పెట్టుబడులే వెండిని పరిగెత్తిస్తున్నాయ్!
- DV RAMANA

- 7 days ago
- 3 min read

స్థానికం నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ప్రస్తుతం బంగారం, వెండి ధరల ధగధగలే హాట్ టాపిక్‌గా మారాయి. బంగారం కంటే వెండి ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కేవలం 30 డాలర్లు ఉన్న ఔన్సు వెండి ధర ఈ ఏడాది జనవరిలో 115 డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 12 నెలý వ్యవధిలోనే 270 శాతానికి పైగా పెరగటం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలపై మార్కెట్ నిపుణులు రÁకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇది నిజమైన డిమాండా లేక కేవలం తాత్కాలిక నీటి బుడగేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం అదుపు లేనివిధంగా సాగుతున్న వెండి ర్యాలీకి పెరిగిన పారిశ్రామిక వినియోగమే ప్రధాన కారణమని భావిస్తూ వచ్చారు. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం అది వాస్తవం కాదని.. ఇన్వెస్టర్లు(మదుపరులు) అపరిమితంగా వెండిపై పెట్టుబడులు పెట్టడమే అసలు కారణమని గణాంకాలతో సహా వెల్లడైంది. వెండి ధరలు ఎన్నడూ లేనంత వేగంగా జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయానికి వెండి ధర కేజీ రూ.4.25 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలను మార్కెట్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వాటిలో మొదటిది పారిశ్రామిక వినియోగం బహుముఖంగా పెరగడం. విస్తత ప్రాచుర్యంలోకి వస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, సోలార్ ప్యానళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ, డిమాండ్ శరవేగంగా పెరుగుతున్నాయి. వీటి తయారీలో వెండిని వినియోగిస్తున్నారు. వాటి డిమాండ్‌కు అనుగుణంగా వెండి వినియోగం కూడా పెరుగుతోంది. రెండో కారణం.. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న పెద్ద అంతరం. కొత్త కొత్త రంగాల్లో వెండి వినియోగం బాగా పెరిగింది. కానీ దానికి అనుగుణంగా సరఫరా జరగడం లేదు. దానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. బంగారం, రాగి, ఇనుము వంటి లోహాల మాదిరిగా వెండి నేరుగా గనుల్లో లభించి లోహం కాదు. జింక్, మరికొన్ని ఖనిజాలను తవ్వి తీసి.. వాటిని శుద్ధి చేసేటప్పుడు వాటిలోంచి ఉప ఉత్పత్తి(బై ప్రొడక్ట్)గా మాత్రమే వెండి లభిస్తుంది. అందువల్ల పెరుగుతున్న అవసరాలకు తగినంతగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయకంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న వెండి డిమాండ్ కాలానుగుణంగా విభిన్న పారిశ్రామిక రంగాలకు విస్తరిస్తుంటే.. ఇటీవలి కాలంలో పెట్టుబడుల మార్కెట్లోనూ వెండి వెలుగులీనుతోంది. షేర్‌మార్కెట్ మాదిరిగానే ఈటీఎఫ్‌లు, సిల్వర్ బాండ్ల రూపంలో వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇప్పుడిదే వెండి పరుగులకు కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక డిమాండ్ కంటే ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. నవంబర్ 2025లో ప్రచురితమైన ‘సిల్వర్ ఇన్‌స్టిట్యూట’ నివేదిక ఈ ఆసక్తికరమైన అంశాలను బహిర్గతం చేసింది. దాని ప్రకారం పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం తగ్గిందట! ఈ రంగం నుంచి వెండి డిమాండ్ నాలుగు శాతం మేరకు తగ్గిందని నివేదికలోని అంశాలను ఉటంకిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణుడు కీర్తన్ షా వెల్లడించారు. కానీ అదే సమయంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) మార్కెట్‌లో వెండి డిమాండ్ ఏకంగా 225 శాతం మేరకు ఎగబాకింది. అంటే ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలో మెజారిటీ వాటా పెట్టుబడిదారుల(ఇన్వెస్టర్లు)దే నని స్పష్టమవుతోంది. పారిశ్రామిక వినియోగం కంటే రిటైల్ ఇన్వెస్టర్ల వల్లే సిల్వర్ రేట్ల బబుల్(బుడగ) క్రియేట్ అయ్యింది. వాస్తవానికి ఇన్వెస్టర్లు వెండి ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసినప్పుడు.. వెనుక ఉన్న ఫండ్ హౌస్‌లు భౌతికంగా వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ధరలను మరింత పెంచుతోందని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇదంతా ఫోమో వల్ల క్రియేట్ అయిన అనవసర రేట్ల ర్యాలీ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. వెండి ధరలు పరుగులు తీస్తున్న ఈ సమయంలో ఆశపడి కొత్తగా పెట్టుబడులు పెట్టడం చేటు చేస్తుందని కీర్తన్ షా వంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండికి ఒక భయంకరమైన చరిత్ర ఉందని, గతంలో ఇలాగే ర్యాలీ జరిగినప్పుడు ఒకేసారి 80-90 శాతం విలువ కోల్పోయిందంటున్నారు. షార్ట్ సెల్లర్లు తమ నష్టాలను పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ధరలను పైపైకి నెడుతున్నాయని ఇది ఆరోగ్యకర పరిణామం కాదంటున్నారు. ఈ దశలో వెండిని కొనడం కంటే మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని సూచిస్తున్నారు. మరోవైపు పసిడి ధర కూడా ఎగిసిపడుతోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సు ఐదువేల డాలర్లు దాటేసింది. భారతీయ మార్కెట్‌లో గురువారం ఉదయం పది గ్రాముల మేలమి(24క్యారెట్లు) బంగారం రూ.1.78 లక్షలు దాటేసింది. ఈ ఊపు చూస్తుంటే త్వరలోనే రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలను తాకుతుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నెలలోనే అంతర్జాతీయంగా స్వర్ణం ధర 17 శాతం పెరిగిపోయింది. అదే గత ఏడాది మొత్తం మీద పెరుగుదల 64 శాతమే. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(ఎల్‌బీఎంఏ) సర్వే ప్రకారం ఈ ఏడాది చివరి నాటకి బంగారం ఔన్సు ధర 7150 డాలర్లకు పెరగవచ్చు. అదే జరిగితే మన దేశంలో పది గ్రాముల ధర రూ.2.50 లక్షలకు చేరుతుంది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా, నాటో మధ్య విభేదాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వయంప్రతిపత్తిపై సందేహాలు, యుద్ధ భయాలు, అమెరికన్ డాలర్ విలువ తగ్గుతుండటం వంటి పరిణామాలతోపాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల తమ ఆర్థిక వ్యవస్థల స్థిరత్వం కోసం విపరీతంగా బంగారం కొనుగోలు చేసి పోగుపెడుతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో పసిడి మరింత మిడిసిపడటం ఖాయమంటున్నారు. ఇదే పరిస్థతి కొనసాగితే సమీప భవిష్యత్తులో పది గ్రాముల బంగారం రూ.9 లక్షలకు పెరగవచ్చంటున్నారు.










Comments