top of page

నలుగురు ఉద్యోగుల తొలగింపు.. 40 పాలసీలు తిరస్కరణ

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 5 days ago
  • 2 min read
  • వంజంగి నకిలీ బీమా గుట్టు రట్టుచేసిన టాస్క్‌ఫోర్స్

  • మంచం పట్టిన రోగుల పేరుతో రూ.5 కోట్లు దోపిడీ

  • వైకాపా నేత, బీమా ఏజెంట్లు, ఆధార్ మార్పులపై సీ‘ఐ’డీ?

  • ‘సత్యం’ కథనంతో విచారణ వేగవంతం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మూలన చేరిన ముసలమ్మలు, మంచం పట్టిన కేన్సర్ పేషెంట్ల పేరిట ఆధార్ కార్డుల్లో స్థానికంగా మార్పులు చేయించి, నకిలీ పత్రాలు సృష్టించి చనిపోవడానికి ముందు వివిధ బీమా సంస్థల్లో పాలసీలు కట్టి, అక్కడికి కొద్ది రోజుల్లోనే మరణానంత క్లెయిమ్‌ను కోట్లాది రూపాయల్లో విత్‌డ్రా చేసిన ఆమదాలవలస మండలం వంజంగి గ్రామ ఘటనపై ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. మొత్తం ఈ స్కామ్‌ను సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ ‘నకిలీ బీమా’ పేరుతో ఆధారాలతో సహా ఈ ఏడాది ఫిబ్రవరి 19న సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత నమోదైన కేసు మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసిన మేరకు ప్రభుత్వ రంగ సంస్థ LIC స్పందించి వంజింగి చుట్టపక్కల గ్రామాల పరిధిలో క్లైం అయిన పాలసీలన్నింటినీ క్రాస్ చెక్ చేయించింది. బీమా ఏజెంట్లను సమావేశపరిచి గత మూడేళ్లలో డెత్ క్లైంలపై వివరణ కోరినట్టు తెలిసింది. అంతకు ముందు భారత జాతీయ బీమా సలహా, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)కు పాలసీదారులకు బీమా క్లైం చెల్లించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటాక్, శ్రీరాం, BAJAJ అలియంజ్, ఆక్సిస్ మాక్స్, రిలియలన్స్ నిప్పోన్, ఆదిత్యా బిర్లా సన్, టాటా ఏఐఏ బీమా సంస్థలపై వంజంగికి చెందిన అప్పలనాయుడు వివిధ రూపాల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐఆర్‌డీఎఐ సంబంధిత బీమా సంస్థలకు నోటీసులు జారీ చేసి అంతర్గత విచారణకు ఆదేశించింది. నాలుగు ప్రైవేట్ బీమా సంస్థలు ఇటువంటి క్లైంలు సెటిల్ చేసినట్టు గుర్తించిన యాజమాన్యాలు నలుగురుపై వేటు వేశాయి. ఇందులో బజాజ్, శ్రీరాం, ఆదిత్య బిర్లా, హెచ్‌డీఎఫ్‌సీ స0స్థలకు చెందిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు తెలిసింది. దీంతోపాటు వంజంగి పరిధిలో పాలసీలన్నింటినీ పరిశీలించి 40 తిరస్కరించింది. అవన్నీ ఆధార్‌లో చేర్పులు, మార్పులు చేసినవే కావడం గమనార్హం. వంజంగిలో పాలసీదారులంతా బజాజ్, శ్రీరాం, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆదిత్యా బిర్లా పాలసీదారులే. ఈ సంస్థల్లో బజాజ్, శ్రీరాంలో మూడేళ్లలోపు కట్టిన 40 పాలసీలను తిరస్కరించి, కేవలం రెండు పాలసీలనే కొనసాగించినట్టు తెలిసింది. బీమా క్లైం మొత్తాన్ని వినియోగదారుల న్యాయస్థానం ద్వారా చెల్లించినందున సంబంధిత న్యాయవాదికి సదరు జీవిత బీమా సంస్థలు నోటీసులు పంపినట్టు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారంపై మూడు నెలల క్రితమే ఎస్పీకి గ్రీవెన్స్‌లో వంజంగికి చెందిన అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించకుండా కాలయాపన చేస్తుండడంతో ఈ నెల 11న ఇదే వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడంతో మూడు రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆమదాలవలస పోలీసులకు ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్న విశాఖలో ఉన్న తొమ్మిది ప్రైవేట్ బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ఆ శాఖల అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఇందులో కొన్ని సంస్థలు వంజంగి పరిధిలో ఎటువంటి బీమా పాలసీలను తీసుకోలేదని, డెత్ క్లైం చేయలేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. గ్రామంలో బీమా క్లైం పొందిన లబ్ధిదారుల కుటుంబాలను పోలీసులు ఈ నెల 12,13 తేదీల్లో విచారించినట్టు తెలిసింది. విచారణ అనంతరం బ్యాంకు అకౌంట్ వివరాలను, పాన్, ఆధార్ కార్డులను పోలీసులు తమ వెంట తీసుకువెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. విచారణలో లబ్ధిదారులు కుటుంబాలు స్పష్టమైన సమాచారం పోలీసులకు ఇవ్వలేకపోయారని తెలిసింది. బీమా సొమ్ము ఎవరి అకౌంట్‌లో, ఎంత జమైందన్న విషయాన్ని చెప్పలేదని తెలిసింది. లబ్ధిదారులందరూ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడైన వైకాపా మండల నాయకుడి పేరు చెప్పినట్టు భోగట్టా. ఎం.సంగమయ్య అనే పాలసీదారుడికి వచ్చిన బీమా మొత్తం ఆమదాలవలసలోని ఐసీఐసీఐ బ్యాంకులో జమకాగా, ఆయన బ్యాంకు అకౌంట్‌కు అనుసంధానమైన ఫోన్ నెంబరు మాత్రం ఈ బీమా స్కామ్ సూత్రధారి ప్రధాన అనుచరుడిది కావడం గమనార్హం. దీంతో ఆ సొమ్మును వేరే అకౌంట్‌లోకి బదలాయించడం సులువైంది. ఈమేరకు పోలీసులు ఆధారాలు సేకరించారని భోగట్టా. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన అప్పలనాయుడు నుంచి పోలీసులు రికార్డు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని సీఐడీకి అప్పగించడానికి రంగం సిద్ధం చేయడంతో ఆమదాలవలస పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page