top of page

పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

కాల్పుల విరమణ ప్రకటించి ఇరాన్, అమెరికాలు చర్చలకు సిద్ధం కావడంతో ‘హమ్మయ్యా.. యుద్ధం సమసిపోవచ్చు’ అని ఆశపడిన ప్రపంచ దేశాల ఆశలు అడియాశలు కావడమే కాకుండా వాటి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. సీజ్‌ఫైర్, చర్చలకు ముందు వరకు ఇరాన్ మాత్రమే హర్మూజ్ జలసంధిలో తనను వ్యతిరేకించి దేశాల నౌకలను అడ్డుకునేది. టోల్ పన్ను చెల్లించిన రవాణా నౌకలను విడిచిపెట్టేది. దాంతో కొద్దోగొప్పో పెట్రో ఉత్పత్తులు, ఇతర వాణిజ్య నౌకలు జలసంధిని దాటి గమ్యస్థానాలకు చేరుకోగలిగేది. కానీ చర్చలు విఫలమైన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటు ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళాలు హర్మూజ్‌లో జలరవాణానే టార్గెట్ చేసుకుంటున్నాయి. చర్చల్లో తమ షరతులను తిరస్కరించిన ఇరాన్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న ట్రంప్ ఆ దేశాన్ని నాశనం చేస్తానని హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌కు చెందిన విద్యుత్ ప్లాంట్లను నాశనం చేయడంతోపాటు ఆ దేశ నౌకాశ్రయాల నుంచి ఒక్క నౌక కూడా బయటకు రాకుండా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దానికోసం హర్మూజ్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. తదనుగుణంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదేశాలు జారీ చేయడంతో ఇరాన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం నుంచే అమెరికా యుద్ధనౌకలు హర్మూజ్ చుట్టూ మోహరించి రవాణాను స్తంభింపజేశాయి. మరోవైపు ఇరాన్ దళాలు సైతం అమెరికా యుద్ధనౌకలు జలసంధిలోకి ప్రవేశిస్తే ముంచేస్తామని హెచ్చరిస్తూ చుట్టూ మోహరించారు. ఇలా రెండు దేశాల ముట్టడిలో హర్మూజ్ చిక్కుకోవడంతో జలరవాణా, చమురు, గ్యాస్ ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరాన్ నౌకలను, ఆ దేశానికి పన్ను కట్టి ప్రయాణించే నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించిన అమెరికా నేవీ ఆ మేరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, ఇరాన్ పోర్టులతో సహా ఇరాన్‌లోకి నౌకలు ప్రవేశించే అన్ని మార్గాలను మూసి వేసింది. దీనికి ప్రతిగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ కూడా తీవ్రంగానే స్పందించింది. హర్మూజ్‌ను దిగ్బంధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అదే జరిగితే గల్ఫ్ దేశాల్లోని అన్ని నౌకాశ్రయాలను నాశనం చేస్తామని హెచ్చరించింది. ఇరుదేశాల పంతాల ఫలితంగా హర్మూజ్‌తోపాటు పర్షియన్‌గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లతోపాటు ఎర్ర సముద్రం గుండా జలరవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటి వరకు హర్మూజ్ జలసంధి నుంచి కొన్ని నౌకలైనా చమురు, ఇతర సరుకులు రవాణా చేయగలిగాయి. ఇప్పుడు ఆ అవకాశాలన్నీ మూసుకుపోయాయి. ఓ వైపు అమెరికా, మరోవైపు ఇరాన్ దిగ్బంధించడంతో మధ్యప్రాచ్యంలో ఎక్కడి నౌకలు అక్కడే నిలిచిపోయాయి. ఇంతకుముందు ఒక్క ఇరాన్‌తోనే ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు అమెరికా దాడుల భయం కూడా తోడైందని నౌకల యజమానులు ఆందోళన చెందుతున్నారు. చర్చలు విఫలమైన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి ఒక్క ఆయిల్ నౌక కూడా బయల్దేరలేదని, సంక్షోభం అంతగా ముదిరిపోయిందంటున్నారు. చివరిసారిగా ఈ నెల 11న రెండు చైనా ఆయిల్ నౌకలు మాత్రమే హర్మూజ్ జలసంధిని దాటాయి. అమెరికా హెచ్చరికల తర్వాత రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కొన్నాళ్లు పరిస్థితులు ఇలాగే కొనసాగితే చైనా, ఇండియాలతో సహా మెజారిటీ దేశాలు సంక్షోభంలో చిక్కుకుంటాయని ఆయిల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చర్చలు విఫలం కావడానికి ఇరానే కారణమని ఆరోపిస్తూ ఆ దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీసి ఒంటరిని చేయాలని పంతం పట్టిన ట్రంప్‌కు మిత్రదేశాల నుంచి మాత్రం సహకారం లభించడంలేదు. ఇరాన్‌పై సైనికచర్య విషయంలో గతంలోనూ మొండిచేయి చూపిన నాటో, యూరోపియన్ దేశాలు.. హర్మూజ్‌ను దిగ్బంధించి ఇరాన్‌ను ఒంటరిని చేయాలన్న ట్రంప్ తాజా వ్యూహానికి సైతం చిరకాల మిత్రపక్షాల నుంచి అదేవిధమైన ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ఈ పోరులో తాము భాగస్వాములం కాలేమని స్పష్టంగా చెప్పేశాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ దీనిపై మాట్లాడుతూ అమెరికా నేతృత్వంలో ఇరాన్‌పై చేపట్టే ఎలాంటి సైనిక చర్యల్లోనూ బ్రిటన్ పాల్గొనబోదని తేల్చిచెప్పారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడం లేదా దిగ్బంధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తుతుందని.. ఇది సామాన్య ప్రజలపై విద్యుత్, గ్యాస్ బిల్లుల భారాన్ని విపరీతంగా పెంచుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది మా యుద్ధం కాదు, మమ్మల్ని ఈ వివాదంలోకి లాగకండి’ అంటూ ఆయన ట్రంప్‌కు పరోక్షంగా గట్టి సంకేతాలే పంపారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అమెరికాకు తన సహాయ నిరాకరణను నిర్మొహమాటంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంతర్జాతీయ సముద్ర చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ.. హర్మూజ్ జలసందినిó దిగ్బంధించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ స్పందిస్తూ ఈ సమస్యకు సైనిక చర్యల ద్వారా కాకుండా శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని సూచించారు. హర్మూజ్ దిగ్బంధాన్ని ఉపసంహరించుకుని అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణను మరో 45 నుంచి 60 రోజుల వరకు పొడిగించాలని ఆయన సూచించారు. అయితే ట్రంప్ మాత్రం దిగిరావడంలేదు. మిత్రదేశాల నుంచి మద్దతు లభించకపోయినప్పటికీ ఆయన ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ తమ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఇరాన్ సంబంధిత ఓడలపై కఠినమైన నిఘా ఉంచుతామని, నాకాబందీని అమలు చేస్తామని కూడా ప్రకటించింది. తన ముఖ్య మిత్రపక్షాలే వెనక్కి తగ్గినా డొనాల్డ్ ట్రంప్ ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని, దిగ్బంధనాన్ని ఒంటరిగా ముందుకు తీసుకెళ్తుండటంతో దీనివల్ల రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page