top of page

పభుత్వ శాఖల్లో.. ప్రోటో‘కాల్‌’మనీ కామనే!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 21, 2025
  • 2 min read
  • విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు

  • రెవెన్యూ, మరికొన్ని శాఖలో వసూళ్లు షరామామూలే

  • రాష్ట్ర, జిల్లా అధికారుల అవసరాలు తీర్చేది ఆయా శాఖల సిబ్బందే

  • ప్రోటోకాల్‌ ముసుగులో తమ ఇళ్ల అవసరాలు తీర్చుకుంటున్న వైనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘దొరికిన వాడే దొంగ’ అన్న నానుడి అన్ని ప్రభుత్వ శాఖలే కాదు.. అన్ని వ్యవస్థలకూ వర్తిస్తుంది. దానికి రెవెన్యూ శాఖ ఏమాత్రం మినహాయింపు కాదు. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్‌ మర్యాదలు చూసే కీలకమైన శాఖగా పేరుంది. ఆ శాఖ పరిధిలోని భూములు, ఇతరత్రా వ్యవహారాల సంగతి పక్కన పెడితే.. ఈ ప్రోటో‘కాల్‌’ పేరుతో జరిగే ఆ శాఖ పరిధిలోని కిందిస్థాయి కార్యాలయాల నుంచి జరిపే అనధికార వసూళ్లు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. దీనికి విశాఖ రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న తాజా పరిణామాలే నిదర్శనం. రెవెన్యూ శాఖను ఒక కుదుపు కుదిపేసిన విశాఖ ‘పప్పు, ఉప్పు’ రచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. విశాఖ డీఆర్వోపై ఫర్యాదు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాయడంపై రెవెన్యూ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలో ఉంటున్న తన కుటుంబానికి ఇక్కడి రెవెన్యూ అధికారుల ద్వారా కిరాణా సరుకులు సరఫరా చేయించుకుంటున్న డీఆర్వో భవానీశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీలేఖ ఆ లేఖ కోరారు. ఇది కాస్త రచ్చ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వో, ఆర్డీవోలపై వేటు వేసింది. వారిని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి సరెండర్‌ చేస్తూ వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా రెవెన్యూతో సహా అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రోటోకాల్‌ వివాదాలు, అవినీతి ఆరోపణలకు పరోక్షంగా ప్రభుత్వం కాడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు

తాజా వివాదం ఒక్క విశాఖ రెవెన్యూ అధికారులకే పరిమితం కాదన్న విషయం ఆ శాఖలో అధికారులందరికీ తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారులతో పాటు, రెవెన్యూ, పోలీస్‌, సంక్షేమశాఖల జిల్లా అధికారులందరూ ప్రోటోకాల్‌ పేరుతో దిగువస్థాయి అధికారులు, సిబ్బంది ద్వారా తమ ఇళ్లకు కావాల్సిన పప్పులు, ఉప్పులు సరఫరా చేయించుకోవడమనే దుస్సంప్రదాయం పాతుకుపోయింది. జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల ప్రోటోకాల్‌ అవసరాలను తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు తరచూ మీట్‌ అవుతుంటారు. జిల్లా ఉన్నతాధికారులు నివసించే బంగ్లాల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం కొంత మొత్తం ప్రభుత్వం జమ చేస్తుంటుంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), రెవెన్యూ డివిజనల్‌ అధికారుల(ఆర్డీవో)కు నిర్వహణ ఖర్చులు పరిమితంగానే ఉంటాయి. కానీ ఈ ఖర్చులను ఆయా కేంద్రాల్లోని తహసీల్దార్లు భరిస్తుంటారు. నిర్వహణ ఖర్చులతో పాటు, అధికారుల ఇళ్లకు అవసరమయ్యే నెలవారీ సరుకులను ప్రోటోకాల్‌ పేరుతో మండల స్థాయి అధికారులే ఖర్చులు భరించి సమకూరుస్తుంటారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తంతే. విశాఖ ఆర్డీవో శ్రీలేఖ కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లే అన్ని చోట్లా జరుగుతుంటుంది. అయితే విశాఖ డీఆర్వో, ఆర్డీవోల మధ్య చాన్నాళ్ల నుంచి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ ఉక్రోషంతోనే డీఆర్వోపై నిత్యావసర సరుకుల నెపంతో ఆర్డీవో శ్రీలేఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులకు చేసే ప్రోటోకాల్‌ ఖర్చులకు లెక్కలు రాసే పరిస్థితి ఉండదు. మంత్రులు, కమిషనర్లు పర్యటనలకు వచ్చేటప్పుడు చేసే ప్రోటోకాల్‌ మర్యాదల ఖర్చులకు ప్రభుత్వం నామమాత్రంగానే చెల్లింపులు జరిపేది. గతంలో మిసిలేనియస్‌ ఖర్చుల్లో వీటిని చూపించి కొంత మొత్తం వెచ్చించేవారు. కానీ ఇప్పడు దాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రోటోకాల్‌ నిర్వహణ రెవెన్యూ యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారిపోయింది.

