top of page

టంప్ గాలి పోతోంది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 3 min read

ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం అంతే అగమ్యంగా సాగుతోంది. దీనికి అంతం ఎప్పుడన్నది అంతుచిక్కడంలేదు. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు చెబుతుండగానే మరోవైపు సంయుక్త దళాలు ఇరాన్‌పై విరుచుకుపడుతునే దాడులు ఆపడానికి 15 షరతులు అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకోవైపు చర్చలు జరగడంలేదని ఇరాన్‌వర్గాలు కొట్టిపారేస్తూ ఈ దశలో యుద్ధాన్ని ఆపడం ట్రంప్ చేతుల్లో లేదని.. మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ముగింపు ఎప్పుడన్నది తాము నిర్ణయిస్తామని, దానికి తమకు కొన్ని షరతులు ఉన్నాయని ఇరాన్ పాలకులు చెబుతున్నారు. వాటికి అంగీకరిస్తేనే చర్చలు, యుద్ధం ముగింపు గురించి ఆలోచిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ కాస్త మెత్తబడినట్లు కనిపిస్తుండటమే ఇప్పుడు విశేషం. ఇజ్రాయెల్ కారణంగా రెచ్చిపోయి యుద్ధంలోకి దూకిన ట్రంప్ ఇప్పుడు దాని పర్యవసానాలకు బాధ్యుడిగా నిలబడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఇంటాబయటా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అమెరికా`ఇజ్రాయెల్ దేశాల యుద్ధోన్మాదం మొత్తం ప్రపంచాన్ని ఆయుధాల కుంపటిపై కూర్చోబెట్టింది. పెట్రో ఉత్పత్తుల సంక్షోభం ఏర్పడి ప్రపంచ దేశాల్లోని దాదాపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. దాంతో యుద్ధాన్ని ఉన్నఫళంగా నిలిపివేయాలని ఇతర దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరుగుతున్నది. కానీ ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ పరివారం సతమతం అవుతున్నది. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ ససేమిరా అంటూ.. షరతులు పెడుతుండటంతో అమెరికాకు ఎటూ పాలుపోవడంలేదు. దీన్నుంచి జనం దష్టి మళ్లించడానికే ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ వనరులన్నింటినీ నాశనం చేసేశామని ఒకవైపు ప్రకటనలు చేస్తున్న ట్రంప్ మరోవైపు చర్చల కోసం అర్రులు చాస్తుండటానికి కారణం స్వజనం కూడా ఆయన నిర్వాకాలను ఛీదరించుకుంటుండటమే. ప్రపంచ దేశాలతోపాటు ట్రంప్ యుద్ధోన్మాద నిర్ణయాలు అమెరికన్లను కూడా సంక్షోభంలోకి నెడుతున్నాయి. దాంతో అమెరికాలో ట్రంప్ పాపులారిటీ వేగంగా పడిపోతున్నది. తాజాగా జరిగిన ఒక సర్వేలో ఇది స్పష్టంగా కనిపించింది. ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత అమెరికాలోనూ చమురు, ఇతర చాలా వస్తుసేవల ధరలు అమాంతం పెరిగిపోవడం ట్రంప్ కు ఉన్న ప్రజాదరణను పడగొడుతున్నాయి. ఆయన పాపులారిటీ రికార్డు స్ధాయిలో 36 శాతానికి పడిపోయినట్లు ‘రాయిటర్స్-ఇప్సోస’ పోల్‌లో వెల్లడైంది. ఈమధ్య నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 36 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నట్లు తేలింది. గత వారం ఇదే ట్రంప్‌ను 40 శాతం మంది సమర్థించారు. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే ట్రంప్ ప్రజాదరణ నాలుగు శాతం పడిపోయిందన్నమాట. గత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి అమెరికాలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, జీవన వ్యయం విషయంలోనూ ట్రంప్‌పై అమెరికన్ల అభిప్రాయాలు శరవేగంగా మారిపోయాయి. