పిల్లపాస్‌లకు ‘ఇన్‌ఫ్లుయన్స’ అయ్యారు!
- Prasad Satyam
- 7 days ago
- 1 min read
మణికంఠ జిరాక్స్ యజమానులను విచారిస్తున్న ఎస్పీ
జిల్లావ్యాప్తంగా మరికొందరు బయటపడే అవకాశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రథసప్తమి ఉత్సవానికి ప్రభుత్వం జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌ల కంటే వంద శాతం ఎక్కువ పాస్‌లు చేతబట్టుకొని దర్శనానికి వచ్చిన తీరుపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని మరీ గురువారం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుకనున్న మణికంఠ జిరాక్స్ యజమానులైన తండ్రీకొడుకులు కొండ, మణి, సంతోష్‌లను టూటౌన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కలర్ జిరాక్స్‌తో పాటు అనేక రకాల జిరాక్స్‌లు తీయడంలో మణికంఠ జిరాక్స్ పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తుంది. వీరు దాదాపు 40వేల పాస్‌లు జిరాక్స్ తీశారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి కంప్యూటర్‌లో హార్డ్‌డిస్క్‌ను కూడా సీసీఎస్ పోలీసులు పట్టుకెళ్లారు.
జిల్లాలో తాము సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని, ఆర్గానిక్‌గా కాకుండా ఫాలోవర్స్ ఫార్మింగ్ ద్వారా లక్షల సంఖ్యలో తమ సోషల్‌మీడియా ఖాతాను ఫాలో అవుతున్నవారు ఉన్నట్టు చూపించి ఇన్‌ఫ్లుయెన్సర్లుగా చెలరేగిపోతున్న అనేకమంది ఈ మణికంఠ జిరాక్స్‌లోనే సొంతంగా పాస్‌లు తయారుచేయించుకున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా మీడియాకు డీపీఆర్‌వో కార్యాలయం ద్వారా డ్యూటీ పాస్‌లు జారీ చేశారు. ఈ ఏడాది కొత్తగా జర్నలిస్టు కుటుంబంలో ఇద్దరు వెళ్లడానికి వీరుగా ఫ్యామిలీ పాస్ కూడా ఇచ్చారు. అయితే మీడియా కంటే తాము ఇంకా పెద్ద శక్తులమని, తమది పెద్ద వ్యవస్థ అని భావించిన చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీడియా మాదిరిగానే పాస్‌లు తయారుచేయించినట్లు తెలుస్తుంది. అలాగే పనిలో పనిగా ప్రభుత్వం జారీ చేసిన అనేక పాస్‌లకు కలర్ జిరాక్స్‌లు కూడా తీసి వారి ఫాలోవర్స్‌లో ముఖ్యులకు పంచినట్లు తెలుస్తుంది. జిల్లా అధికార యంత్రాంగం కూడా వీరితో చెట్టపట్టాలేసుకొని తిరగడంతో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లే ఒక భ్రమలోకి వెళ్లిపోయారు. రథసప్తమి సందర్భంగా హెలికాఫ్టర్ రైడ్‌ను కలెక్టర్ ప్రారంభించినప్ప్పుడు ఈనాడు, సాక్షి, ఏబీఎన్ ఛానల్స్ మైక్‌లు పట్టుకొని కలెక్టర్ బైట్ కోసం ఎదురుచూస్తుంటే, ఆయన మాత్రం శ్రీకాకుళం సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో మాట్లాడారు. అంటే జిల్లా యంత్రాంగం వీరికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో పాస్‌లను ఎక్కువగా ముద్రించి ప్రభుత్వ యంత్రాంగమే తమకు ఇచ్చిందని పంచిపెట్టడంతో ఇబ్బడిముబ్బడిగా జనాలొచ్చేశారని ఎస్పీ భావిస్తున్నారు. కస్టమర్ తీసుకువచ్చినదాన్ని జిరాక్స్ తీసి ఇవ్వడాన్ని నేరంగా పరిగణించలేం కాబట్టి కేవలం మణికంఠ జిరాక్స్ యాజమాన్యాన్ని విచారించి వదిలేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారిచ్చిన స్టేట్‌మెంట్ మేరకు ఇన్ని పాస్‌లు పుట్టించిన దానికి ఆధారాలు దొరికితే మాత్రం ఎస్పీ కచ్చితంగా కఠినంగా వ్యవహరించకమానరు.










Comments