నితిన్ బాణం గురి తప్పింది
- Guest Writer
- Jul 5, 2025
- 3 min read

వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న నితిన్ హీరోగా వచ్చిన తాజా సినిమా తమ్ముడు. వకీల్‌సాబ్‌తో పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరాం వేణు , చాలా కాలం తర్వాత కనిపించిన లయ.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించడంతో ఈ సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా, లేదా?
కథ ఏంటి?
జై (నితిన్) దిల్లీలో వుంటాడు. విలువిద్య క్రీడాకారుడు. నేషనల్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఆశయం. కానీ లక్ష్యం వైపు దృష్టి సారించాలంటే ఏదో మెంటల్ బ్లాక్. అదేమంటే చిన్నప్పుడు విడిపోయిన అక్క (లయ) జ్ఞాపకాలు. ఆమెను కలవడానికి స్నేహితురాలు చిత్ర (వర్షబొల్లమ్మ)తో బయల్దేరుతాడు. లయ తన కుటుంబంతో కలిసి అంబర గొడుగు అనే అటవీ ప్రాంతానికి జాతరకు వెళ్లి వుంటుంది. అక్కడ ఆమె ప్రమాదంలో పడుతుంది. అక్కని తమ్ముడు ఎలా రక్షించాడన్నదే మిగతా కథ.
దర్శకుడు వేణు శ్రీరాం గతంలో ఎమ్‌సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) తీశాడు. ఆ పోలికలు తమ్ముడిలో కనిపిస్తాయి. దాంట్లో వదిన, మరిది ఎమోషన్. ఆఫీసర్‌గా ఉన్న వదిన ప్రమాదంలో పడుతుంది. మరిది రక్షిస్తాడు. ఇక్కడ తమ్ముడు.
ఎమ్‌సీఏలో ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. తమ్ముడులో ఆ ఫీల్ లేదు. సన్నివేశాలన్నీ కృత్రిమంగా అనిపిస్తాయి. సినిమా అంతా కనిపించే అడవి మాత్రమే నేచురల్.
20 ఏళ్ల తర్వాత అక్క గుర్తుకు రావడం ఒక ఆశ్చర్యం అయితే. సరిగ్గా అదే సమయానికి కుటుంబంతో సహా ఆమె ప్రమాదంలో ఉండడం మరో ఆశ్చర్యం. ఇదంతా సినిమా లిబర్టీ అనుకుందాం, కానీ మన వ్యవస్థ ఎలా పని చేస్తూ వుందో దర్శకుడికి అర్థమైనట్టు లేదు.
మంత్రి, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిన కేసులో ఒక అధికారి ఇచ్చే నిజ నిర్థరణ నివేదికకు ఏమాత్రం విలువ వుంటుంది? ఆమె సంతకం పెట్టకుండా వుండడానికి ఇంత కథ అవసరమా?
ఒకవేళ ఆమె నివేదిక ఇచ్చినా ఫ్యాక్టరీ యజమానుల ఆస్తులు జప్తు చేయరు. కోర్టు ప్రొసీజర్స్ చాలా వుంటాయి. భోపాల్ కేసులో బాధితులకి ఇంకా న్యాయం జరగలేదు. కార్బైడ్స్ యజమాని ఆండర్సన్ శిక్ష పడకుండానే చనిపోయాడు.
సినిమాల్లో ఇలాంటి లాజిక్కులు అడగకూడదు. రెండున్నర గంటలు ప్రేక్షకుడిని రంజింప చేస్తే ఏమీ అడగరు. నత్తనడకతో సాగితేనే సమస్య.
అక్కా తమ్ముళ్ల ఎమోషన్ పండిరదా?
ఆంధ్రప్రదేశ్‌కు, ఛత్తీస్‌గఢ్‌కి మధ్యన అంబర గొడుగు అటవీ ప్రాంతం వుందట. అది ఏ రాష్ట్రానికీ చెందదు కాబట్టి పోలీసులు వెళ్లరట. అక్కడున్న వాళ్లు ఏ నేరమైనా చేసేస్తారట.
కథని పూర్తిగా లిబర్టీతో రాసుకున్న దర్శకుడు అక్కాతమ్ముళ్ల ఎమోషన్‌ని కూడా పండిరచలేక పోయాడు. పాత్రల్ని రిజిస్టర్ చేయడంలో విఫలమయ్యాడు.
విలన్‌కి శబ్దం వింటే ఇరిటేషన్ వస్తుంది. లయ కూతురు టెన్షన్ పడితే వెక్కిళ్లు వస్తాయి. వీరికి తోడుగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న అమ్మాయి. అసలు నెలలు నిండిన అమ్మాయిని అడవిలో జాతరకి తీసుకొస్తారా?
సినిమా కాసేపు ఫ్యామిలీ డ్రామాగా, కాసేపు అడ్వెంచర్‌గా, ఇంకాసేపు యాక్షన్ థ్రిల్లర్‌గా గజిబిజిగా వుంటుంది. వర్షబొల్లమ్మ, లయకి నటించే అవకాశం ఉన్నా సన్నివేశాలే లేవు. ఎంతసేపూ నితిన్ ఫైట్లు చేయడమే.
ఇంకో హీరోయిన్ సప్తమి గౌడ (కాంతారా ఫేమ్) రేడియో జాకీ తరహాలో అడవిలో వుంటుంది. ఏదేదో మాట్లాడుతూ వుంటుంది.
ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన వాళ్లకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్న లయ , తన కళ్ల ముందు అనేకమంది చనిపోతూ వుంటే నిమ్మకి నీరెత్తినట్టు వుంటుంది.
మొదటి 15 నిమిషాలు పర్వాలేదనిపించి , తర్వాత చివరివరకు లేవకుండా తమ్ముడు పడిపోయాడు. ఎంతో అనుభవం ఉన్న దిల్‌రాజుకి ఈ కథలో ఏం నచ్చిందో తెలియదు. విపరీతంగా ఖర్చు పెట్టారు.
సినిమాలో హీరో నితిన్‌కి బాణం గురి తప్పుతూ వుంటుంది. కానీ కథల ఎన్నికలో ఆయన బాణం ఎప్పుడో గురి తప్పింది.
బీబీసీ సౌజన్యంతో..
ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ రూ.50లక్షల ఆర్థిక సాయం..

