top of page

డీసీఎం సార్.. మా పల్లెకు పండగేది?

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 3 hours ago
  • 2 min read
  • మరోసారి రోడ్డెక్కిన సిరుసువాడ, కుంటిభద్ర ప్రజలు

  • ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు శంకుస్థాపనలు

  • ప్రభుత్వాలు మారినా మారని రోడ్డు దుస్థితి

(సత్యంన్యూస్, కొత్తూరు)

బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో రోడ్డు వేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హమీకి రెండేళ్లు పూర్తి కావస్తున్నా పాతపట్నంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గుర్తుకు రాలేదా అంటూ కొత్తూరు మండలం పరిధిలోని సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకొత్తూరు నుంచి సిరుసువాడ, కుంటిభద్ర మీదుగా నివగాం`కొత్తూరు ప్రధాన రోడ్డుకు కనెక్టవిటీగా ఉన్న సుమారు 5.50 కిలోమీటర్లు రోడ్డుకు శంకుస్థాపనలు తప్ప పనులు ప్రారంభించలేదు. నిర్మాణం కోసం రోడ్డును తవ్వి విడిచిపెట్టడంతో రోడ్డుపైకి నీరు చేరి వాహనాలు రాకపోకలు కారణంగా వర్షాకాలంలో బురదతో నిండి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. 20 ఏళ్లుగా సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాల రోడ్డు కోసం స్థానికులు ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. 2014లో వైకాపా నుంచి గెలిచి టీడీపీలో చేరిన కలమట వెంకటరమణ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2018లో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 2019లో టెండర్లు పిలిచినా పనులు జరగలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2022లో రోడ్డు నిర్మాణం కోసం మరోమారు నిధులు మంజూరు చేయించారు. 2023లో పనులు ప్రారంభించినా నిధుల లేమి కారణంగా పనులు ముందుకు సాగలేదు. స్థానికులు రోడ్డు నిర్మాణం కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రతిసారీ అధికారులు హడావుడి చేయడం తర్వాత విస్మరించడం షరా మామూలు అయిపోయింది.

పల్లెపండగ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో సిమెంట్, బీటీ రోడ్డుల నిర్మాణం జరగుతున్నా కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్టు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో చేపడుతున్న సీసీ, బీటీ రోడ్డు పనులను గుంటూరు, కష్ణ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల పనులు పూర్తిచేశారు. మరికొన్ని చోట్ల పనులు ప్రారంభించారు. ఇంకొన్ని చోట్ల సగంలోనే విడిచిపెట్టారు. నియోజక వర్గంలో సుమారు రూ.500 కోట్లు విలువైన పనులు చేపట్టిన వీరికి బిల్లులు చెల్లింపు జరగక్కపోవడమే ఇందుకు కారణం. దీంతో పనులను ఎక్కడివక్కడ విడిచిపెట్టి బిల్లులు చెల్లింపులు చెల్లింపులు జరిగితేనే పనులు పూర్తి చేస్తామని వెనక్కి వెళ్లిపోయినట్టు నియోజకవర్గంలో చర్చ సాగుతుంది. ప్రతి పనికి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల స్థానికులు ఎవరూ పనులు చేయడానికి సాహసించడం లేదని ప్రచారం ఉంది. కాంట్రాక్ట్ పనులు ఎవరు చేసినా, కమీషన్లు ఎవరికైనా కామనైపోయాయి. కాకపోతే బిల్లుల చెల్లింపు సకాలంలో జరగకపోవడం వల్ల వడ్డీల లెక్క కట్టుకుంటే అడిగినంత కమీషన్ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ రెండింటికి సమతూకం కుదరకపోవడంతో కొన్నిచోట్ల రోడ్డు పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

 రెండుసార్లు రోడ్డెక్కి

2024 ఎన్నికల్లో రోడ్డు నిర్మాణం ప్రధాన హమీగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆ తర్వాత 2025లో రూ.2 కోట్లు అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినా పనులు జరగలేదు. దీంతో గ్రామస్తులు రెండుసార్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత ఏడాది రోడ్డుపై పేరుకుపోయిన బురదలో నాట్లు వేశారు. పత్రికల్లో కథనాలు రావడంతో హడావుడిగా బురదలో కంకర వేసి జేసీబీతో చదును చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే హడావుడి చేశారు. ఇప్ప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హమీని నెరవేర్చకపోవడంతో మరోమారు సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాలకు చెందిన యువకులు ఎమ్మెల్యే గోవిందరావుకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన చేపట్టారు. రోడ్డు హమీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్డులకు మహర్దశ కల్పించడానికి పంచాయతీరాజ్ ద్వారా ఉపాధి హమీ పథకం నిధులను మంజూరుచేసి పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హమీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లడమే మార్గమని ఆలోచించిన స్థానిక యువత మరోసారి రోడ్డెక్కారు. ఈసారి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కేవలం సిరుసువాడ, కుంటిభద్ర రోడ్డుకే పరిమితం కాదని, నియోజకవర్గంలో అనేక చోట్ల పనులు ప్రారంభించి నిలిపేసిన రోడ్లు పదుల సంఖ్యలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page