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉన్న జీవన వ్యయం సమస్యను అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పరిష్కరించిన తీరును 25 శాతం అమెరికన్లు మాత్రమే ఆమోదించారు. ప్రస్తుతం 29 శాతం మంది మాత్రమే ట్రంప్ ఆర్థిక నిర్వహణను ఆమోదిస్తున్నారు. ట్రంప్ రెండు అధ్యక్ష పదవీకాలాల్లో ఇదే అత్యల్ప రేటింగ్ కావడం గమనార్హం. ట్రంప్‌కు ముందున్న అధ్యక్షుడు జో బైడెన్‌కు గతంలో లభించిన ఏ ఆర్ధిక రేటింగ్ కంటే కూడా ఇది తక్కువే. ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా జీవన వ్యయం పెరుగుదలపై ఓటర్ల ఆందోళనలు మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఓటమికి ముఖ్యమైన కారణంగా నిలిచాయి. ట్రంప్ మాత్రం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే విషయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తాజా పోల్ ఫలితాలతో స్పష్టమైంది. ఇప్పుడు దీన్నుంచి బయటపడేందుకు ట్రంప్ రకరకాల విన్యాసాలు చేయాల్సి వస్తోంది. ఈ కారణాల వల్లే ఇరాన్‌పై తన వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి ట్రంప్‌ది. మొన్నటి దాకా కయ్యానికి కాలు దువ్విన అగ్రరాజ్యం ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతోంది. ఇరాన్ వద్ద న్యూక్లియర్ బాంబ్స్ లేవంటూ ఎన్‌వోసీ కూడా ఇస్తోంది. యుద్ధం మొదలైన వెంటనే మార్కెట్ రియాక్షన్ అమెరికాను కుదిపేసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 110 డాలర్లను, కొన్ని సెషన్స్‌లో 114 డాలర్లకు చేరింది. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మార్కెట్లు అస్థిరంగా ఉండటం అమెరికాకే పెద్ద రిస్క్. మరోవైపు ఎయిర్ స్ట్రైక్స్, మిస్సైల్ అటాక్స్‌తో ఇరాన్‌ను పూర్తిగా అణచలేమని గత 28 రోజుల యుద్ధం తర్వాత అమెరికా ఆలస్యంగా గ్రహించింది. ఇరాన్ మిలిటరీ స్ట్రక్చర్ డిస్ట్రిబ్యూటెడ్‌గా ఉంది. నాయకులను టార్గెట్ చేసినా అక్కడి సిస్టమ్‌ను బ్రేక్ చేయలేకపోవడం అమెరికా వైఫల్యంగా చెప్పాలి. మరో కీలకాంశం హర్మూజ్ జలసంధిని మూసివేసి ఇరాన్ తన ఆధీనంలో పెట్టుకోవడం. దీన్ని ఇరాన్ ఆధిపత్యం నుంచి తప్పించి చమురు రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని ట్రంప్ బీరాలు పోయారు. హర్మూజ్‌ను ఇరాన్ నుంచి కాపాడటానికి నాటో దేశాలు సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనలను నాటో కూటమి తిరస్కరించడంతో ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికితోడు అమెరికా మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశాన్ని నిషేధించిన ఇరాన్ ఇతర దేశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కాస్త ఉపశమనమే అయినా గల్ఫ్ దేశాల్లోని అనేక చమరు, గ్యాస్ క్షేత్రాల్లో ఇప్పటికే నాశనం కావడం వల్ల ఈ రెండింటి కొరత కొన్నేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ వైఫల్యాల నేపథ్యంలోనే ట్రంప్‌పై ఇంటాబయటా ఒత్తిడి బాగా పెరిగింది. ఈ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకే అమెరికా ఇప్పుడు చర్చలు, మధ్యవర్తిత్వం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతోంది. ఇదే అదనుగా ఇరాన్ పట్టు బిగిస్తున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page