పాక్-ఇజ్రాయెల్ మధ్య మతం గోడలు!
- DV RAMANA

- 3 days ago
- 3 min read

ఒకవైపు చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో తన దేశాన్ని ఇరాన్, అమెరికా చర్చలకు వేదికనిచ్చిన పాకిస్తాన్ మరోవైపు ఇప్పటికే దుందుడుకుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్‌ను మరింతగా రెచ్చగొడుతున్నది. తద్వారా తన ప్రాబల్యాన్ని దెబ్బతీసే చర్చలు కొనసాగకూడదన్న లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో పాక్ పాలకపెద్దల వాచాలత్వం దానికి మరింత కలిసివస్తున్నది. ఫలితంగా ఇజ్రాయెల్-పాకిస్తాన్‌ల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తున్నదని తీవ్రంగా విమర్శించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చారు. మానవాళి పాలిట ఇజ్రాయెల్ ఒక దెయ్యం అన్నట్లు పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంతే ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ పాకిస్తాన్‌ను టెర్రరిస్టు దేశం అని ఆరోపించింది. ఫలితంగా చర్చల వాతావరణం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. దానికి తగినట్లే సీజ్‌ఫైర్ షరతులకు విరుద్ధంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నందుకు నిరసనగా చర్చలను బహిష్కరిస్తామని ఇరాన్ స్పీకర్ హెచ్చరించారు. ఆ మేరకు ఇరాన్ ప్రతినిధి బందం శనివారం ఉదయం వరకు చర్చల్లో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు బయల్దేరలేదని సమాచారం. తాజా పరిస్థితికి కారణమైన ఇజ్రాయెల్, పాకిస్తాన్‌ల మధ్య గొడవలు, వివాదాలు ఇప్పటివి కావు. 1947లో ఇస్లాం మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడినట్లే.. 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఏర్పడింది. కానీ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ తదితర అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు నిరాకరించాయి. పాకిస్తాన్ కూడా అరబ్ దేశాలకు మద్దతుగా నిలిచి ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించేందుకు ససేమిరా అంది. ఈ వివాదమే 1967లో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో పాకిస్తాన్ నేరుగా యుద్ధం లో పాల్గొనకపోయినా అరబ్ దేశాలకు సపోర్ట్ చేసింది. ఆ దేశాల తరఫున పాకిస్తాన్ వైమానిక దళ పైలట్లు యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1973లో జరిగిన యుద్ధంలోనూ పాక్ వైమానిక దళం సిరియా, ఈజిప్టులకు మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్-పాకిస్తాన్‌ల మధ్య శత్రుత్వం మరింత ముదిరింది. 1981లో ఆపరేషన్ ఒపేరా అనే పేరుతో ఇరాక్‌లోని అణు రియాక్టర్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ సమయంలోనే పాకిస్తాన్ అణుబాంబులు తయారు చేస్తున్నట్లు వెల్లడికావడంతో దానిపైనా ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్ నిజంగా అణుబాంబులు తయారుచేస్తే అవి కచ్చితంగా అరబ్ దేశాలకు కూడా అంది తమకు ముప్పుగా పరిణమిస్తాయని ఇజ్రాయెల్ పాలకులు భావించారు. దీంతో పాక్‌లో ఉన్న కహుతా అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ భావించింది. అయితే పాకిస్తాన్ గగనతలంలోకి లేదా భూభాగంలోకి వెళ్లి వారి అణు కేంద్రంపై దాడి చేయాలంటే సుదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకోసం వారి విమానాల్లో ఇంధనం నింపడానికి లేదా అవి ల్యాండ్ కావడానికి ఒక బేస్ అవసరం. ఆ వెసులుబాటు కోసం ఇజ్రాయెల్ భారత్‌ను సంప్రదించి గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌పోర్టును వాడుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. ఈ సహాయానికి బదులుగా పాకు చెందిన అణు రహస్యాలను, అత్యాధునిక యుద్ధ సాంకేతికతను భారత్‌కు అందిస్తామని ఇజ్రాయెల్ ఆఫర్ చేసింది. కొన్ని నివేదికల ప్రకారం భారత వైమానిక దళం (ఏఐఎఫ్) అధికారులు ఇజ్రాయెల్ ప్రతిపాదనకు అనుగుణంగా ఒక బ్లూప్రింట్ కూడా సిద్ధం చేశారు. కానీ అప్పటికే భారత్-ఇజ్రాయెల్ ప్లాన్ గురించి అమెరికా నిఘా సంస్థ సీఐఏకు ఉప్పందింది. అప్పట్లో ఇజ్రాయెల్ కంటే పాకిస్తాన్‌కే అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఆ కారణంగానే అమెరికా భారత్`ఇజ్రాయెల్ ప్లాన్ గురించి అప్పటి పాక్ అధ్యక్షుడు జియా వుల్ హక్‌ను అప్రమత్తం చేయడంతో కహుతా అణు కేంద్రం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ పరిణామాలను గమనించిన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే భారత్, పాక్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని ఆమె భావించారు. ఒకవేళ దాడి విఫలమైతే అంతర్జాతీయంగా భారత్ దోషిగా నిలబడాల్సి వస్తుందని అనుకున్నారు. అందుకే ఇజ్రాయెల్‌తో కలిసి పాక్ అణుకేంద్రంపై దాడులు చేసే విషయంలో ఆమె వెనక్కి తగ్గారు. అయితే ఆ ఆపరేషన్ కార్యరూపం దాల్చకపోయినా.. అది భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారానికి పునాది వేసింది. 1999లో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ భారత్‌కు సాయం చేసింది. మంచు కొండల్లో దాక్కున్న పాక్ చొరబాటుదారులను గుర్తించడానికి తన నిఘా డ్రోన్లను భారత్‌కు పంపించింది. అలాగే శత్రు స్థావరాలను గుర్తించి అత్యంత కచ్చితత్వంతో నాశనం చేసే లేజర్ టెక్నాలజీని కూడా అందించింది. దీంతో ఇజ్రాయెల్-పాకిస్తాన్‌ల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న విరోధం మరింత ముదిరింది. ఈ కారణంతోనే ఇజ్రాయెల్‌ను ‘ముస్లిం దేశాల శత్రువు’ అంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ముద్ర వేసింది. ఇద్దరు శత్రువులు (భారత్, ఇజ్రాయెల్) కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ తమ దేశ పాస్‌పోర్ట్ విషయంలో కూడా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత చూపిస్తున్నది. పాక్ పాస్‌పోర్ట్‌పై ‘ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుంది’ అని రాసి ఉంటుంది. దీని ప్రకారం పాకిస్తాన్ పౌరులు తమ పాస్‌పోర్ట్‌తో ఇజ్రాయెల్‌కు వెళ్లలేరు. ఒకవేళ ఎవరైనా ఇతర దేశాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి వెళ్లినా పాక్ చట్టాల ప్రకారం శిక్షార్హులవుతారు. అంతేకాదు పాక్ రాజ్యంగం ప్రకారం కూడా ఇజ్రాయెల్‌ను ఒక అక్రమ దేశంగా పరిగణిస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. తాజాగా లెబనాన్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య వివాదం మరోసారి రాజుకుంది.






Comments