పాలైతే ఐదు.. నీలైతే ఒకటా!
- Prasad Satyam
- Feb 25
- 2 min read
మరణాల ప్రకటనలో ఎందుకీ వివక్ష?
ఎమ్మెల్యే ముందు బాధితులు చెప్పిందేమిటి?
అధికారులెందుకు భుజాలు తడుముకుంటున్నారు?
ఇంకా ల్యాబ్ రిపోర్టులంటూ సన్నాయి నొక్కులు దేనికి?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాజమహేంద్రవరంలో పాలల్లో కల్తీ జరిగితే.. ఐదుగురు మరణించారని అధికారికంగా ప్రకటించారు. దీని మీద ముఖ్యమంత్రి దగ్గర్నుంచి, ఆ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వరకు అందరూ ఒకటే స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ కలుషితమైన నీరు తాగి కొందరు మరణిస్తే.. కేవలం ఒక్కరే ఆ కారణంగా చనిపోయారని అధికారికంగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. ఎందుకీ తేడా? పాలైతే ప్రైవేటు వ్యక్తుల వ్యాపారం. ఇందులో కూలెంట్ కలిసిందనో, మరొకటి కలిసిందనో చెప్పి చావులకు బాధ్యుడ్ని చేయడం సులువు. ఎక్స్‌గ్రేషియా ఎవరు ప్రకటించారన్న విషయం పక్కన పెడితే.. ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నప్ప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఇక్కడ నీరు కలుషితమైందని చెబితే అది ప్రభుత్వ వైఫల్యం. సురక్షిత మంచినీరును అందించాల్సిన ప్రభుత్వం మురికి నీరు పంపించడం ద్వారా డయేరియాను వ్యాపింపజేసిందని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తాయని తెలిసినా తెలియనట్టు నటించడం. వాస్తవానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దానికంటే చావులు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఎక్కడో తాగునీటిలో కాలువ నీరు చేరడం, లేదా మరో కలుషిత జలం కలవడం. దాన్ని కాదంటూనే డయేరియాను కట్టడి చేయడానికి యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాటర్ శాంపిల్స్ విశాఖపట్నం ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు బుధవారం సాయంత్రానికి వస్తుందని, అప్పటికి గాని దేనివల్ల డయేరియా ప్రబలిందనేది చెప్పలేమని అధికారులు బయటకు చెబుతున్నా వాస్తవాలు వారికి తెలుసు. తాజాగా కార్పొరేషన్ ఒక కరపత్రాన్ని మంగళవారం రాత్రి విడుదల చేసింది. అందులో మొదటి పాయింట్ కార్పొరేషన్ సరఫరా చేసిన నీటిని ఎవరూ తాగొద్దని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ కూడా మొదటి రోజే ఇదే విషయం నొక్కి వక్కానించారు. వైన్‌షాపు నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకున్న లిక్కర్‌లోనూ, కుళాయి గొట్టాల నుంచి కార్పొరేషన్ తీసుకున్న నీటిలోనూ కల్తీ ఉందని ఏ ల్యాబ్ కూడా నిర్ధారించదు.. అది స్వయంగా వ్యవస్థ కోరుకుంటే తప్ప. అయినా అంతా అయిపోయిన సంత తర్వాత నీటి శాంపిల్స్ తీశారు. అప్పటికే ట్యాంకులు శుభ్రం చేయడం, కొత్తనీరు ఎక్కించడం, క్లోరినేషన్ చేయడం పూర్తయిపోయింది. డయేరియా వల్ల కేవలం ఒక్కరే చనిపోయారని అధికారులు చెబుతుండవచ్చు. ఎందుకంటే.. ఈ సంఖ్య ఎంత పెరిగితే, వారి ఉద్యోగాలకు అంత రిస్క్. కానీ ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఏం జరిగిందో తెలుసు. స్వయంగా మంగళవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే గొండు శంకర్ సైకిల్ కూడా వెళ్లనంత ఇరుకు సందుల్లో దూరి మరీ ఇంటింటికీ వెళ్లి పరామర్శించారు. ఇందులో చనిపోయిన కుటుంబ సభ్యులు ఆయనకు చెప్పిన వ్యాధి లక్షణాలేమిటో ఆయనకు తెలుసు. నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అనేది వేరే విషయం. కానీ కనీసం ఆ చావుకు ఒక గుర్తింపు కూడా లేకపోవడమే ఇక్కడ బాధాకరం. రాజమండ్రి లాగే ఇక్కడ కూడా నీరు కాకుండా పాలో, మరొకటో అయివుంటే ఈ సంఖ్య అందరికంటే ముందు ప్రభుత్వమే ప్రకటించివుండేదేమో!
ఇప్ప్పుడు ఉత్పాతానికి ఒక కారకుడు కావాలి. అది అధికార యంత్రాంగంలోని వ్యక్తి కాకూడదు. రాజమండ్రి ఘటన లాగే ప్రైవేటు వ్యాపారస్తుడైతే మరీ మంచిది. బహుశా అందుకేనేమో మేదరవీధికి ఆనుకొని ఉన్న ఖలీల్ చికెన్ సెంటర్‌ను మూసేయమని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేశారు. ఇక్కడ ఎవరూ కావాలని నీటిని కలుషితం చేయరు. వాటర్ వర్క్స్ ఏఈ గాని, ఆ ఏరియా ఫిట్టర్‌కు గాని ఆ అవసరం లేదు. కాకపోతే ముందు ఆలోచన లేకుండా కాలువలకు ఆనుకొని పైప్‌లైన్లు విస్తరించినప్ప్పుడు ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిందని, ఇలా కాలువల్లోను, కల్వర్టుల కింద నుంచి వెళ్లిన లైన్లను మారుస్తామని కార్పొరేషన్ ప్రకటిస్తే మంచిది.






Comments