top of page

నాటి ఎన్టీఆర్ ఆలయం.. త్వరలోనే దర్శన భాగ్యం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 12
  • 3 min read
  • ఒకనాడు తీర్థస్థలంలో చెన్నైలోని నందమూరి నివాసం

  • దశాబ్దాల తర్వాత చేతులు మారిన ఆరాధ్యదైవం ఆవాసం

  • దాన్ని ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచే సంకల్పం

  • పాతకాలపు ఆకృతులకే కొత్త సొబగులద్దుతున్న చదలవాడ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రపంచంలో కోటానుకోట్ల మానవులు ఉంటారు. కానీ అందరూ ఒక్కలా ఉండరు. కొందరు మనుషుల్లో దేవుళ్లుగా ఖ్యాతిపొందుతారు. అలాగే మనుషులు తలదాచుకునే ఆవాసాలు లక్షల్లోనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రత్యేకత సంతరించుకుంటాయి. మీVAజ్వల చరిత్రను సొంతం చేసుకుంటాయి. మద్రాసు(నేటి చెన్నై) నగరంలోని టీ నగర్ ప్రాంతం బజుల్లా రోడ్డులో ఠీవిగా నిలబడి ఉండే ఓ భవంతి ఆ కోవలోకే వస్తుంది. ఆ ఇంటితో తెలుగువారికి విడదీయరాని బంధం కూడా అల్లుకుని ఉంది. ఎందుకంటే అది ఒక అభినవ రాముడు, అందాల కష్ణుడు నడయాడిన అందమైన నిలయం. ఒకనాడు అభిమానులనే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి, ఆరాధనాభావంతో వీక్షించిన అభిమాన దేవాలయం. ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, సమాజమే దేవాలయం అంటూ తెలుగునేలపై రాజకీయ విప్లవం సష్టించిన రాజర్షి ఎన్టీఆర్ సినీపరిశ్రమలో ఉన్నప్పుడు మూడు దశాబ్దాలకుపైగా నివసించిన ఇల్లే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భవంతి. నందమూరి నాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు.. కానీ నిరంతరం మన జ్ఞాపకాల్లోనే ఉన్నారు. మరి ఆయన నడయాడిన ఇల్లు ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలన్న, చూడాలన్న ఆసక్తి కలగడం సహజం. లక్షలాదిమంది ఎన్టీఆర్ అభిమానుల ఈ ఆకాంక్షను తీర్చే పనిలో పడ్డారు.. ఆ మహానటుడిగా అభిమాని అయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఎన్టీఆర్ ఇంటిని ఇటీవలే కొనుగోలు చేసిన ఆయన దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది.. అభిమానుల సందర్శనకు వీలు కల్పించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో తన అనుబంధం, ఆయన ఇంటిని కొనుగోలు చేసే భాగ్యం కలిగిన విధం, దాన్ని తీర్చిదిద్దే ప్రణాళికల గురించి ఆ మధ్య ఒకరిద్దరు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఈ వివరాల సమాహారమే ఈ కథనం..

