top of page

జనసేన జిల్లా పగ్గాలు దానేటి చేతికి

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 hours ago
  • 2 min read
స్థానిక ఎన్నికల వేళ పవన్ వ్యూహాత్మక అడుగు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జనసేన జిల్లా పగ్గాలను డాక్టర్ దానేటి శ్రీధర్‌కు ఇవ్వడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడిగా దానేటికి దాదాపు ఖరారైనట్లు తెలిసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో దానేటికి జిల్లా బాధ్యతలు అప్పగించనున్నారన్న సమాచారంతో జనసేనలోనూ హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న పిసిని చంద్రమోహన్ స్థానంలో దానేటికి బాధ్యతలు అప్పగించడం వల్ల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆలోచనతో జనసేన నాయకత్వం ఉన్నట్లు పార్టీలోనే చర్చ సాగుతోంది. డాక్టర్ దానేటి శ్రీధర్ ఎన్నికలకు ముందే జనసేనలో చేరినా ఆశించిన గుర్తింపుకు నోచుకోలేదన్న భావన ఆయన అభిమానుల్లో ఉంది. అధినాయకత్వం వద్ద దానేటికి మంచి పలుకుబడి ఉన్నా ఆ స్థాయి పదవికి నోచుకోలేదు.

రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటి నుంచి దానేటి శ్రీధర్ శ్రీకాకుళం పార్లమెంట్‌కు పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు అవకాశం రాలేదు. 2024కు ముందు జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీకి ఆసక్తి చూపినా, కూటమిగా వెళ్లడంతో దానేటికి అవకాశం దక్కలేదు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానేటి శ్రీధర్ జనసేనలో అడుగులు వేస్తుండటంతో జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ పోటీ చేసే స్థానాల్లో కచ్చితంగా గెలిచి గ్రామ స్థాయిలో పార్టీకి పట్టు ఉందని నిరూపించుకోవడానికి జనసేన వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ శ్రీధర్‌కు జిల్లా పగ్గాలు అప్పగించాలని జనసేనాని నిర్ణయించినట్లు సమాచారం. ఖర్చుతో కూడుకున్న పదవి కాబట్టి డాక్టరే దీనికి సమర్థుడని జనసేన భావిస్తోంది. దానేటికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఆ పార్టీ నుంచి మరో వ్యక్తి లేకపోవడంతో లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో జనసేన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు.

ప్రస్తుతం జిల్లా నుంచి కొరికాన రవికుమార్ మాత్రమే ‘సుడా’ చైర్మన్‌గా జనసేన నుంచి నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం గడువు మరో ఆరు నెలలు మాత్రమే ఉంది. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడానికి కొరికాన సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. జనసేన నుంచి రానున్న రోజుల్లో పాతపట్నంలో పోటీ చేయడానికి కొరికాన ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఈయనతో పాటు పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ గేదెల చైతన్య అటవీశాఖ పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొరికానకు చైతన్య సమీప బంధువు కావడంతో పాతపట్నంపైనే వీరు దృష్టి సారిస్తున్నారు . దీంతో దానేటికి పార్టీలో పోటీ లేకుండా పోయింది. సామాజికంగా, ఆర్థికంగా దానేటి పటిష్టంగా ఉండటంతో జిల్లా పగ్గాలు ఆయన చేతిలో పెట్టడానికి జనసేనాని సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page