తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
- DV RAMANA

- 15 hours ago
- 2 min read

ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ ఓటర్లు కేసీఆర్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. కేవలం 28 శాతం ఓట్లే వేసి.. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 13 చోట్ల మాత్రమే అధికారం కట్టబెట్టారంటే.. తెలంగాణ అర్బన్ ప్రాంతాల్లో బీఆరఎస్‌పై అసంతప్తి తగ్గకపోగా పెరిగిందనుకోవాల్సి వస్తుంది. ఈ మహా పతనానికి బాధ్యులెవరు? కేసీఆర్ ఛరిష్మా కోల్పోయారా? కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదా? హరీష్‌రావును పక్కన పెట్టడం కొంప ముంచిందా? పార్టీని కుటుంబ జాగీరుగా మార్చడమే పతనానికి కారణమైందా? అన్నది విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటరు నాడిని పసిగట్టడంలో వరుసగా విఫలమవుతున్న గులాబీ పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద నాయకుల సంగతెలా ఉన్నా.. ఛోటా నేతలు, సీనియర్ కార్యకర్తలు పార్టీ పరిస్థితిపై నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా గుర్తింపు పొందిన బీఆరఎస్.. ఎందుకు పరాజయాల బాట పట్టిందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. స్థానిక ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఉంటాయన్నది వాస్తవం కావచ్చు. అయితే సీట్ల సంగతెలా ఉన్నా ఓట్ల శాతంలో భారీ క్షీణత నమోదు కావడం బీఆరఎస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం చెక్కు చెదరకపోయినా పార్టీకి దూరమైన అనేక వర్గాల ఓటర్లను ఆకట్టుకుని తిరిగి పార్టీ వైపు మళ్లించడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా వైఫలమైందని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు ప్రచారం చేసుకునే పార్టీ నాయకులు, వ్యూహకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని మాత్రం తేలిగ్గా తీసుకునేలా వ్యవహరిస్తుండటం రాజకీయ పండితులతోపాటు ప్రజలనూ విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాలపై వారు వ్యాఖ్యానించిన తీరు దీనికి కారణం. తమ పార్టీ 30కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంటామని అంచనా వేస్తే.. 17 వచ్చాయని, అదే బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్త సంతప్తి చెందినట్లుగా మాట్లాడటం చూసిన వారు ఎన్నికల్లో అపజయాన్ని అంగీకరించేందుకు బీఆరఎస్ సిద్ధంగా లేనట్లుందని అంటున్నారు. మొత్తం పోటీ చేసిన స్థానాలు కాకుండా ఆశించిన స్థానాల్లో సగం గెలుచుకోవడమే గొప్పగా బీఆరఎస్ భావిస్తోందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలే కాదు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆరఎస్ ప్రభావం చూపలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంగా బీఆరఎస్ సరైన రీతిలో పనిచేయకపోవడమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న భావనతోనే బీఆరఎస్ ఉండిపోయిందని అంటున్నారు. ప్రభుత్వంపై తమలో ఉన్న వ్యతిరేకతనే ప్రజా వ్యతిరేకతగా భ్రమపడి తప్పులో కాలేస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆ స్థానంలో చూడటానికి బీఆరఎస్ అధిష్టానం ఇప్పటికీ ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే పార్టీకి అధిక నష్టం వాటిల్లుతున్నదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీఆరఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారశైలి కూడా పార్టీని దెబ్బతీస్తున్నదని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం ఫాం హౌసుకు వెళ్లిపోయిన కేసీఆర్ ఇప్పటికీ అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం లేదంటున్నారు. కష్ట సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేత తన బాధ్యతలను పూర్తిగా కేటీఆర్, హరీశ్ రావులకు వదిలేశారని వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నే అస్త్రంగా మలుచుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్‌ను బీఆరఎస్ అభివర్ణిస్తే.. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా విరుచుకుపడ్డారు. దీంతో కేసీఆర్‌ను చులకన చేయగలిగే అస్త్రాలను బీఆరఎస్ స్వయంగా అందించిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తనను నేరుగా టార్గెట్ చేస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉండటం, తానొస్తే చీరేస్తానంటూ హెచ్చరించి వెంటనే ఫాంహౌసుకు వెళ్లిపోవడం వంటి పరిణామాలతో బీఆరఎస్ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి. తండ్రి తీరు అలా ఉంటే.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు భేజానికెత్తుకున్న కొడుకు కేటీఆర్ కూడా రేవంత్‌రెడ్డి వ్యూహాలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు. సొంత ఇంటిని చక్కబెట్టుకోవడంలో కూడా బీఆరఎస్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలవరం రేపుతున్నాయి. కేసీఆర్ ఇంటి సమస్యను చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక తమ సంగతి ఏం చూస్తారన్న భావనకు ప్రజలు వచ్చేస్తున్నారు. ఇదే భావనతో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటం బీఆరఎస్‌ను తీవ్రంగా నష్టపరుస్తోంది. కేసీఆర్ స్థానంలో కేటీఆర్‌ను పార్టీ అధినేతగా స్వీకరించేందుకు ప్రజలు ఇంకా సిద్ధపడలేదని, ప్రజామోదం పొందడంలో కేటీఆర్ ఇంకా తడబడుతున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో హరీశ్‌రావు సేవలకు పరిమితులు విధించడం కూడా బీఆరఎస్‌కు నష్టం చేస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే అధిష్టానం ఆలోచనలు, తీరు మారితే తప్ప విజయబాట పట్టడం కష్టమని అంటున్నారు.










Comments