top of page

నవ్విపోదురు గాక.. మాకేటి?!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 18
  • 3 min read

ఆయన దగ్గితే ఆహా.. తుమ్మితే ఓహో .. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికి బీజేపీ పరివారం పుష్కర కాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, అంతర్జాతీయంగా అభివద్ధి చెందుతూ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది కాషాయదళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్‌పేయి హయంతో పోలుస్తుంటారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవముంది? ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణమాలను గమనిస్తే అర్థమవుతుంది. మోదీ వైఫల్యాలు కనిపించకుండా ఆయన భక్తుల అరివీర ప్రచారం ముసుగు తొడిగేస్తున్నా.. తరచూ చోటుచేసుకుంటున్న భౌగోళిక పరిణామాలు ఆ ముసుగును తొలగించి నగ్నసత్యాలను కళ్లకు కడుతున్నాయి. వాజ్‌పేయిని, మోదీని ఒక గాట కట్టడానికి ప్రయత్నించడం ఎంత అసమంజసమో చెప్పే కొన్ని ఉదంతాలు చూద్దాం. ఒక ప్రధాని తలచుకుంటే దేశ ప్రతిష్టను పెంచగలరు లేదా తగ్గించనూగలరు. కానీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రధానమంత్రి కూడా ప్రస్తుత ప్రధానిలా నవ్వులపాలు కాలేదు.. తనను ఎన్నుకున్న దేశాన్ని నవ్వులపాలు చేయలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మోదీ చపలచిత్త విన్యాసాలు చూస్తే మాత్రం మిడిమిడిజ్ఞానం ఉన్నవారు సైతం మోదీ విధానాలను వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయన విధానాలు దేశానికి ఏ రకంగానూ ఉపయోగకరం కావు. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. కానీ మోదీ భక్తులకు అవి కనబడవు.. ఎవరికీ కనబడనివ్వరు. భారతీయ జనతా పార్టీకే చెందిన నాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి నేటి ప్రధాని నరేంద్రమోదీకి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొండంత పౌరుషం ఉంది. విశాలమైన ఛాతీ ఉందని మోదీ పరివారం డప్పు కొట్టుకుంటుంది. కానీ ఆచరణలో అది కనిపించదు. తాము తలుచుకుంటే మోదీ రాజకీయానికి ముగింపు పలుకుతామని ట్రంప్ హుంకరించినా, మోదీతోపాటు భారతీయులు మంచి నటులు అని వ్యంగ్య బాణాలు విసిరినా, తాము ఆడించే తోలుబొమ్మలు భారతీయులు అని ఇజ్రాయెల్ చెప్పినా, ప్రపంచస్థాయి సమావేశాల్లో ఎన్ని అవమానాలు చేసినా, పనికిమాలిన పాకిస్తాన్‌తో మన దేశాన్ని పోల్చుతూ భారతీయులను తక్కువ చేసి హేళనగా మాట్లాడినా ఛాతీలు ఉప్పొంగవు.. పౌరుషం పుట్టుకురాదు. ఎందుకంటే వీటికి అతీతమైన వ్యక్తి పూజకు వారంతా అలవాటుపడ్డారు. గౌరవించడం వేరు.. తలవంచడం వేరు. ఈ వ్యత్యాసం గమనించకపోతే మనం ఇతరులకు లోకువైపోతాం. ఏ దేశ ప్రధాని అయినా ఇతర దేశాల జెండాలను గౌరవిస్తారు. కానీ ఇతర దేశాల జెండా ముందు అసలు తలవంచరు.. సెల్యూట్ చేయరు. కానీ మన ప్రధాని మోదీ అతిచిన్న దేశమైన ఇజ్రాయెల్‌లో ఆ రెండు చేసేశారు. పశ్చిమాసియా యుద్ధానికి ముందు ఆ దేశంలో పర్యటించిన మోదీ ఇజ్రాయిల్ జెండా ముందు తలవంచి, సెల్యూట్ కొట్టారు. పైగా ఇజ్రాయెల్‌ను ఫాదర్ ల్యాండ్ అని అభివర్ణించడం అపాత్రదానం చేయడంలాంటిదే. ఇజ్రాయెల్‌లో సుమారు 1.25 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. కానీ వారికోసం కనీసం ఆ దేశంలో ఒక్క దేవాలయమైనా లేదు. అదే సమయంలో దాని పక్కనే ఉన్న పర్షియన్ దేశమైన ఇరాన్‌లో మహా అయితే 20వేల మందికి మించి హిందువులు ఉండరు. కానీ ఆ దేశంలో 12 ఆలయాలు ఉన్నాయి. కానీ ఆ సంగతి చాలామందికి తెలియదు. హిందువులకు ఒక్క దేవాలయం కూడా లేని ఇజ్రాయెల్ మనకు ‘ఫాదర్ ల్యాండ’ ఎందుకవుతుంది? మోదీ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి ఉవాచించేవారు హిందువులను గౌరవించని దేశాన్ని ఫాదర్ ల్యాండ్ అని కితాబు ఇవ్వడం ఏం ధర్మమో చెప్పాలి. మనపై ఆంక్షలు విధిస్తూ అదుపులో పెట్టాలని చూసే అమెరికా లాంటి దేశాలను నిలదీసే గుండె ధైర్యం కలిగిన నాయకుడు కావాలి.. వారికి మోకరిల్లే నాయకుడు కాదు. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో 1982లో ఇందిరాగాంధీ అమెరికాలో పర్యటించారు. ఆ పర్యటనలోనే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ రష్యాతో కాకుండా భారత్‌ను అమెరికా వైపు ఉండాలని ఒత్తిడి చేశారు. కానీ రీగన్ సమక్షంలోనే బహిరంగంగా ఇందిరా గాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ‘మేం మా స్నేహహస్తాన్ని అందరికీ అందిస్తాం.. ఒకరి కోసం మరొకరి స్నేహాన్ని దూరం చేసుకోం.. మీ ప్రచ్ఛన్నయుద్ధంతో మాకు సంబంధం లేదు’ అని కుండబద్దలుగొట్టారు. సందు దొరికితే చాలు.. ఇందిరను తూలనాడే నేటి నేతలకు అంతటి దమ్ము, ధైర్యం ఉన్నాయా? అదే ఇందిర తాను ప్రధానిగా ఉన్నప్పుడు జెనీవాలో జరిగిన మానవహక్కుల సదస్సుకు వెళ్లిన భారతీయ ప్రతినిధుల బందానికి వాజ్‌పేయిని నాయకుడిగా నియమించారు. ఇదే విషయాన్ని కొందరు వాజ్‌పేయితో ప్రస్తావించగా ‘ఇందిరాగాంధీ మా రాజకీయ ప్రత్యర్థే కావచ్చు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ ఆమె మా దేశ ప్రధాని. ఆమె గౌరవాన్ని కాపాడుతూ నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడం నా కర్తవ్యం’ అని వాజ్‌పేయి సమాధానమిచ్చారు. నాటి రాజకీయాలు ఎంత హుందాగా ఉండేవో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కానీ నేటి రాజకీయ నాయకులు వాడే భాష ఎలా ఉందో మనం చూస్తున్నాం. ‘విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తాను, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తాను, అవినీతి అరికడతాను’ అంటూ హామీలు గుప్పించినవారు.. తీరా అధికారంలోకి వచ్చాక బ్యాంక్ దోపిడీదారులను దేశపు ఎల్లలు దాటించడం.. అంబానీ, అదానీలకు దేశ సంపద దోచిపెట్టడం, పెద్దనోట్లు రద్దు చేసి సంక్షోభం సష్టించడం, కరోనా సమయంలో కంచాలు మోగించడం, దీపాలు ఆర్పడం.. మురుగుకాలువల నుంచి గ్యాస్ తీసి చాయ్ చేస్తాను అనడం’.. వంటివి ఖాళీ డబ్బా మోతలు కావా? ఈ మోతలు కాదు.. కావలసింది సమస్యలను పరిష్కరించగలిగే నికార్సైన నాయకత్వ పటిమ.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page