top of page

పతనం ప్రమాదంలో చైనా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

అతి సర్వత్ర వర్జయేత్.. అన్నారు పెద్దలు. దీనర్థం ఏమిటంటే.. ఏదైనా మితంగానే ఉండాలి. మోతాదు మించితే అనర్థాలు తప్పవు. మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాకు పోటీగా ప్రపంచంలో ఒక స్థిరమైన మహాశక్తిగా ఎదుగుతున్న దేశం గా ఒక్క చైనా మాత్రమే నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు నూతన ఆవిష్కరణల్లోనూ ముందువరుసలో ఉన్న చైనా తయారీ రంగంలోనూ అద్భుత పనితీరు కనబరుస్తూ.. అక్కడ తయారుకాని వస్తువు ఏదీ ఉండదన్న భావనను ప్రపంచానికి కలిగించింది. అది దాదాపు వాస్తవం కూడా. కానీ ఒక్క విషయంలో చేసిన అతి ఇప్పుడు ఆ దేశ ప్రగతిని, ఆధిపత్యాన్నే పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ముంగిట నిలిపిందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జనాభా విషయంలో గతంలో.. ఇప్పుడూ.. చైనా తీసుకున్న చర్యలు కొత్త చిక్కులు సృష్టిస్తున్నాయి. గత శతాబ్దంలో జనాభా విపరీతంగా పెరిగిపోవడం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలకు పెద్ద సమస్యగా ఉండేది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణ చర్యలు ముమ్మరమయ్యాయి. కానీ ఈ శతాబ్దంలో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. దశాబ్దాల తరబడి మితిమీరిన నియంత్రణ చర్యల ఫలితంగా ఇప్పుడు జనాభా క్షీణత మొదలై ప్రపంచ దేశాలకు అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఈ విషయంలోనే జనాభా పతనం అనే అతితీవ్ర సవాలును ఎదుర్కొంటున్నది. ఇది కేవలం అంకెల మార్పునకే పరిమితం కాలేదు. చైనా ఆర్థిక వృద్ధి, ప్రపంచవ్యాప్త ఆధిపత్యం, మార్కెట్ సామర్థ్యం .. ఇలా అన్నింటినీ తలకిందులు చేయగల ఒక దారుణమైన పతనంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు, మార్టిన్ క్యాపిటల్ సంస్థ సీఈఓ రాడ్ డి.మార్టిన్ చైనా ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తూ.. ‘ఇది ఇక మార్చలేని ఒక చారిత్రక సంక్షోభం’ అని వ్యాఖ్యానించారు. గత ఏడాది చైనా జనసంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 140 కోట్ల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత.. క్రమంగా తిరోగమించడం ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ తర్వాత జనాభాపరంగా రెండో పెద్ద దేశంగా కొనసాగుతున్నది. అక్కడ జననాల కంటే మరణాల రేటు గణనీయంగా పెరిగింది. 2010వ దశకం మధ్యలో ఏడాదికి 1.8 కోట్ల మంది పిల్లలు జన్మించేవారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆ సంఖ్య కోటి కంటే తక్కువకు పడిపోయింది. ఆధునిక చైనా ఏర్పడిన తర్వాత జననాల రేటు ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 సంవత్సరం నాటికి చైనా జనాభా సగానికి పడిపోవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కొందరు విశ్లేషకులైతే 30-40 కోట్లకు పడిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత దుస్థితికి 1980` 2016 మధ్య అక్కడి ప్రభుత్వం చేసిన వన్ చైల్డ్ పాలసీ(ఒక్క సంతానం)యే ప్రధాన కారణం. ఈ విధానం వల్ల చైనీయులు మగపిల్లలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా లింగ నిష్పత్తి తీవ్రంగా దెబ్బతిని, పెళ్లి చేసుకుని పిల్లలను కనే వయసులో ఉన్న యువతుల సంఖ్య కనిష్టానికి పడిపోయింది. ‘పిల్లలను కనేందుకు మహిళలే లేనప్పుడు, ప్రభుత్వం ఎంతమంది పిల్లలనైనా కనండి అని ప్రోత్సహిస్తూ ఎన్ని రాయితీలు ఇచ్చినా జనాభా పెరుగుదల సాధ్యం కాదు. ఇన్నాళ్లూ చైనా సాధించిన అసాధారణ ఆర్థిక వృద్ధికి అక్కడి శ్రామిక వర్గమే (వర్కింగ్ క్లాస్) వెన్నెముకగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. 15` 64 ఏళ్ల మధ్య వయసున్న పని చేసే జనాభా సంఖ్య వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పన్నులు చెల్లించే యువత తగ్గిపోవడం, పెన్షన్లు, వైద్య ఖర్చులు అవసరమయ్యే వృద్ధులు పెరిగిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురిచేస్తున్నది. ఇది అంతర్గత వినియోగ మార్కెట్‌ను కూడా బలహీనపరుస్తుంది. జనాభా క్షీణతను అడ్డుకోవడానికి చైనా ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వన్ చైల్డ్ పాలసీని ఎత్తివేసి ముగ్గురు పిల్లల వరకు కనడానికి పౌరులకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా పిల్లలను కనే దంపతులకు నగదు బహుమతులు, గృహ వసతి వంటి రాయితీలు అందిస్తున్నారు. ప్రసూతి సెలవుల పొడిగింపు, విద్యుత్, విద్యా ఖర్చులను తగ్గించడం వంటి ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారు. అయినా కూడా చైనా యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. విపరీతంగా పెరిగిన ఇళ్ల అద్దెలు, కఠినమైన పని వేళలు, పిల్లల చదువుల విషయంలో తీవ్రమైన పోటీ, రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయమే దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇదొక£ తీవ్రమైన సామాజిక సమస్యగా మారిపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో దీన్ని సర్దుబాటు చేయలేని పరిస్థితి. చైనాలో చోటుచేసుకుంటున్న ఈ జనాభా మార్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పని చేసే వయసున్న యువత సంఖ్య తగ్గడం వల్ల చైనా జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. కార్మికుల కొరత వల్ల యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్, వియత్నాం, మెక్సికో వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఒక దేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే దాని సైనిక, సాంకేతిక అభివృద్ధికి భారీగా నిధులు అవసరం. కానీ జనాభా కుచించుకుపోతున్న తరుణంలో చైనా తన అంతర్గత సంక్షేమ పథకాలకే అధిక నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఇది అమెరికాతో సాగుతున్న ఆధిపత్య పోటీలో చైనాను వెనక్కి నెట్టేయడమే కాకుండా ఆ దేశ సమగ్ర నిర్మాణాన్ని, భవిష్యత్తును మార్చేసే సంక్షోభం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page