ఈ మర్యాదలు మామాలే

ప్రోటోకాల్‌ నిర్వహణ అంటే ముందు గుర్తుకొచ్చేది రెవెన్యూ అధికారులే. విశాఖ డీఆర్వో, ఆర్డీవో మధ్య ముదిరిన వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు ఆలోచనలో పడ్డారు. మంత్రులు, కమిషనర్లు, కార్పొరేషన్‌ చైర్మన్ల పర్యటనలు, ప్రోటోకాల్‌ మర్యాదలు చేయడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం చెల్లించకపోతే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలన్న ప్రశ్న ఎప్పటి నుంచో రెవెన్యూ అధికారుల్లో వినిపిస్తోంది. ఇదే ప్రోటోకాల్‌ పేరుతో ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల ఇళ్లకు సరుకులు పంపించడం కొత్తేమీ కాదు. బదిలీపై వచ్చే జిల్లాస్థాయి అధికారులకు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ విలాస వస్తువుల నుంచి వారు నివాసం ఉండే బంగ్లా, భవనాల్లో టీవీ, ఏసీ వంటి సకల సౌకర్యాలు కల్పించే అనధికార బాధ్యత ఆయా శాఖల దిగువస్థాయి అధికారులు, ఉద్యోగులదే. వారే ఏవో పాట్లు పడి ఆ డబ్బులు సమకూర్చుతుంటారు. బంగ్లా నిర్వహణ, ద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి ప్రతి నెలా ఒక అధికారికి ఇండెంట్‌ పెడతారు. ఇక పండగల సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని శాఖల అధికారుల విషయంలోనూ ఇదే విధంగా జరుగుతోంది. రెవెన్యూ . ఇతర రాష్ట్ర అధికారుల ప్రోటోకాల్‌ మర్యాదలకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులే ఎక్కవగా ఖర్చు చేస్తారు. వీరు తమ పరిధిలోని రేషన్‌ డీలర్లు, వీఆర్వోలకు టార్గెట్‌ పెట్టి వీటికి డబ్బులు దండుతుంటారు. బీసీ, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారులు ఈ విషయంలో వసతిగృహాల అధికారులు, వారి సంఘం ద్వారా వసూలు చేసి ప్రతి నెలా పెద్దమొత్తాల్లో చెల్లిస్తుంటారు. ఉన్నతాధికారుల ప్రోటోకాల్‌ పేరుతో సంక్షేమశాఖ జిల్లా అధికారులు వార్డెన్ల నుంచి వసూలు చేయడం సర్వసాధారణం. ఇలా అన్ని శాఖల్లోనూ ప్రోటోకాల్‌ పేరుతో ఇంటికి పప్పులు, ఉప్పులు సరఫరా చేయించుకోవడం అనవాయితీగా మారిపోయింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page