైపు నడిపించింది. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితం ఏమిటి? జెన్ జెడ్‌ను ప్రజావాహిని అధికార పీఠంపై కూర్చోబెట్టిందా అంటే.. వీరికి కూడా పరాభవం తప్పలేదనే చెప్పాలి. నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న జెన్ జెడ్ యువత జమాతే ఇస్లామీతో కలిసి ఈ నెల 12న జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వారికి ఏమాత్రం మింగుడుపడని ఫలితాలు లభించాయి. దేశం నుంచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా నేతత్వంలోని అవామీలీగ్‌ను బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో బేగం ఖలీదాజియా కుమారుడు తారిక్ రహమాన్ నేతత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ మాత్రమే ప్రధాన పోటీదారులుగా మిగిలారు. జెన్ జెడ్ యువతకు ఎన్‌సీపీ జమాతే ఇస్లామీ పార్టీతో జతకట్టింది. మొత్తం 11 పార్టీల ఈ కూటమిలో భాగస్వామిగా 30 సీట్లకు పోటీ చేసింది. ఉద్యమాన్ని ఆదరించిన ప్రజలు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉద్యమ పార్టీని దాంతోపాటే ఆ కూటమి పార్టీలను ప్రజలు బ్రహ్మరథం పడతారని, అధికారం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఓటర్లు ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఊహించని తీర్పుతో షాకిచ్చారు. 300 స్థానాలు ఉన్న బంగ్లా పార్లమెంటులో బీఎన్‌పీ కూ{మిని బీఎన్‌పీ 211 సీట్లలో గెలిపించి.. మూడింట రెండొంతుల మెజారిటీ కట్టబెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. మరోవైపు జమాత్ కూటమికి 70 సీట్లు రాగా అందులో భాగమైన ఎన్‌సీపీ మాత్రం 5 నుంచి 6 సీట్లకే పరిమితమైంది. అయితే నహిద్ ఇస్లాం వంటి కొందరు నేతలు వ్యక్తిగతంగా విజయం సాధించడం విశేషం. భారీస్థాయిలో ఉద్యమాలు నిర్వహించిన యువజనులు కీలకమైన ఎన్నికల్లో మాత్రం చతికిలపడటం విస్మయం కలిగించింది. దీనికి కారణాలపై రకరకాల విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హసీనా సర్కారు అణచివేత విధానాలపై 2024 జూన్‌లో యువత పోరాటం ప్రారంభించారు. యువత తిరుగుబాటును తట్టుకోలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయిన పరిస్థితుల్లో నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్‌ను రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలు ప్రకటించారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటినుంచి నెలలు గడుస్తున్నా తిరుగుబాటు వీరులు ముందడుగు వేయలేకపోయారు. పైగా వారిలోనూ గ్రూపులు ఏర్పడటం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేకపోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేసినా నాయకత్వంలో ఐక్యత లోపించడం, కచ్చితమైన సిద్ధాంతాన్ని గానీ అజెండాను గానీ ఖరారు చేసుకోలేకపోవడంతో ఉద్యమ పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనే ఆ విషయం స్పష్టమైంది. అవామీలీగ్‌ను పార్టీ రద్దు పేరుతో అధికారికంగా తప్పించేసిన తర్వాత మిగిలింది బీఎన్‌పీ, జమాతే ఇస్లామీ పార్టీలే. విద్యార్థుల ఉద్యమ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. దానితో ఆందోళన చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నాయకత్వం జమాతే ఇస్లామీతో పొత్తు కుదుర్చుకుంది. ఇది కూడా ఆ పార్టీలో విభేదాలకు తావిచ్చింది. మతతత్వ పార్టీ అయిన జమాతే ఇస్లామీతో కూటమి కట్టడాన్ని నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు సిటిజన్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ పొత్తుపై ప్రజాబాహుళ్యంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఎన్నికల్లో విద్యార్థుల పార్టీ విజయావకాశాలపై ముందునుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి. జమాతే కూటమి గెలిచి అధికారంలోకి వచ్చే మాట ఎలా ఉన్నా అసలు కూటమి పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి.. జెన్ జెడ్ ఉద్యమ నేతల్లో ఎందరు గెలుస్తారన్న చర్చలు మొదలయ్యాయి. దాంతోనే ఉద్యమ ప్రభావం తగ్గిపోయిందని, ఉద్యమం ద్వారా పెద్దగా ఏమీ సాధించలేకపోయారని అర్థమైంది. తమపై ఆశలు పెట్టుకుని బలపరచి ఉద్యమాన్ని ఆదరించిన ప్రజలకు ఎన్నికల్లో ఏం చెప్పాలో విద్యార్థి నాయకులకు అర్థం కాలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయాలన్నదానిపై వారికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించలేదు. దాంతో ఓటర్లు ఉద్యమ పార్టీపై విశ్వాసం ఉంచలేకపోయారు. ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమికి ఓట్లేసి గెలిపిస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో కొత్త కూటమికి ఓట్లేసి నట్టేట మునిగేకంటే.. కష్టమో నష్టమో ఇంతకుముందు అధికారాన్ని రుచి చూపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయే నయమని భావించిన ఓటర్లు ఏకపక్షంగా ఆ పార్టీకి ఓట్లు గుద్దేశారు. భవిష్యత్తుపై ఎటువంటి ఆశలు కల్పించలేని స్థితిలో ఎంత పెద్దగా ఉద్యమాలు సాగినా.. వాటి ప్రభావం సుదీర్ఘ కాలం కొనసాగదని, రోజుల్లో చప్పున చల్లారిపోతుందని ఈ ఎన్నికలు రుజువు చేశారు. ఉద్యమాలు నిర్వహించడం వేరు.. ఎన్నికల రాజకీయం వేరు అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమాల్లో భావోద్వేగాలు పనిచేస్తాయి.. ఉత్ప్రేరకంగా ఉపయోగపడతాయి. దానికి నెట్‌వర్క్‌తో పెద్దగా అవసరం ఉండదు. కానీ ఎన్నికýను ఎదుర్కోవడానికి పటిష్టమైన యంత్రాంగం, బూత్ మేనేజ్‌మెంట్ ఎంత పక్కాగా ఉండాలో.. ఎన్నికల ఖర్చులు ఎదుర్కోవడానికి తగిన వనరులు కూడా అంతే అవసరం. ఇక్కడ భావోద్వేగాల కంటే ఆలోచన, విచక్షణే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఆ కోణంలో చూస్తే.. దశాబ్దాల చరిత్ర ఉన్న బీఎన్‌పీకి గ్రామస్థాయి వరకు బలమైన నెట్‌వర్క్ ఉంది. ఎన్నికలను ఎదుర్కోవడం, ప్రభుత్వాన్ని నడపడంలో దానికి ఉన్న అనుభవం ముందు ఉద్యమ పార్టీ ప్రజలకు ఆనలేదు. దాంతో ఉద్యమ హీరోలు జీరోలయ్యారు.










Comments