ఇందులో వాస్తవం ఎంత?
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో ఐసియు- వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని కథనాలొచ్చాయి. అతడి కుమార్తె, కుటుంబ సభ్యులు ఇంతకుముందు సహాయం కోసం అర్థించారు. ఫిష్ వెంకట్ కి కిడ్నీ సంబంధిత సమస్యలకు చికిత్స జరుగుతోందని అయితే దీనికి 50లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు సూచించినట్టు వెల్లడిరచారు. అంతేకాదు కిడ్నీని వేరొక ధాత నుంచి సేకరించాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఎంతగా అభ్యర్థించినా సినీపరిశ్రమ నుంచి ఆర్థిక సాయానికి ఎవరూ స్పందించలేదని కూడా వారు ఆందోళన చెందినట్టు కథనాలొచ్చాయి.
అయితే ఈ ప్రచారం ఇలా ఉండగానే మరో కొత్త ప్రచారం ఇండస్ట్రీలో హీట్ పుట్టించింది. ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ప్రభాస్ 50లక్షలు సాయం చేసారని స్థానిక మీడియాలతో పాటు, జాతీయ స్థాయిలో మీడియాలన్నీ అత్యుత్సాహంగా కవర్ చేసాయి. అయితే ఇప్పటికే ప్రభాస్ 50 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారా? అంటే ఇంకా ఏ సాయం అందలేదని తెలుస్తోంది. ఫిష్ వెంకట్ కి ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్రభాస్ అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చిందని, అయితే కిడ్నీ ధాత దొరికిన తర్వాత సంప్రదించాల్సిందిగా వారు చెప్పినట్టు కథనాలొచ్చాయి. అయితే ఫిష్ వెంకట్ కి సాయం చేసేందుకు ‘గబ్బర్ సింగ్ గ్యాంగ్’ (సహనటులు) మాత్రమే ముందుకు వచ్చారని, పరిశ్రమ నుంచి ఇతరులు ఎవరూ ఎలాంటి సాయానికి ముందుకు రాలేదని ఒక సెక్షన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రామిస్ చేసింది ప్రభాస్ అసిస్టెంటేనా కాదా? అన్నదానిపైనా స్పష్ఠత లేదు. ఈ వార్తల్ని ప్రభాస్ టీమ్ అధికారికంగా కన్ఫామ్ చేయలేదు.
తుపాకి.కామ్ సౌజన్యంతో..










Comments