నిశ్శబ్ద మార్పు దేనికి సంకేతం?
- NVS PRASAD

- 4 hours ago
- 3 min read

దేశంలో రెండు ముఖ్యమైన మార్పులు నిశ్శబ్దంగా జరిగిపోయాయి. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకై తాను ముఖ్యమంత్రి పీఠం వదిలేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్‌ను నియమించడం.. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు.. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న చర్య. అలాగే తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్.రవిని పశ్చిమ బెంగాల్‌కు మార్చారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి, డిప్యూటీ ఎనఎసఏగా పనిచేసిన అనుభవం ఉంది. బెంగాల్‌లో పెరుగుతున్న చొరబాట్లు, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఈయన నియామకం జరిగిందనిపిస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో మారుతున్న జనాభా నిష్పత్తి, పెరుగుతున్న చొరబాట్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. బీహార్‌లోని నాలుగు జిల్లాలు (కిషన్‌గంజ్, కటిహార్, పూర్ణియా, అరారియా)తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాలు (మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్) కలిపి ఒక కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. అది జరగాలంటే గవర్నర్ల మార్పు ఈ రెండు రాష్ట్రాల్లో అనివార్యం. ఇది కూడా నిశ్శబ్దంగా జరిగిపోయింది.. కేవలం ఒక రాజకీయ బదిలీ మాదిరిగా. నితీష్‌కుమార్ ఎలాగైతే ముఖ్యమంత్రి నుంచి రాజ్యసభకు వెళ్లారో, గవర్నర్లు కూడా రాష్ట్రాలు మారడం వెనుక అనేక కోణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అత్యంత కీలకమైన దారి. ఇక్కడ జనాభా మార్పులు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతం నేరుగా కేంద్రం ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నక్సలిజం నిర్మూలన తర్వాత, భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాలుగా ఉన్న చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడమే ఈ నియామకాల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ప్రస్తుతం బెంగాల్‌ల్లో ‘సర’ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా శుద్ధీకరణ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. 63 లక్షల ఓట్లు తొలగించారు, ఇంకో 50 లక్షల ఓట్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నెలలో ఓటర్ల తుది జాబితా సిద్ధం కాకపోతే అనివార్యంగా బెంగాల్‌ల్లో టీఎంసీ ప్రభుత్వం మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం దిగిపోయి అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె సుప్రీం తలుపు తట్టారు. కానీ బెంగాల్ హైకోర్టును తప్ప్పుపట్టడానికి న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇలాంటి కీలకమైన సమయంలో సమర్థుడు అయిన గవర్నర్ ఉండడం చాలా అవసరం. రాష్ట్రపతి పాలనలో ఎలక్షన్ కావచ్చు. తర్వాత బెంగాల్‌లోని రెండు జిల్లాలు దినాజ్ పూర్, 24 పరగనాలు జిల్లాతో పాటు బీహార్‌లో కిషన్ గంజ్ కాక ఇంకో మూడు జిల్లాలు.. ఇవన్నీ సిలిగురి కారిడార్‌ని అనుకుని, నేపాల్ సరిహద్దులు, ఇటుపక్క బెంగాల్‌తో బంగ్లాదేశ్ సరిహద్దులు, వీటి గుండా అక్రమ చొరబాటుదారులు ప్రవేశించి ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది దేశం నిండా నిండిపోయి స్థానికంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. వీటన్నికీ చెక్ పెట్టే దిశగా అమిత్ షా, మోడీ, అజిత్ దోవల్ వేసిన భారీ స్కెచ్, నిశ్శబ్దంగా అమలు అవుతుంది. రాజకీయాలకు అతీతంగా, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిహద్దు జిల్లాల్లో స్థానిక జనాభా కంటే చొరబాటుదారుల సంఖ్య పెరగడం అనేది కేవలం ఓటుబ్యాంకు రాజకీయమే కాదు, అది దేశ సార్వభౌమాధికారానికే ముప్పు. సిలిగురి ప్రాంతం గనుక ఇబ్బందుల్లో పడితే, ఈశాన్య రాష్ట్రాలతో మనకు సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు ఆలోచన ఒక విప్లవాత్మక అడుగు కావచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి చుట్టూ ఉన్న ఈ చిన్న భూభాగం కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీనికి ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి. యుద్ధం వంటి పరిస్థితుల్లో శత్రు దేశాలు ఈ చిన్న దారిని దిగ్బంధం చేస్తే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్ వంటి 8 రాష్ట్రాలతో మనకు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇక్కడ కేంద్రంలో ఉన్న పార్టీలు కాకుండా మరొకటి అధికారంలోకి వస్తే, స్థానిక అవసరాల మేరకు పట్టు వదిలేయొచ్చు. అందుకే ఈ ప్రాంతంలోని జిల్లాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా, అక్కడ నేరుగా ఆర్మీ, పారామిలటరీ బలగాల పర్యవేక్షణ పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వాలుంటే సహకరించవు. గవర్నర్ వ్యవస్థ మాత్రమే మందు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో, పొరుగు దేశాలతో సత్సంబంధాలు బలహీనమవుతున్న ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే సరిహద్దు రాష్ట్రాలు ఉండాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. అయితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటూ జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారనేది చెప్పలేం. అందుకే ఇటు బంగ్లా, అటు నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల్లో కేంద్ర పాలన ఉండాలని కోరుకుంటోంది. అలా లేకపోవడం వల్లే పశ్చిమబెంగాల్‌లో చొరబడిన బంగ్లాదేశీయులు ఇప్ప్పుడు దేశంలో అంతర్గత నగరాలకు అంటే.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలకు విస్తరించడం వల్ల స్థానిక వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. సాధారణంగా గొడవలు జరిగే రాష్ట్రాల్లో గవర్నర్లు కేవలం నివేదికలు పంపిస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన వారు క్రియాశీలక వ్యూహకర్తలు. లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్‌కు కాశ్మీర్ వంటి కఠినమైన ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని అణిచివేసిన అనుభవం ఉంది. బీహార్ సరిహద్దుల ద్వారా జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఈయన అనుభవం కీలకం. ఆర్.ఎన్.రవి.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఈయనకు, దేశ వ్యతిరేక శక్తుల నెట్‌వర్క్‌ను ఎలా ఛేదించాలో బాగా తెలుసు. ఇదంతా దేశవ్యాప్తంగా ఎనఆర్‌సీ అమలుకు పునాది. అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, అక్కడ స్మార్ట్ ఫెన్సింగ్ (లేజర్ టెక్నాలజీ) వేగవంతం కానుంది. అక్రమ ఓట్ల తొలగింపుతో బెంగాల్ రాజకీయాల్లో సమూల మార్పులు రావచ్చు.






Comments