అక్కడ వెంకన్న.. ఇక్కడ రామన్న

తిరుమల కొండపై వెంకన్న దర్శనం.. ఆపై మద్రాసు టీ నగర్‌లోని భవంతి మిద్దేపై రామన్న దర్శనం.. ఏడు దశాబ్దాల వెనక్కి వెళ్లి చూస్తే.. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుమల యాత్రకు వెళ్లే భక్తుల ఆకాంక్షగా కనిపిస్తుంది. అప్పట్లో తిరుపతి యాత్ర చేయడం చిన్న విషయం కాదు. కానీ ఆ యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా మద్రాస్ మహానగరానికీ వెళ్లేవారు.. అక్కడ నివసించే ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని మురిసిపోయేవారు. ఇవి జరగకపోతే తిరుపతి యాత్ర పరిపూర్ణం కానట్లే భావించేవారు. అంతగా తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌ది. ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన ఇల్లు ఉన్న బజుల్లారోడ్డు ఒక యాత్రాస్థలంలా ఉండేది. టూరిస్టు బస్సుల్లో వందలాది తరలివచ్చే భక్తులతో కోలాహలంగా ఉండేది. ఎన్టీఆర్ కూడా వారందరినీ ఇంటి డాబాపైనుంచో, కింది దిగివచ్చో పలకరించేవారు. ఆయన్ను కనులారా వీక్షించి, ఆ ఇంటి గేటును కళ్లకద్దుకుని తన్మయత్వంతో భక్తులు తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎన్టీఆర్ నివసించిన ఇంటి చరిత్ర అంత ఘనమైనది. వెయ్యి గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంటిని 1953లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. సీనియర్ నటుడు కస్తూరి శివరావు నుంచి దాన్ని ఎన్టీఆర్ కొన్నారని చాలా మంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. బెంగాల్‌కు చెందిన వారి నుంచి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి పక్కనే కస్తూరి శివరావు గారి ఇల్లు ఉండేది.

సందడే సందడి

ఎన్టీఆర్ ఇంటికి ఎదురుగానే దర్శకుడు దాసరి నారాయణరావు ఇల్లు ఉండేది. సాధారణంగా ప్రముఖులు నివసించే వీధులకు నైట్ వాచ్‌మెన్ ఉండేవారు. కానీ ఎన్టీఆర్, దాసరి నివసించిన వీధికి మాత్రం వాచ్‌మన్ అవసరంలేదన్న జోక్ అప్పట్లో ప్రచారంలో ఉండేది. ఎందుకంటే దాసరి తన స్టోరీ డిస్కషన్స్, సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ వంటి చర్చలన్నీ ముగించుకుని ఏ తెల్లవారుజామునో లైట్లు ఆర్పి నిద్రకు ఉపక్రమించేవారు. మరోవైపు తెల్లవారుజాము మూడు గంటలు అయ్యేసరికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఎన్టీఆర్ బెడ్‌రూం లైట్లు వెలిగేవి. ఆయన నిద్ర నుంచి మేల్కొని దైనందిన వ్యవహారాల్లో పడేవారు. దాంతో దాదాపు రాత్రంతా ఆ వీధి కళకళలాడుతూనే ఉండేది. ఇక తెల్లవారితే చాలు తెలుగు ప్రజలతో కూడిన బస్సులు ఆయన ఇంటి వద్దకు చేరుకునేవి. వాటిలో వచ్చిన జనాలతో, వారు చేసే జై ఎన్టీఆర్ నినాదాలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారిపోయేది. అప్పట్లోనే తెనాలికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తిరుపతికి, అక్కడి నుంచి మద్రాసులోని ఎన్టీఆర్ ఇంటికి టూరిస్టు బస్సులు నడిపేవారు. ఆ అన్నదమ్ములే.. తర్వాత కాలంలో సినీ నిర్మాతలైన చదలవాడ తిరుపతిరావు, చదలవాడ శ్రీనివాసరావు సోదరులు. వారిద్దరు కూడా ఎన్టీఆర్ అభిమానులే. ఆమధ్య చదలవాడ శ్రీనివాసరావు తమ సినిమా పనుల విషయమై మరో నిర్మాత, నందమూరి కుటుంబ సన్నిహితుడైన ప్రసన్నకుమార్‌తో కలిసి చెన్నై వెళ్లారు. ఆ సమయంలో బజుల్లా రోడ్డు సమీపంలోంచి వెళ్తుంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చి నాటి ఆయన ఇల్లు ఎలా ఉందో చూడాలనిపించింది.

