top of page

నందిని తాకిన రోడ్డు విస్తరణ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 hours ago
  • 2 min read
  • సుమారు 15 అడుగులు కోల్పోనున్న నీలకంఠేశ్వరాలయం

  • అదే జరిగితే ప్రవేశద్వారం కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు

  • నందీశ్వరుడిని కదిలిస్తే భక్తుల మనోభావాలకు విఘాతం

  • ఆలయాన్ని మినహాయించాలని వినతులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. మధ్యలో ఒక్కరోజే వ్యవధి ఉంది. దాంతో శైవక్షేత్రాలన్నీ ఉత్సవాల ఏర్పాట్లతో సందడిగా కనిపిస్తున్నాయి. కొత్త రంగులు, విద్యుత్ దీపాల అలంకరణలతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. కానీ ఆ శివాలయం మాత్రం ఉంటానా.. ఊడతానా.. అన్న సందిగ్ధంలో కళవెళపడుతోంది.

ఏళ్ల తరబడి ఎదురుచూసిన రోడ్డు విస్తరణ ఎట్టకేలకు తమ ముంగిటి వరకు వచ్చినందున ఆ ప్రాంతీయులు సంతోషిస్తుంటే.. ఆ ఆలయం మాత్రం ఉనికి కోల్పోతానేమోనని భయపడుతోంది.

పురాతన ఆలయం

ఇదీ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయం పరిస్థితి. శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం నగరంలో జరుగుతున్నాయి. ఇందుకోసం రహదారి వెంబడి ఉన్న నిర్మాణాలను అవసరమైన మేరకు తొలగిస్తున్నారు. అదే మార్గంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత నెహ్రూ యువకేంద్రం కార్యాలయం పక్కన ఉన్న ఈ ఆలయం కూడా విస్తరణలో కొంతభాగం కోల్పోనుంది. దీనివల్ల అతిపురాతనమైన ఈ ఆలయం ఉనికి దెబ్బతింటుందని ఆలయ అనువంశిక పూజారులతోపాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి ఈ ఆలయం చిన్నదిగానే ఉన్నా.. స్థానికులు దీన్ని అత్యంత ప్రశస్తమైనదిగా భావిస్తుంటారు, సోమవారాలతోపాటు పరమశివుడికి ప్రీతిపాత్రమైన అన్ని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఇక్కడి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్థానికులు కూడా పెద్దసంఖ్యలో హాజరై శివదర్శనం చేసుకుంటుంటారు. దీనికి దాదాపు మూడువందల ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ పూజారితోపాటు స్థానికులు వెల్లడించారు. ఒడిశాకు చెందిన తారాపూర్ బావాజీ దీని వ్యవస్థాపకుడు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బలగ మెట్టు వరకు ప్రఢాన రోడ్డుకు అనుకుని ఉన్న భూములన్నీ ఆయనకు చెందినవే. నీలకంఠేశ్వర ఆలయాన్ని కూడా బావాజీ తన భూమిలోనే సొంత ఖర్చుతో నిర్మించారు. అప్పటినుంచి ఆయన కుటుంబీకులే వంశపారంపర్యంగా ఆలయ నిత్యార్చనలు, నిర్వహణ బాధ్యతు చూస్తున్నారు. ఆలయ నిర్వహణ కొన్ని మాన్యాలను అప్పట్లోనే బావాజీ కేటాయించారు. అయితే కాలక్రమంలో వాటిని సాగుదారులు సొంతం చేసుకోవడంతో వాటి నుంచి ఫలసాయం గానీ, లీజు సొమ్ము గానీ అందడంలేదు. దాంతో భక్తులు ఇచ్చే విరాళాలు, సొంత సొమ్ముతోనే ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.

రోడ్డు నుంచి లోపలికే ఉన్నా..

కాగా శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరణకు సంబంధించి పెండింగులో ఉండిపోయిన శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ ` కొత్తరోడ్డు పనులు అన్ని వివాదాలు పరిష్కారం కావడంతో కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. విస్తరణకు వీలుగా ఇరువైపులా ఉన్న నిర్మాణాలకు మార్కింగులు ఇచ్చి తొలగిస్తున్నారు. అందులో భాగంగా నీలకంఠేశ్వర ఆలయానికి కూడా మార్కింగ్ ఇచ్చారు. రోడ్డు పాయింటు నుంచి సుమారు పది అడుగుల లోపలికే ఆలయం ఉంటుంది. అయినా మరో ఐదారు అడుగులు అంటే ఆలయ ప్రవేశ ద్వారం దాటి నందీశ్వరుడి వెనుక వైపు వరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగిస్తే ప్రవేశద్వారం పెట్టడానికి వీలుకాదు. పోనీ నందీశ్వరుడిని కొద్దిగా లోపలికి కదుపుదామంటే వందల ఏళ్ల క్రితం నాటి విగ్రహం, దాని ప్రాశస్త్యం.. దాంతోపాటే భక్తుల సెంటిమెంట్లు దెబ్బతింటాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిపై అధికారుల వద్దకు లేదా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి విన్నవించడానికి ఆలయ నిర్వాహకులు, స్థానికులు భయపడుతున్నారు. విస్తరణ నుంచి ఆలయాన్ని మినహాయించి తమ మనోభావాలు కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page