30 మంది వారసుల లోగిలి

ఆ ఇంటిని చూడగానే పాత జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. ఉద్విగ్నతకు గురి చేశాయి. అప్పుడే శ్రీనివాసరావు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని తీసుకుని ప్రజల సందర్శనకు అనువుగా మలచాలన్న సంకల్పం కలిగింది. అదే విషయాన్ని పక్కనున్న తన సన్నిహితుడు ప్రసన్నకుమార్‌కు చెప్పగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంతమంది అడిగినా ఆ ఇంటిని అమ్మడానికి ఇష్టపడని ఎన్టీఆర్ కుటుంబీకులు ఆ ఇంటిని సొంతిల్లులా జాగ్రత్తగా చూసుకోగలిగే వారికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలో ప్రసన్నకుమార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు వారు అంగీకరించారు. ఆ ఇంటిని ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరుతో కొనుగోలు చేశారు. ఇప్పుడు దానికి జూనియర్ ఎన్టీఆర్ సహా సుమారు 30 మంది వరకు వారసులు ఉన్నారు. కొనుగోలు ప్రతిపాదన వచ్చినా ఫలానా రేటు ఇవ్వాలని వారు అడగలేదు. ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే కోరారు. దాంతో ఆ ఏరియాలో ఉన్న విలువ ఆధారంగా చదలవాడ శ్రీనివాసరావే ఒక రేటు ఫిక్స్ చేయగా. ఆ ఆస్తికి జీపీఏ హోల్దర్లుగా ఉన్న మోహనకృష్ణ, రామకృష్ణలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అక్కడితో ఆ ఇంటితో ఎన్టీఆర్ కుటుంబానికి రుణం తీరిపోయింది.

అవే ఆకృతులు.. కొత్తగా..

ఇప్పుడు ఆ ఇంటిని ప్రజల సందర్శనకు అనువుగా తీర్చిదిద్దేందుకు చదలవాడ శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. ‘ఎన్టీఆర్‌కు బర్మా టేకు అంటే ఎంతో ఇష్టం.. అందుకే ఆయనకు ఇష్టమైన ఫర్నిచర్‌ను ఇప్పుడు బర్మా టేకుతోనే చేయిస్తున్నాను. ఆ ఇంటిలో రామారావు ఎక్కడ ఏ కుర్చీలో కూర్చునేవారో.. ఎక్కడ భోజనం చేసేవారో తెలుసుకుని.. అలాంటి ఫర్నిచర్‌నే కొత్తగా చేయించి అవే ప్రదేశాల్లో ఉంచాలని నిర్ణయించారు. పాత ఉడ్ స్థానంలో కొత్త ఉడ్ వస్తుంది తప్ప ఇంట్లో మార్పులేమీ ఏండవు. వస్తువులన్నీ కొత్తగా ఏంటాయి. ఇంటి గేటును కూడా బర్మా టేకుతో చేయిస్తున్నారు. దానిపై కృష్ణుడు, రాముడు రూపాల్లో ఎన్టీఆర్ బొమ్మలను చెక్కించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇంటి ఆధునికీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్టీఆర్‌ను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఇప్పటికీ చాలామంది ఆ పాత ఇంటిని చూసి.. రామారావుగారి అందమైన రూపాన్ని తలచుకుని రెండుచేతులూ జోడించి నమస్కారం పెట్టి వెళ్లేవారు ఎందరో! అటువంటి వారందరికీ త్వరలోనే దేవాలయం లాంటి ఆ ఇల్లు తనలోకి ఆహ్వానించ ఉంది. సందర్శకులందరూ ఆ ఇంట్లోకి వచ్చి తనవితీరా అన్ని చూడవచ్చు.. ఎన్టీఆర్ గడిపిన కాలాన్ని ఆస్వాదించవచ్చు. ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఇదో పవిత్ర ప్రదేశం.. ఒక దేవాలయం.. అందులో తాను పూజారిని మాత్రమేనని చదలవాడ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తానికి ఒక మహోన్నతమైన కళాకారుడి ఇల్లు ఒక కళాత్మక నిలయంగా మారుతుండటం, త్వరలోనే అందుబాటులోకి రానుండటం విశేషం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page